Share News

నేత్రపర్వం గరుడోత్సవం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:10 AM

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్యోత్సవాలు మొదలు అనేక ఉత్సవాలను నిర్వహిస్తారు. వాటిలో భక్తులకు అత్యంత సుపరిచితమైనవి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు. నిత్యారాధనల్లో జరిగే లోటుపాట్లకు ప్రాయశ్చిత్తంగా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. పూర్వం ఏడాదిలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని చరిత్ర చెబుతోంది.

నేత్రపర్వం గరుడోత్సవం

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్యోత్సవాలు మొదలు అనేక ఉత్సవాలను నిర్వహిస్తారు. వాటిలో భక్తులకు అత్యంత సుపరిచితమైనవి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు. నిత్యారాధనల్లో జరిగే లోటుపాట్లకు ప్రాయశ్చిత్తంగా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. పూర్వం ఏడాదిలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలుజరిగేవని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు... ఏటా ఒకసారి, అధికమాసం వచ్చిన సంవత్సరంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు నిర్వహించేవి కాబట్టి, అత్యంత ఘనంగా జరిగేవి కాబట్టి, పరబ్రహ్మ అయిన నారాయణుడికి జరిగేవి కాబట్టి వీటికి ‘బ్రహ్మోత్సవాలు’ అనే పేరు వచ్చింది. వెయ్యేళ్ళకు పూర్వం తిరుమలలో సౌకర్యాలు పెద్దగా ఉండేవి కాదు. అప్పట్లో ధ్వజారోహణం, అవరోహణం మాత్రం తిరుమలలో చేసి...మిగిలిన ఉత్సవాలను తిరుశుకపురి అంటే తిరుచానూరులో జరిపేవారు. భగవద్‌ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఆ పరిస్థితిని చక్కదిద్దారు. అన్ని ఉత్సవాలు తిరుమలలోనే జరగాలని మంగళాశాసనం చేశారు. తదనుగుణంగా ఆలయం చుట్టూ వీధుల నిర్మాణం జరిగింది. ఆలయ సంప్రదాయాలన్నీ వ్యవస్థీకృతమయ్యాయి.


తిరుమల బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజున నిర్వహించే గరుడోత్సవం అత్యంత ప్రశస్తమైనది. ‘వేదాత్మా విహగేశ్వరః’ అంటారు. అంటే గరుత్మంతుడు వేద స్వరూపుడు. శ్రీమన్నారాయణుడు తన దేవేరులతో గరుడ వాహనం మీద వేంకటాచలానికి విచ్చేసి, పుష్కరిణిలో జలక్రీడలు ఆడేవారని వరాహపురాణం చెబుతోంది. భగవంతుని క్రీడా వినోదం కోసం వైకుంఠంలో ఉన్న వెంకటాద్రి పర్వతాలను గరుత్మంతుడు తన భుజాలమీద తీసుకువచ్చి సువర్ణముఖి తీరంలో ఉంచాడని మార్కండేయ పురాణం పేర్కొంటోంది. ఈ పర్వతాలను కృతయుగంలో ‘వృషాద్రి’ అని, త్రేతాయుగంలో ‘గరుడాద్రి’ అని, ద్వాపరయుగంలో ‘శేషశైలం’ అని, కలియుగంలో ‘వేంకటాద్రి’ అని పిలుస్తారని వామన పురాణం వివరిస్తోంది. కాబట్టి తిరుమల క్షేత్రంలో గరుడునికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ‘దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వా నేకధా సర్వదా సః శ్రీశం శ్రీమాన్‌ సేవతే వైనతేయః...’ అంటే గరుత్మంతుడు విష్ణువుకు కేవలం వాహనం మాత్రమే కాదు. ఆయనను దాసునిగా, మిత్రునిగా, విసనకర్రగా, ఆసనంగా, ధ్వజంగా... ఇలా అనేక విధాలుగా సేవిస్తున్నాడు. వాహనం, ధ్వజం కాబట్టే... గరుడ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గరుడ ధ్వజావరోహణంతో పూర్తవుతాయి. ధ్వజ స్తంభం మీద గరుడుడు నిలిచి... ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తాడు. ఉత్సవాలు ముగిసిన తరువాత అక్కడి నుంచే వీడ్కోలు చెబుతాడు.


ధ్రువమూర్తి ఆభరణాలతో...

గర్భాలయంలో స్థిరంగా ఉండే ధ్రువమూర్తికి, ఉత్సవాలలో ఊరేగించే ఉత్సవమూర్తికి గరుడవాహన ఉత్సవంలో ఎలాంటి భేదం కనిపించదు.. తిరుమల మూలమూర్తి... పుట్టలో వెలిసిన విగ్రహ స్వరూపం. మలయప్పకోన ప్రాంతంలో దొరికిన విగ్రహ స్వరూపం శ్రీ మలయప్పస్వామి. ఇద్దరూ స్వయంవ్యక్తమూర్తులే. గరుడోత్సవం రోజున మలయప్పస్వామివారికి నిత్యం గర్భాలయంలో ధ్రువమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల తదితర విశిష్టాభరణాలను ధరింపజేస్తారు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. గరుడసేవలో ధ్రువమూర్తికి, ఉత్సవమూర్తికి భేదం లేదు కాబట్టి... ఆ సమయంలో మలయప్పస్వామి దర్శనం అత్యంత శుభప్రదం, మోక్షదాయకం అని పెద్దలు చెప్పారు. కాగా ప్రతి మాసం పౌర్ణమి రోజున స్వామికి గరుడవాహన సేవను నిర్వహిస్తారు.

శ్రీవారి సారె

గరుడోత్సవం భక్తులకే కాదు... శ్రీవారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన పట్టు వస్త్రాలను ఆ రోజున, తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం నుంచి శ్రీగోదాదేవి ఆండాళ్‌ అమ్మవారి తరఫున పంపిన పూలమాలలను, చిలుకను స్వామి ధరిస్తారు. సామాన్యశకం 1516లో శ్రీకృష్ణదేవరాయలు కళింగ దేశ జైత్రయాత్రను ముగించిన తరువాత, గోదాదేవి చరిత్రను తెలుగులో ‘ఆముక్త మాల్యద’ పేరుతో రచించి, తిరుమల శ్రీవారికి అంకితం ఇచ్చారు. ఆ సందర్భంలో... ఆండాళ్‌ జన్మస్థలమైన శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పుష్పమాలికలను తెప్పించి, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ సేవనాడు స్వామికి అలంకరించే ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. అలాగే చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి (పూర్వం తిరుపతి అంబరెల్లా ఛారిటీస్‌) వారు ఆరు పెద్ద గొడుగులు, మూడు చిన్న గొడుగులు... మొత్తం తొమ్మిది గొడుగులను తయారు చేసి... కాలినడకన తిరుమలకు తీసుకువచ్చి, స్వామివారికి సమర్పిస్తారు. వాటితోపాటు శ్రీవారికి కుళ్ళాయి, వక్షస్థల లక్ష్మీదేవికి పావడలు, తిరుచానూరు పద్మావతీదేవికి రెండు పెద్ద గొడుగులు. పసుపు, కుంకుమ, చందనం తదితరాలను ‘శ్రీవారి సారె’గా ఒక వెదురుబుట్టలో సమర్పిస్తారు.

డీ.ఎన్.వీ ప్రసాద్ స్థపతి 9440525788

ఈ వార్తలనూ చదవండి:

అడవిని గెలిచిన ధీర

కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు

Updated Date - Sep 18 , 2026 | 12:14 AM