సాగర గర్భంలో సాహసి
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:55 AM
ఎన్నో వింతలు, విశేషాలను తనలో దాచుకున్న సముద్ర గర్భాన్ని శోధించాలనే తపన... అతుల్యా బెల్గాండ్‌ను కొత్త దారిలోకి మళ్లించింది. తొలి భారతీయ మహిళా కమర్షియల్ స్కూబా డైవర్‌గా...
ఎన్నో వింతలు, విశేషాలను తనలో దాచుకున్న సముద్ర గర్భాన్ని శోధించాలనే తపన... అతుల్యా బెల్గాండ్‌ను కొత్త దారిలోకి మళ్లించింది. తొలి భారతీయ మహిళా కమర్షియల్ స్కూబా డైవర్‌గా నిలిచేలా చేసింది. ఆసక్తి, ధైర్యం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్న అతుల్య విలక్షణమైన ప్రయాణం ఇది.
‘‘కేరళలోని పట్టాంబీకి సమీపంలో ఉన్న కురువన్‌పాడి మా స్వస్థలం. అదొక మారుమూల ప్రాంతం. చుట్టూ నదులు, చెరువులు, ప్రవాహాలు ఎక్కువే. నా స్నేహితులతో కలిసి చెరువు దగ్గర ఆడుకోవడం, ఈత కొట్టడం నా దినచర్యలో ఒకభాగం. ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరు అడిగినా పోలీస్ అధికారి అవుతానని చెప్పేదాన్ని. సముద్రం లోతుల్లోకి వెళ్ళాలని, అందులో వింతల్ని చూడాలనీ కలలు కనేదాన్ని. క్రీడలంటే నాకు బాగా ఇష్టం. అన్ని ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. స్కూబా డైవింగ్ గురించి అప్పట్లో నాకు తెలీదు. త్రిస్సూర్‌లో బీఏ చదువుతున్నప్పుడు కెరీర్ గురించి మా క్లాస్‌లో చర్చ జరిగింది. ‘‘మహిళలు ఇంకా సురక్షితమైన వృత్తులనే ఎంచుకుంటున్నారు. రిస్క్ తీసుకొనేవాళ్ళకోసం ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఉదాహరణకు స్కూబా డైవింగ్... దాన్ని చేపట్టడానికి అమ్మాయిలెవరూ ఆసక్తి చూపించరు’’ అని మా లెక్చరర్ చెప్పిన మాటలు నాలో ఆలోచన రేకెత్తించాయి. ‘అదేదో నేనే ఎందుకు ప్రయత్నించకూడదు?’ అనుకున్నాను. స్కూబా డైవింగ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం ప్రారంభించాను. జల ప్రపంచంలో అన్వేషించడం అనే ఆలోచన నాలో ఎంతో ఉత్కంఠ కలిగించింది. నాకు అప్పటికే ఈతలో ప్రావీణ్యం ఉండడం కూడా నేను అటువైపు ఆకర్షితురాల్ని కావడానికి మరో కారణం. కష్టపడి నా తల్లిదండ్రుల్ని ఒప్పించాను. కానీ... కోవళంలో స్కూబా డైవింగ్ శిక్షణకు వెళ్ళినప్పుడు... నేను మాత్రమే మహిళను కావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి... శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాను. కేరళ నుంచి తొలి మహిళా స్కూబా డైవర్‌ని నేనే.
ఆ శిక్షణ ఉచితంగానే...
నా డిగ్రీ పూర్తి కావడానికి ముందే... స్కూబా డైవింగ్ శిక్షకురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాను. కేరళలో మూడేళ్ళ పాటు కోస్టల్ పోలీ్‌సకు శిక్షణ ఇచ్చాను. ఆ తరువాత అండమాన్‌లో ఏడాది పాటు పని చేశాను. ఆ సమయంలోనే... కమర్షియల్ స్కూబా డైవర్ కావాలనే ఆలోచన వచ్చింది. అయితే మన దేశంలో తగిన శిక్షణ సదుపాయాలు లేవు. ప్రపంచంలో కూడా ఇలాంటి శిక్షణ సంస్థలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. విదేశాల్లో శిక్షణ తీసుకొనే స్థోమత లేకపోవడంతో ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నాను. కానీ నా గురించి సౌతాఫ్రికాకు చెందిన జాక్ డైవ్ ఛెస్ట్ అకాడమీ నిర్వాహకులకు తెలిసింది. ‘‘మీకు కమర్షియల్ డైవింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉందా?’’ అని అడిగారు. ‘‘ఆ శిక్షణకు పాతిక లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది. నాకు అంత ఆర్థిక స్థోమత లేదు ’’ అని చెప్పాను. నా నైపుణ్యాన్ని, ఇష్టాన్ని గుర్తించి... మూడు నెలలపాటు ఉచిత శిక్షణ కోసం సౌతాఫ్రికాకు నన్ను ఆహ్వానించారు. ‘ఇంటర్నేషనల్ మెరైన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్’ (ఐఎంసిఎ) సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ మహిళా కమర్షియల్ స్కూబా డైవర్‌గా నేను చరిత్రలో నిలవడానికి వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని జీవితాంతం మరచిపోలేను.
మరిన్ని సాహసాలు చేస్తా...
సముద్రం అంటే నేలమీద నుంచి కనిపించేది మాత్రమే కాదు. అసంఖ్యాకమైన వింతలు, రహస్యాలు ఆ కెరటాల అడుగున దాగి ఉన్నాయి. డైవర్‌గా ఆ లోతుల్లోకి వెళ్ళి, గంటల సమయం గడపాల్సి ఉంటుంది. సముద్ర జీవుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. సౌతాఫ్రికాలో శిక్షణ తరువాత... అక్కడే సూపర్‌వైజర్‌గా ఉద్యోగం దొరికింది. కమర్షియల్ డైవింగ్ ఎక్కువగా సాంకేతికతతో ముడిపడి ఉంటుంది. నీటి అడుగున ఉండే పైప్‌లైన్లు, ఇంటర్‌నెట్ కేబుల్స్ నిర్వహణ, వెల్డింగ్ లాంటి పనులు దీనిలో భాగంగా ఉంటాయి. శరీర దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యం, సాహస ప్రవృత్తి కావాలి. క్రమశిక్షణ, సముద్రంలో స్థితిగతులపై గట్టి అవగాహన తప్పనిసరి. వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే... హెలికాఫ్టర్ నుంచి డైవింగ్ లాంటి మరిన్ని సాహసాలకు సిద్ధమవుతున్నాను. మరోవైపు విద్యార్థుల కోసం క్లాసులు నిర్వహిస్తున్నాను. మహిళలు ఈ రంగంలోకి ఎక్కువ సంఖ్యలో రావాలనేది నా ఆకాంక్ష. అందుకోసం కేరళలో ఒక స్కూబా డైవింగ్ శిక్షణ కేంద్రం స్థాపించాలనేది నా లక్ష్యం.’’
‘మొదట్లో... సముద్ర గర్భంలో ఎలక్ట్రిక్ యంత్రాలను ఆపరేట్ చెయ్యడానికి భయంగా ఉండేది. క్రమంగా సుక్షితమైన పద్ధతులన్నిటినీ తెలుసుకున్నాను. ఈ మధ్యే ఒక ఓడకు ప్రమాదం జరిగింది. సముద్రంలోకి మా బృందం వెళ్ళి... శిథిలాలను పైకి తీసుకురావడానికి వారానికి పైగా సమయం పట్టింది.’
Also Read:
అక్టోబర్ 3న ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’: సీఎం చంద్రబాబు
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు