Share News

ఆ దేహమూ విలువైనదే

ABN , Publish Date - May 29 , 2026 | 01:48 AM

ఒక జెన్‌ గురువుకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. వారిలో చాలామంది జ్ఞానసిద్ధి పొందడానికి అతను తోడ్పడ్డాడు. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు ఆ శిష్యులు...

ఆ దేహమూ విలువైనదే

జెన్‌ కథ

ఒక జెన్‌ గురువుకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. వారిలో చాలామంది జ్ఞానసిద్ధి పొందడానికి అతను తోడ్పడ్డాడు. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు ఆ శిష్యులు వెళ్ళి, ఇతరులకు ఉపదేశాలు చేసేవారు. కానీ ఒక ముఖ్య శిష్యుడు మాత్రం గురువునే అంటిపెట్టుకొని ఉండేవాడు. అతనికి కూడా శిష్యగణం ఏర్పాటయింది. కొత్తగా వచ్చేవారికి బోధలు చేస్తూ, గురువుకు శుశ్రూష చేస్తూ గడిపేవాడు.

కొన్నాళ్ళకు గురువు దేహాన్ని చాలించాడు. అతని భౌతికకాయం దగ్గర ఆ ముఖ్య శిష్యుడు కూర్చొని, వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. ఇది గమనించిన ఆ శిష్యుడి శిష్యులు ‘ఇదేమిటి? ఈయనను ‘జ్ఞాని’ అని కదా అందరూ భావిస్తారు! మరి తన గురువు మరణిస్తే ఇంత దుఃఖిస్తున్నారేమిటి? ఇతరులు దీన్ని గమనిస్తే... మనల్ని చూసి ‘ఇలాంటివాని శిష్యులా మీరు?’’ అని ఎగతాళి చేస్తారేమో?’ అనుకున్నారు. ‘‘మహాశయా! మీరు మాకు ఇంతకాలం జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆత్మతత్త్వాన్ని అర్థమయ్యేలా విశదీకరించారు. ఇప్పుడు మీ గురువుగారు మరణిస్తే... చిన్న పిల్లవాడిలా ఇలా ఏడవడం సరైనది కాదు. ఆయన మరణ వార్త విని ప్రజలందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏడుపు ఆపండి. కన్నీరు తుడుచుకోండి’’ అని అన్నారు.

అప్పుడతను ‘‘తప్పో, ఒప్పో, మంచిదో, చెడ్డదో, సరైనదో, కాదో... నేను దుఃఖాన్ని మాత్రం ఆపుకోలేను. ఏడవకుండా ఉండలేను. కన్నీరు రాకుండా ఆపలేను. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? ఎవరో ఏదో అనుకుంటారని భయపడి... సహజంగా రాలుతున్న ఈ కన్నీటిని ఆపి, ఏ దుఃఖం లేనివాడిలా గంభీరంగా కనిపించడానికి, కృత్రిమంగా ఉండడానికి అంగీకరించలేను’’ అన్నాడు.


అప్పుడు అతని శిష్యులు ‘‘మీరే కదా... ‘ఆత్మ సత్యం, ఆత్మ నిత్యం. నశించేది శరీరమే’నని మాకు బోధించారు. ఇప్పుడు మీ గురువుగారి నశించిన శరీరం కోసం ఇలా ఏడిస్తే ఎలా? ఆయన ఆత్మ మరణించలేదు కదా?’’ అని అడిగారు.

‘‘అవును. నేను మీకు అలా బోధించినది నిజమే. ఇప్పుడు నేను ఏడుస్తున్నది మా గురువుగారి ఆత్మ గురించి కాదు... ఆయన శరీరం గురించే. పంచభూత నిర్మితమైన శరీరం చివరకు పంచభూతాల్లోనే కలిసిపోతుందని నాకూ తెలుసు, మీకూ అదే చెప్పాను. మా గురువుగారి శరీరం అలా కాబోతున్నందుకే ఈ దుఃఖం. ఇది ఎంత మంచి శరీరం! ఇలాంటి శరీరం, అంత మంచి హృదయం ఉన్న దేహం ఈ ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడైనా ఉద్భవిస్తుందా? ఈ భూదేవిని పులకింపజేస్తుందా?’’ అంటూ మళ్ళీ అతను వెక్కివెక్కి ఏడ్చాడు.

తమ గురువులకు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి చిన్మయానంద కూడా ఇదేవిధంగా స్పందించారని వారి జీవిత చరిత్రలు తెలియజేస్తాయి.

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 01:48 AM