లైకుల వేటలో..!
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:27 AM
కొన్ని విషాదాలు గుండెలను పిండేస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుకొండల్లో గడ్డకట్టుకుపోయిన రెండు ప్రాణాలు ఓ మొబైల్ ఫోన్ ఇచ్చిన శాపాలు. సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలనే...
కొన్ని విషాదాలు గుండెలను పిండేస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుకొండల్లో గడ్డకట్టుకుపోయిన రెండు ప్రాణాలు ఓ మొబైల్ ఫోన్ ఇచ్చిన శాపాలు. సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న నేటి తరం పోకడలకు నిదర్శనం.
19 ఏళ్ల వీక్షిత్ రాణా, 13 ఏళ్ల పియూష్ కుమార్‌లకు హిమాచల్‌లోని మంచు కొండలు, కోనలతోపాటు వారి వెంట ఉండే కుక్కలే ప్రపంచం. కానీ ఈ అన్నదమ్ములకు తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ వారి జీవితాల్లోకి ప్రవేశించాక ఆ ప్రపంచమే మారిపోయింది. ఆ చిన్న తెరపై కనిపించే రీల్స్, కంటెంట్ క్రియేషన్ మాయలో పడి ప్రకృతి వైపరీత్యాన్ని కూడా గమనించలేకపోయారు. వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసినా, సోషల్ మీడియాలో ఫాలోవర్లను మెప్పించే సాహసం కోసం వారు మంచు శిఖరాల వైపు అడుగులేశారు. చివరికి మంచు తుపానులో చిక్కుకుని వారు శవాలుగా మారినా, వారి పెంపుడు కుక్క నాలుగు రోజులపాటు తిండీతిప్పలు లేక ఆ దేహాలను కాపలా కాయడం ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించింది.
నిషేధాల వెనుక నిజమెంత?
ఈ విషాదం ఒక్క హిమాచల్ ప్రదేశ్‌ది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త సమస్య. అందుకే ఫ్రాన్స్ ప్రభుత్వం 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధానికి చట్టం తెస్తోంది. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఇక మన దేశంలో ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, కేవలం చట్టాలు చేస్తే సమస్య తీరిపోతుందా? అనేదే అసలు ప్రశ్న.
తల్లిదండ్రులూ...
ఇక్కడ అసలు సిసలైన సమస్య ‘ఎలిఫెంట్ ఇన్ ది రూమ్’ (అందరికీ తెలిసినా విస్మరించే పెద్ద సమస్య) లాంటి తల్లిదండ్రుల ప్రవర్తనే. నేటి మిలీనియల్స్, అంతకంటే పెద్దవారు గుర్తింపు కోసం, సోషల్ స్టేటస్ కోసం ఫోన్లలో గంటల తరబడి గడుపుతున్నారు. పిల్లలను ఫోన్ పక్కన పెట్టమని శాసించే పెద్దలు, తాము మాత్రం ఆ మాయలో మునిగిపోవడం తగదనేది మానసిక నిపుణుల మాట.
డిజిటల్ డిటాక్స్
అయితే ‘జెన్‌జీ’ అని పిలిచే నేటి యువతలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తోంది. నిరంతరం అల్గారిథమ్స్ గుప్పిట్లో బతకడం కంటే, ఆఫ్‌లైన్ జీవితమే ప్రశాంతమని వారు గుర్తిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. యువత ఇప్పుడు ‘పోస్టింగ్ జీరో’ వైపు మొగ్గు చూపుతోంది. అంటే కంటెంట్‌ను కేవలం వినోదం కోసమే చూస్తున్నారు తప్ప, లైకుల కోసం తాము పరితపించడం తగ్గుతోంది. డిజిటల్ తెరలను పక్కనపెట్టి నిజమైన స్నేహాలు, అభిరుచులకు సమయం కేటాయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
For More National News And Telugu News