బంధాలకు రక్ష
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:18 AM
రక్షాబంధనం మన సంస్కృతికి ప్రతీక. కుటుంబాలలోని సోదరీసోదరుల ఆత్మీయానుబంధానికి సంకేతంగా... సోదరి రక్ష కట్టడం, ఆమెకు అన్ని వేళలా రక్షణగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేయడం దీనిలోని విశేషం. ఇది రక్షాబంధన్‌గా, రాఖీపౌర్ణమిగా దేశమంతటా నిర్వహించుకొనే వేడుక.
రక్షాబంధనం మన సంస్కృతికి ప్రతీక. కుటుంబాలలోని సోదరీసోదరుల ఆత్మీయానుబంధానికి సంకేతంగా... సోదరి రక్ష కట్టడం, ఆమెకు అన్ని వేళలా రక్షణగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేయడం దీనిలోని విశేషం. ఇది రక్షాబంధన్‌గా, రాఖీపౌర్ణమిగా దేశమంతటా నిర్వహించుకొనే వేడుక.
శ్రావణమాసం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం. శ్రవణం నక్షత్రం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. శ్రవణం నక్షత్రం రోజున వచ్చే పున్నమి కలిగిన మాసాన్ని ‘శ్రావణ మాసం’ అంటారు. శ్రావణ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది. ఇది ఉపనయనం అయిన వారి ఉపాకర్మ సంస్కారాలకూ, వేదాధ్యయనానికీ అనువైన రోజు. జంథ్యాల పౌర్ణమిగానూ ఇది ప్రసిద్ధి చెందింది. ఇదే రోజున రక్షా బంధన ఉత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయం. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేసే వేడుక. ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, త్యాగం, రక్షణ... వీటన్నిటి సమ్మేళనం కుటుంబం. సోదరీసోదరుల మధ్య నెలకొనే బంధం మరింత విశేషమైనది. కుటుంబంలో మహాలక్ష్మిలా భావించే సోదరి చేతితో రక్షను కట్టించుకొని... ఆమెకు జీవితాంతం రక్షణగా ఉంటానని సోదరులు చేసే వాగ్దానం... రక్షాబంధనం.
పురాణాల్లో, చరిత్రలో...
అయితే, పౌరాణిక, చారిత్రక గాథలను పరిశీలించినప్పుడు... రక్ష కట్టడం అనేది కేవలం సోదరీ సోదరులకు మాత్రమే పరిమితం కాలేదని తెలుస్తుంది. రక్షాబంధనం ప్రాశస్త్యాన్ని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించాడనీ, దేవ దానవ యుద్ధంలో బృహస్పతి సూచన మేరకు ఇంద్రుడికి శచీదేవి కంకణధారణ చేసిందని... ఇలా పురాణాల్లో పలు కథలు కనిపిస్తాయి. చారిత్రకంగా చూస్తే... ఒక కథ ప్రకారం, బహదూర్‌షా మేవాడ్‌పై దండయాత్రకు సంకల్పించినప్పుడు... ఉదయపూర్ మహారాణి కర్నావతి తన రాజ్యాన్ని రక్షించాల్సిందిగా మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీ పంపి విజ్ఞప్తి చేసింది. బహదూర్‌షాను హుమాయూన్ ఓడించి, తన సోదరభావాన్ని ప్రకటించాడు. రాజపుత్ర వనితలు తమ భర్తలకు యుద్ధ సమయాల్లో రక్షలు కట్టడం ఆనవాయితీ. తుల్జాపూర్ భవానీదేవి నుంచి ఖడ్గంతో పాటు రక్షా కంకణాన్ని కూడా శివాజీ పొందినట్టు చెబుతారు.
ఇలా చేయాలి...
బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు శ్రీమహావిష్ణువు పాతాళలోకంలో ఉండిపోతే... శ్రీమహాలక్ష్మి అక్కడికి వెళ్ళి, బలికి రక్ష కట్టి... తన భర్తను వైకుంఠానికి తీసుకువెళ్ళిందని, ఆ రోజు శ్రావణ పౌర్ణమి అని మరో కథ ఉంది. రక్షాబంధనం సమయంలో దాన్ని గుర్తు చేసుకోవాలని చెబుతూ... ఈ వేడుక ఆచరణ విధానాన్ని పూర్వులు పేర్కొన్నారు. దాని ప్రకారం... సోదరీమణులు సోదరులకు తిలకం దిద్ది... ‘‘యేన బద్ధో బలీ రాజా/ దానవేంద్రో మహాబలః/ తేన త్వా మభి బధ్నామి/ రక్షే మాచల మాచలం’’ అనే శ్లోకాన్ని పఠిస్తూ రక్షాబంధనం చేయాలి. అనంతరం హారతి ఇచ్చి, సోదరులకు తీపి పదార్థాలను తినిపించాలి. అక్కలకు తమ్ముళ్ళు, అన్నలకు చెల్లెళ్ళు నమస్కరించి దీవెనలు అందుకోవాలి.
ఈ వార్తలను కూడా చదవండి
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
పొగాకుపై అపరాధరుసుంను రద్దు చేయాలి