Share News

హితమా? ప్రియమా?

ABN , Publish Date - May 08 , 2026 | 12:48 AM

ఒక వ్యక్తి శారీరకమైన అవయవానికి కార్డియాలజిస్టుగా చికిత్స చేస్తూ ఉంటాను. అదే సమయంలో... ఆ వ్యక్తి హృదయంలోని నిశ్శబ్దమైన అరల్లో సూక్ష్మమైన, నిరంతరమైన...

హితమా? ప్రియమా?

యోగా

ఒక వ్యక్తి శారీరకమైన అవయవానికి కార్డియాలజిస్టుగా చికిత్స చేస్తూ ఉంటాను. అదే సమయంలో... ఆ వ్యక్తి హృదయంలోని నిశ్శబ్దమైన అరల్లో సూక్ష్మమైన, నిరంతరమైన సంభాషణ ఒకటి కొనసాగుతూ ఉంటుంది. అది స్కెతస్కో్‌పలో వినిపించదు. ఈసీజీలో కనిపించదు. అయినప్పటికీ అది మన జీవితాల గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ సంభాషణ భారతీయ తత్త్వశాస్త్రంలో లోతుగా వర్ణించిన రెండు పురాతనమైన శక్తుల మధ్య జరుగుతుంది. అవి: శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సు అంటే హితమైనది, మనకు మంచి చేసేది, మన ఉన్నతికి దోహదం చేసేది. ప్రేయస్సు అంటే ప్రియమైనది. అది ఇంద్రియ సంతృప్తి, సౌకర్యం, స్వల్పకాలిక తృప్తి లాంటివాటికి... అంటే తాత్కాలికమైన సుఖాన్ని అందించేవాటికి ప్రతీక. అది మనలోని ఆవేశాలను, కోరికలను, తరచుగా మన బలహీనతలను ప్రేరేపిస్తుంది. ఈ వైరుధ్యాన్ని ‘కఠోపనిషత్తు’లో ఋషులు చక్కటి స్పష్టతతో వివరించారు.

అది ఒక సంస్కృతి

మరొకవైపు శ్రేయస్సు ఉన్నతమైన మేలుకు మార్గం. తక్షణమే అది సులభం కాకపోవచ్చు. కానీ ఎదుగుదలకు, అంతర్గతమైన పరిశుద్ధతకు, అంతిమంగా మోక్షానికి దారి తీసే ఎంపిక. నేటి వేగవంతమైన ప్రపంచంలో, ప్రేయస్సు తాలూకు ఆకర్షణ ఇదివరకటికన్నా బలంగా మారింది. తక్షణం పొందే తృప్తి అనేది కేవలం ఒక ధోరణి మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. అనారోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు కావచ్చు, భావోద్వేగ ప్రతిచర్య కావచ్చు, నిరంతరం గుర్తింపు కోసం ఆరాటపడడం కూడా కావచ్చు... దీర్ఘకాలంలో మనకు ఏది మంచిది అనే దానికన్నా... ఇప్పుడు ఏది బాగుంటుందనుకుంటామో దాన్నే మనం పదేపదే ఎంచుకుంటూ ఉంటాం. మానసికమైన దృక్పథంలోంచి చూసినప్పుడు, ఇది ‘ఆలస్యమైపోయిన తృపి’్త అనే భావనకు దగ్గరగా ఉంటుంది. భవిష్యత్‌ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటూ... తక్షణం లభించే ప్రతిఫలాలను తిరస్కరించే వ్యక్తులు భావోద్వేగపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. లింబిక్‌ వ్యవస్థ, ప్రీఫ్రంటల్‌ కార్టెక్ట్స్‌ మధ్య జరిగే పరస్పర చర్య ఉదాహరణతో దీని గురించి న్యూరోసైన్స్‌ వివరిస్తుంది.

దాన్నే ఎంచుకోండి...

ప్రతిరోజూ హృదయపూర్వకమైన ధ్యానం ద్వారా... మనస్సు క్రమంగా ప్రశాంతతంగా మారుతుంది, శుద్ధిని పొందుతుంది. శుద్ధి చేసుకొనే అభ్యాసం మనల్ని ప్రేయస్సు వైపు లాగే భావోద్వేగ ముద్రలను (సంస్కారాలను) తొలగించడానికి తరచుగా సాయపడుతుంది. ప్రార్థన మనల్ని ఒక ఉన్నతమైన మూలంతో అనుసంధానిస్తుంది. మన అంతర్గతమైన సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది. కాలం గడిచేకొద్దీ ఈ అభ్యాసాలు అంతర్గతమైన అవగాహనను పెంపొందిస్తాయి. ప్రేరణలను అనుసరించి ప్రవర్తించే వ్యక్తి ముందుగానే వాటిని గమనించడం మొదలుపెడతాడు. ఆ విరామమే పరివర్తనాత్మకంగా మారుతుంది.


ఒక వ్యక్తి ప్రేయస్సు కన్నా శ్రేయస్సును చైతన్యవంతంగా ఎంచుకోవడానికి అది అనుమతిస్తుంది. హృదయం సూక్ష్మ విచక్షణను (వివేకాన్ని) పెంచుకుంటుంది. ఒకప్పుడు సంఘర్షణగా ఉన్నది ఇప్పుడు సహజమైన ప్రాధాన్యతగా మారుతుంది. కాబట్టి, హార్ట్‌ఫుల్‌నెస్‌ బయటి నుంచి క్రమశిక్షణను విధించదు, లోపలి నుంచి దాన్ని మేల్కొలుపుతుంది. మనలోని ఉన్నతమైన తోడేలుకు బలంతో కాకుండా... అవగాహన, ప్రేమ, అంతర్గత అనుసంధానత ద్వారా పోషణ లభిస్తుంది. జీవితంలోని ప్రతి కూడలిలోనూ ఆగండి. ‘ఇప్పుడు ఇది నాకు కేవలం సంతోషాన్ని కలిగిస్తోందా? లేదంటే నన్ను మరింత గొప్ప స్థితి కోసం తీర్చిదిద్దుతోందా?’ అని ఆలోచించండి. మిమ్మల్ని ఉన్నతివైపు నడిపించే తోడేలుకు ఆహారాన్ని అందించండి. శ్రేయస్సు మీ స్వభావంలో భాగం అయ్యేవరకూ దాన్ని పదేపదే ఎంచుకోండి.

రెండు తోడేళ్ళు

ప్రేయస్సు తత్వాన్ని పదే పదే ఎంచుకోవడం అనే ప్రక్రియ శరీరంలో ఎలా వ్యక్తమవుతుందో ఒక కార్డియాలజిస్టుగా నేను తరచుగా చూస్తూ ఉంటాను. కదలకుండా ఉండే అలవాట్లు, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఒత్తిడికి లొంగిపోవడం, వ్యసనాలు వీటిలో ప్రధానమైనవి. ఈ ఎంపికలు ఎక్కువై పోగుపడి... అధిక రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధమైన వ్యాధులకు దారితీస్తాయి. శ్రేయస్సు ఆధారితమైన జీవితం... క్రమశిక్షణ, వ్యాయామం, భావోద్వేగ సమతుల్యతల ద్వారా శక్తిమంతమైన నివారణ ఔషధంగా పని చేస్తుంది. శ్రేయస్సు, ప్రేయస్సులను మనలో ఉండే రెండు తోడేళ్ళుగా దాజీ అభివర్ణించారు. ఒకటి ఉన్నతమైన ఆకాంక్ష, దయ, క్రమశిక్షణ, ఆధ్యాత్మికమైన పరిణామాలకు ప్రతీక. మరొకటి భోగ విలాసాలు, పరధ్యానం, అహం ద్వారా ప్రేరితమయ్యే వాంఛలకు ప్రతీక. మనం దేన్ని పెంచి పోషిస్తామో అది మరింత బలపడుతుంది. ఉన్నతమైన తోడేలుకు చైతన్యవంతమైన పోషణను అందించే ఆచరణాత్మకమైన, అనుభవపూర్వకమైన మార్గాన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానం అందిస్తుంది.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌

ట్రైనర్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌, 9440087532

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 12:48 AM