Share News

సప్త మాతృకలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 01:09 AM

లోక కంటకులైన రాక్షసులు అంధకాసురుడు, శుంభ, నిశుంభులను అంతమొందించే మహా సంగ్రామంలో... జగన్మాత అయిన చండికాదేవికి సాయంగా సకల దేవతా శక్తులు...

సప్త మాతృకలు

తెలుసుకుందాం

లోక కంటకులైన రాక్షసులు అంధకాసురుడు, శుంభ, నిశుంభులను అంతమొందించే మహా సంగ్రామంలో... జగన్మాత అయిన చండికాదేవికి సాయంగా సకల దేవతా శక్తులు వివిధ రూపాలతో ఆవిర్భవించాయి. వాటిలో సప్తమాతృకలు ప్రధానమైనవి. ఈ మూర్తుల గురించిన వివరణలు ‘దేవీ మాహాత్మ్యం’లో, ‘మార్కండేయ పురాణం’లో కనిపిస్తాయి. లోక రక్షణకోసం, దుష్ట శిక్షణ కోసం అవతరించిన ఆ దేవతలు ఆరాధించినవారికి అనుగ్రహప్రదాతలుగా ప్రసిద్ధి చెందారు.

శ్రీ బ్రాహ్మీ దేవి

సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరీరం నుంచి ఆయన తేజస్సు, ఆభరణాలు, వాహనంతో కూడిన అపారమైన తేజో శక్తి శ్రీ బ్రాహ్మీ దేవిగా ఆవిర్భవించింది. ఆమె నాలుగు ముఖాలతో, ఆరు చేతులతో ఉంటుంది. కుడివైపు ఒక చేత అభయముద్రతో, ఇతర చేతులలో పాశాన్ని స్రువాన్ని (యజ్ఞాలలో ఉపయోగించే గరిటెను), ఎడమ వైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో పుస్తకాన్ని, కమండలాన్ని ధరించి ఉంటుంది. హంసవాహనంపై... లేత పసుపు వర్ణమైన పింగళ శరీరచ్ఛాయతో, లేడి చర్మోత్తరీయంతో దర్శనమిస్తుంది. ఈ దేవిని ఆరాధిస్తే గురు, బుధ గ్రహ దోషాలు, మందబుద్ధి, మతిమరపు, వాక్‌ దోషాలు తొలగిపోతాయని, విద్యార్థులకు విజయం, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రీ మాహేశ్వరీ దేవి

విశ్వనాథుడైన పరమేశ్వరుని దేహం నుంచి... ఆయన మాదిరిగానే త్రినేత్రం, తలపై జటాజూటం, అర్ధ చంద్రుడితో, శూలాన్ని ధరించిన అపారమైన లయకారక శక్తి శ్రీ మాహేశ్వరీ దేవిగా అవతరించింది. ఆమె వృషభాన్ని అధిష్టించి, అయిదు ముఖాలతో... ప్రతి ముఖానికి మూడు కన్నులతో, తెల్లని శరీరచ్ఛాయతో ఉంటుంది. పది చేతుల్లో కుడివైపున ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో గొడ్డలి శూలం, వజ్రం, ఖడ్గం, ఎడమవైపు ఒక చేత వరదముద్రతో, మిగిలిన చేతుల్లో అంకుశాన్ని, నాగ సర్పాన్ని, గంటను, పాశాన్ని ధరించి ఉంటుంది. ఈ దేవిని ధ్యానిస్తే అంతరంగంలోని క్రోధం, అహంకారం, ఈర్ష్య లాంటి ఘోరమైన తామసిక వికారాలు తొలగిపోయి ఆత్మస్థైర్యం లభిస్తుందని, జాతకంలో శని, రాహు గ్రహ దోషాలు, అకాల మృత్యుభయాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది.

శ్రీ కౌమారీ దేవి

దేవ సేనాధిపతి అయిన కుమారస్వామి దేహం నుంచి... ఆయనలాగానే నెమలి వాహనంపై... శక్తి ఆయుధాన్ని ధరించిన అపారమైన వీరత్వ శక్తి శ్రీ కౌమారీ దేవిగా ఆవిర్భవించింది. ఆమె ఆరు ముఖాలతో, తెలుపు, ఎరుపు కలిగిన శరీరచ్ఛాయతో, ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తుంది. ఆమెకు పన్నెండు చేతులు, కుడి వైపు ఒక చేత వరద ముద్రతో, మిగిలిన వాటిలో శక్తిని, ఖడ్గాన్ని, దండాన్ని, పాత్రను, బాణాన్ని, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో గొడ్డలి, కుక్కుటం, కమలం, గంట, విల్లు ధరించి ఉంటుంది. ఈ దేవిని ఉపాసించడం వల్ల భయం, పిరికితనం, శత్రుబాధలతో పాటు జాతకంలో కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయని, శౌర్యం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, తేజస్సు లభిస్తాయని పెద్దల మాట.


శ్రీ వైష్ణవీ దేవి

శ్రీమహావిష్ణువు దేహం నుంచి గరుడ వాహనంపై... శంఖ చక్ర గదాధారి అయిన రక్షణ (స్థితి) శక్తి శ్రీ వైష్ణవీ దేవిగా ఆవిర్భవించింది. ఆమె వనమాలా భూషణాలతో, ఆరు చేతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. కుడి వైపు ఒక చేత వరదముద్రతో, మరో రెండు చేతులతో గదను, పద్మాన్ని, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో శంఖాన్ని, చక్రాన్ని ధరించి ఉంటుంది. ఈ దేవిని పూజిస్తే బుధ, రాహు గ్రహ దోషాలు, స్థిరాస్థి సంబంధమైన సమస్యలు దారిద్య్యం, గృహ కలహాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, కుటుంబ సౌఖ్యం చేకూరుతాయి.

శ్రీ వారాహీ దేవి

భూమిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహ తత్త్వం నుంచి... ప్రచండమైన కృష్ణవర్ణంతో, వరాహముఖంతో కూడిన అపార శక్తి శ్రీ వారాహీ దేవిగా ఆవిర్భవించింది. ఆమె నల్లని శరీర కాంతితో, మహిష వాహనంపై, లావైన ఉదరంతో, ఆరు చేతులతో ఉంటుంది. కుడివైపు ఒక చేత వరదముద్ర, మిగిలిన చేతుల్లో ఖడ్గం, దండం, ఎడమవైపు ఒక చేత అభయ ముద్రతో, మిగిలిన చేతుల్లో డాలు, పాత్ర ధరించి ఉంటుంది. ఈ దేవిని వేడుకుంటే ఘోరమైన శత్రుబాధలు, నరదృష్టి దోషాలు, కోర్టు సమస్యలు, జాతకంలో రాహు, కేతు, శని గ్రహ పీడలు తొలగిపోయి, లౌకిక జీవితంలో అపారమైన వాక్సుద్ధి, శత్రుజయం, తిరుగులేని ఆత్మరక్షణ, నిర్భయత్వం కలుగుతాయనేది శాస్త్ర వాక్యం.

శ్రీ ఐంద్రీ దేవి

దేవతల రాజైన ఇంద్రుని దేహం నుంచి... ఐరావత వాహనం, వెయ్యి కన్నులు, వజ్రాయుధంతో అపారమైన ఐశ్వర్య వైభవ శక్తి శ్రీ ఐంద్రీదేవిగా (ఇంద్రాణి) ఆవతరించింది. ఆమె మిక్కిలి సౌమ్యురాలు. బంగారంలాంటి పచ్చని శరీర కాంతితో అలరారుతూ ఉండే ఆమెకు ఆరు చేతులు ఉంటాయి. కుడివైపు ఒక చేత వరదముద్రతో, మిగిలిన చేతుల్లో సూత్రాన్ని, వజ్రాన్ని, ఎడమ వైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో పాత్రను, పద్మాన్ని ధరిస్తుంది. ఈ దేవిని ఆరాధిస్తే దారిద్య్రం, కీర్తినష్టం, పదవీచ్యుతి, శత్రుపీడల్లాంటి సమస్యలు తీరడంతోపాటు జాతకంలో నవగ్రహాధిపతి అయిన సూర్యుడికి. ఇంద్రుడి అనుగ్రహ కారకుడైన శుక్రునికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అలాగే లౌకిక జీవితంలో ఉన్నత పదవులు, విశేషమైన గౌరవ మర్యాదలు, అఖండమైన భోగభాగ్యాలు లభిస్తాయనే నమ్మకం ఉంది.


శ్రీ చాముండా దేవి

శుంభ నిశుంభుల ప్రధాన అనుచరులైన చండ ముండులనే క్రూర రాక్షసులు జగన్మాతపై యుద్ధానికి దిగినప్పుడు... అమ్మవారి భృకుటి (కనుబొమల ముడి) నుంచి అత్యంత భయంకరమైన ప్రచండ శక్తి... చాముండా దేవి ఆవిర్భవించింది. నల్లని శరీర కాంతితో, వికృతంగా, చుట్టూ ప్రేతాలతో ఉండే ఈ దేవి... పాములను ఆభరణాలుగా ధరిస్తుంది. కోరలతో, లావైన శరీరంతో, గుంట కన్నులతో, సన్నని పొట్టతో, పది చేతులతో దర్శనమిస్తుంది. ఆమె కామరూపిణి. ఆమె పది చేతులలో కుడివైపు ఖడ్గం, అంకుశం, రోకలి, చక్రం చామరం, ఎడమవైపున డాలు, పాశం, దండం, గొడ్డలి, విల్లు ధరిస్తుంది. ఈ దేవిని పూజిస్తే నరదృష్టి, దుష్టశక్తుల భయం, శత్రుపీడ, జాతకంలోని అత్యంత కఠినమైన శని, కేతు, రాహు గ్రహ దోషాలు, కాలసర్ప దోషాలు, దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయని, ఆకస్మిక విపత్తుల నుంచి విముక్తి, శత్రుజయం లభిస్తుందని పూర్వులు చెప్పారు.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 01:09 AM