నా ధైర్యానికి ప్రతిరూపం మా ఇంటి బంగారం
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:33 AM
వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించిన యాక్షన్ స్టార్‌గా, త్వరలోనే తల్లి కాబోతున్న శుభవార్తతో జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు. తీవ్రమైన అనారోగ్య సమస్యలను అధిగమించి వ్యాపారవేత్తగా, నిర్మాతగా, నటిగా తనను తాను నిరంతరం పునర్నిర్మించుకున్న ఆత్మవిశ్వాస రూపమిది.
వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించిన యాక్షన్ స్టార్‌గా, త్వరలోనే తల్లి కాబోతున్న శుభవార్తతో జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు ప్రముఖ నటి
సమంత రుత్ ప్రభు. తీవ్రమైన అనారోగ్య సమస్యలను అధిగమించి వ్యాపారవేత్తగా, నిర్మాతగా, నటిగా తనను తాను నిరంతరం పునర్నిర్మించుకున్న ఆత్మవిశ్వాస రూపమిది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, రాజ్ నిడిమోరుతో అనుబంధం, అనారోగ్యం నేర్పిన జీవిత పాఠాలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమంత పంచుకున్న అంతరంగమిది.
నా ఇటీవలి చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి నన్ను ఒక యాక్షన్ స్టార్‌గా నిలబెడుతుందని నేను ఊహించలేదు. నిజానికి ఈ సినిమాలో ‘స్వర్ణ’ పాత్రను సాయిపల్లవి చేయాల్సింది. కానీ, ఆ అవకాశం నా దగ్గరికి వచ్చినప్పుడు నా భర్త, సహ నిర్మాత రాజ్ నిడిమోరు ఈ స్ర్కిప్ట్‌ను నా జీవితానికి దగ్గరగా ఉండేలా రీరైట్ చేశారు. నేను నిజ జీవితంలో రౌడీలను కొట్టకపోవచ్చు కానీ, మన చుట్టూ ఉన్న మహిళల్లో ఉండే అపరిమితమైన సహనానికి, పడిపోయినా మళ్లీ లేచే ధైర్యానికి ఆ పాత్ర ప్రతిరూపం. రాజ్‌తో పనిచేస్తున్నప్పుడు నన్ను నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే నన్ను అన్ని పరిస్థితుల్లోనూ చూసిన వ్యక్తి కాబట్టి, ఎలాంటి భయం లేకుండా నటించగలను. నా భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించగలను.
సాయిపల్లవి తిరస్కరించడంతోనే...
‘మాస్కోవిన్ కావేరి’తో నా సినీ ప్రయాణం మొదలై దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. అయితే, 2022లో ‘మయోసైటిస్’ అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి బారినపడినప్పుడు వైద్యులు నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఆ సమయంలో ఆరోగ్యం దృష్ట్యా నటనకు స్వస్తి చెప్పి, వేరే వ్యాపారాలు చూసుకోవాలని అనుకున్నాను. ఒక ఏడాది విరామం తీసుకుని వ్యాపారవేత్తగా మారి పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాను. పైగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ‘సిటాడెల్’ షూటింగ్‌లో పాల్గొనడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నా వల్ల ఇతరుల సమయం, డబ్బు వృథా కాకూడదని భావించి ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించి తెరవెనుక ప్రశాంతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ రాజ్ నన్ను వదల్లేదు. నా కంటే కూడా నాపై ఆయనకే నమ్మకం ఎక్కువ. చివరికి సాయిపల్లవి ఆ పాత్రను తిరస్కరించడం, కథలో ఉన్న గొప్పతనం నన్ను మళ్లీ మేకప్ వేసుకునేలా చేశాయి. రాజ్, హిమాంక్ దువ్వూరుతో కలిసి నిర్మిస్తూ నటించిన ఆ నిర్ణయమే ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది.
అపార నమ్మకం
మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తుండటంతో ఒక్క టికెట్ అయినా అమ్ముడవుతుందో, లేదోనని నేను భయపడ్డాను. అందుకే అపరిమితమైన ఆశతో భారీగా ఖర్చు చేసి రిస్క్ చేయకూడదని నిర్ణయించుకున్నాం. బడ్జెట్‌ను చాలా పరిమితంగా ఉంచి, 54 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేశాం. క్లైమాక్స్, బస్సు సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలను ఒక్క రోజులోనే చిత్రీకరించాం. స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద ఆర్థికసాయం తీసుకుని, మా సొంతడబ్బు పెట్టి తీసిన ఈ సినిమా మొదటి రోజే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. ఇది కేవలం ఒక రోజు సినిమా కాదు, రెండేళ్ల కష్టానికి దక్కిన ఫలితం. మహిళలు, కుటుంబాలు, చిన్న పిల్లలు థియేటర్లకు వచ్చి ఈ సినిమాను వేడుకలా జరుపుకోవడం చూస్తుంటే నా కళ్లలో ఆనందభాష్పాలు తిరుగుతున్నాయి.
సోషల్ మీడియా విమర్శలు
సమాజంలో, సినీ పరిశ్రమలో ఒక నటి అంటే ఇలాగే ఉండాలి, పెళ్లి లేదా ప్రసవం తర్వాత వెంటనే స్లిమ్‌గా మారిపోవాలి అనే రకరకాల అంచనాలుంటాయి. గతంలో ఇతరుల అభిప్రాయాలు నన్ను తీవ్రంగా గాయపరిచేవి. కానీ ఇప్పుడు నేను ప్రతి రోజు రాసుకునే గ్రాటిట్యూడ్ డైరీ, నా లక్ష్యాల జాబితా నా ఆలోచనలను మార్చేశాయి. నా గురించి అనుకునే వారిని నేను మార్చలేను.. కాబట్టి దాని కోసం సమయం వృథా చేసుకోవడం అనవసరమని గ్రహించాను. అనారోగ్యం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయిన క్షణాల్లో పరిస్థితిని మనం మార్చలేకపోయినా, దానికి మనం ఎలా స్పందిస్తున్నామనేది మన చేతుల్లో ఉందని అర్థమైంది. విమర్శలను పట్టించుకోవడం మానేశాక నా జీవితం, నా నటనాశైలి చాలా సహజంగా మారాయి.
అమ్మ కాబోతున్న మధుర క్షణాలు
జీవితంలో పిల్లలు కలగడం, కలగకపోవడం రెండింటికీ నేను, రాజ్ సిద్ధపడ్డాం. కానీ నేను తల్లిని కాబోతున్నానన్న వార్త మా జీవితంలో ఒక అందమైన ఆశ్చర్యం. ‘తస్సాదియ్యా’ పాట షూటింగ్ సమయంలో నాకు ఈ విషయం తెలిసింది. ఆ పాటలోని కొన్ని స్టెప్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా నీరసం అనిపించింది. ఒక బిడ్డ జన్మించాక జీవితం పూర్తిగా మారిపోతుందని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. ఆ సరికొత్త మార్పును, మాతృత్వాన్ని ఆస్వాదించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. నా సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా’ ద్వారా మహిళా ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. సమాజంలో మహిళలు తాము కోరుకున్న జీవితాన్ని ఎంచుకునేలా వారిలో ధైర్యాన్ని పెంపొందించడమే నా ఆశయం. ప్రస్తుతం నా శరీరం ఇచ్చే సూచనలు వింటూ, మాతృత్వంతోపాటు వ్యాపారం, నిర్మిస్తున్న సినిమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను.
అనారోగ్యం నేర్పిన జీవితపాఠం
గడచిన రెండేళ్లలో నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ నా ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడంపై దృష్టిపెట్టాను. అంతకుముందు వరకు నా గుర్తింపును కేవలం నా విజయాలు, నా క్రమశిక్షణ, నేను సాధించిన ఫలితాల ఆధారంగానే కొలుచుకునేదానిని. కానీ అనారోగ్యం వల్ల మంచానికే పరిమితమైనప్పుడు, ‘ఏమీ చేయలేకపోతున్న నేను అసలు ఎవరిని?’ అనే ప్రశ్న వేసుకున్నాను. ఫలితాలతో సంబంధం లేకుండా ఒక మనిషిగా నాలోని విలువలను నేను తెలుసుకోవడమే నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రయాణం. ఆ సమయమే నాకు సహనం, విశ్వాసం, ఆశ అనే గొప్ప గుణాలను నేర్పింది. ఈ మార్పు వల్ల నేను ఒప్పుకునే బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సినిమాల సంఖ్యను తగ్గించుకున్నాను. నా సమయానికి, నా ఆరోగ్యానికి ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాను. బయటకు ఇది చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, అంతరంగంలో మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి...