Share News

గణపయ్యకు సంప్రదాయ నైవేద్యాలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:35 AM

వినాయకచవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రెండు రోజులు జరుపుకుంటారు. ఒక రోజు నోము చేసుకుని తరువాతి రోజు వ్రత కథ చెప్పుకుంటారు....

గణపయ్యకు సంప్రదాయ  నైవేద్యాలు

వంటిల్లు

వినాయకచవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రెండు రోజులు జరుపుకుంటారు. ఒక రోజు నోము చేసుకుని తరువాతి రోజు వ్రత కథ చెప్పుకుంటారు. ఉండ్రాళ్లు, వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, శనగలు, పాల తాలికలు, కుడుములు, ఓలిగలు, శనగబేళ్ల పాయసం ఇలా ఎన్నో రకాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవన్నీ తెలుగువారికి సుపరిచితమైనవే. రాయలసీమ ప్రాంతంలో మాత్రం కొన్ని విభిన్నమైన పిండి వంటలు కనిపిస్తుంటాయి. అలాంటి అచ్చ తెలుగు సంప్రదాయ పురాతన నైవేద్యాలను నవ్యతో పంచుకున్నారు ప్రముఖ చెఫ్‌ పూతలపట్టు రాజేశ్వరి.

ఉక్కిరి

కావాల్సిన పదార్థాలు

బియ్యం- కప్పు, మినప్పప్పు- పావు కప్పు, పెసర పప్పు- పావు కప్పు, సోంపు- పావు చెంచా, కొబ్బరి ముక్కలు- పావు కప్పు, బెల్లం తురుం- ఒకటిన్నర కప్పులు, శొంఠి పొడి- పావు చెంచా, నెయ్యి- కప్పు, గసగసాలు- పావు చెంచా

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి బియ్యం, పప్పులను ఒకదాని తరువాత మరోటి వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీసుకోవాలి. వీటిని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆపైన జల్లెడ పట్టి మెత్తటి పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి బెల్లం తురుం వేసి అర కప్పు నీటిని పోసి కలుపుతూ తీగ పాకం రానివ్వాలి. ఆపైన పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు రాకుండా కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. స్టవ్‌ మీద మరో చిన్న గిన్నె పెట్టి నెయ్యి వేసి అది కరిగిన తరువాత సోంపు, గసగసాలు, కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేపి పాకం పట్టిన పిండిలో వేసి కలపాలి. చివరగా శొంఠి పొడి వేసి కలిపితే రుచికరమైన ఉక్కిరి రెడీ!

ముసుండ

కావాల్సిన పదార్థాలు

రాగి పిండి- కప్పు, మైదా- రెండు కప్పులు, యాలకుల పొడి- అర చెంచా, నెయ్యి- మూడు చెంచాలు, నువ్వులు- రెండు చెంచాలు, బెల్లం తురుం- మూడు కప్పులు, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, ఉప్పు- చిటికెడు, వంటసోడా- చిటికెడు

తయారీ విధానం

ఒక గిన్నెలో బెల్లం తురుం వేసి కప్పు నీటిని పోసి కరిగించి వడబోయాలి. అందులో కొద్ది కొద్దిగా రాగి పిండి, మైదా వేస్తూ ఉండలు రాకుండా మెత్తగా కలపాలి. తరువాత నెయ్యి, నువ్వులు, యాలకుల పొడి, ఉప్పు, వంటసోడా వేసి కలిపి మూతపెట్టి పావుగంటసేపు నాననివ్వాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి బాగా వేడి చేయాలి. అందులో.. నానిన పిండిని చిన్న బోండాలుగా వేసి అన్ని వైపులా దోరగా వేయించి గిన్నెలోకి తీయాలి. మంట మధ్యస్తంగా ఉండేలా చూసుకుంటే బోండాలు లోపలి వరకూ చక్కగా ఉడుకుతాయి. ఇవి పది రోజులు నిల్వ ఉంటాయి కూడా.


ముట్టి కుడుములు

కావాల్సిన పదార్థాలు

నానబెట్టిన బియ్యం- రెండు కప్పులు, బెల్లం తురుం- ఒకటిన్నర కప్పులు, కొబ్బరి ముక్కలు- అర కప్పు, నెయ్యి- నాలుగు చెంచాలు, యాలకుల పొడి- చిటికెడు

తయారీ విధానం

నానిన బియ్యాన్ని మెత్తటి పిండిలా చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను నేతిలో వేయించి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో బెల్లం తురుం వేసి ఒకటిన్నర కప్పుల నీటిని పోసి కలుపుతూ కరిగించాలి. ఆపైన బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు రాకుండా కలపాలి.

తరువాత వేయించిన కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత ఈ పిండిని పిడికిలితో తీసుకుని కుడుముల మాదిరి చేసి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఉంచాలి. ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి ఈ ప్లేట్లు పెట్టి పావు గంటసేపు ఆవిరి మీద ఉడికించి దించాలి.

గూగుళ్లు

కావాల్సిన పదార్థాలు

పెద్ద శనగలు- అర కప్పు, అలసందలు- అర కప్పు, పల్లీలు- అర కప్పు, చిన్న శనగలు- అర కప్పు, పచ్చి కొబ్బరి తురుం- పావు కప్పు, ఎండు మిరపకాయలు- రెండు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, కరివేపాకు- ఓ రెమ్మ, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఆవాలు- పావు చెంచా, నెయ్యి- రెండు చెంచాలు

తయారీ విధానం

పెద్ద శనగలు, చిన్న శనగలు, పల్లీలను విడివిడిగా శుభ్రంగా కడిగి అవి మునిగే వరకు నీటిని పోసి ఎనిమిది గంటలు నానబెట్టాలి. అలాగే అలసందలను కూడా కడిగి నాలుగు గంటలు నాననివ్వాలి. తరువాత వీటన్నింటినీ ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. ఆపైన నీటిని వంచేయాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నెయ్యి వేసి కరిగించి అవాలు, ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేయాలి. తరువాత ఉడికించిన శనగలు, పల్లీలు, అలసందలు వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకుని చివరగా పచ్చి కొబ్బరి తురుం, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి.

ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 12 , 2026 | 03:35 AM