Share News

వీధుల్ని బడిగా మార్చారు!

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:31 AM

వీధుల్లో గోడలే పాఠాలు చెప్పే బ్లాక్‌ బోర్డులు... గుడి ప్రాంగణం పుస్తక భాండాగారం... విద్యార్థులు తీరిక సమయాల్లో టెక్నాలజీ, విదేశీ భాషలు నేర్చుకుంటారు... కవితలు కూడా రాసేస్తూ ఉంటారు...

వీధుల్ని బడిగా మార్చారు!

సంకల్పం

వీధుల్లో గోడలే పాఠాలు చెప్పే బ్లాక్‌ బోర్డులు... గుడి ప్రాంగణం పుస్తక భాండాగారం... విద్యార్థులు తీరిక సమయాల్లో టెక్నాలజీ, విదేశీ భాషలు నేర్చుకుంటారు... కవితలు కూడా రాసేస్తూ ఉంటారు... వీటన్నిటికీ రూపకర్త, సారథి కుందా జైవంత్‌ బచ్చావ్‌. మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఒక సర్కార్‌ బడి రూపు రేఖలను సమూలంగా మార్చేసిన ఆమె... సత్సంకల్పం, సమాజం పట్ల బాధ్యత ఉంటే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు.

ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడానికే పరిమితం కాకూడదు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదగడానికి దోహదం చేయాలి - ఈ సూత్రాన్ని కుందా జయవంత్‌ బచ్చావ్‌ గట్టిగా నమ్మడమే కాదు... ఆచరణలో కూడా చూపిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఆనంద్‌వాలీ పాఠశాలలో టీచర్‌గా ఆమె అడుగుపెట్టేనాటికి... అది కూడా చాలా ప్రభుత్వ పాఠశాలల్లా అన్ని ప్రమాణాల్లో బాగా వెనుకబడి ఉంది. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది పిల్లలు పేద, అణగారిన వర్గాలకు చెందినవారు. ప్రైవేటు స్కూళ్ళ విద్యార్థులతో పోటీ పడలేమనే న్యూనతాభావం వారిలో ఉంటుంది. అది పోవాలంటే ఆత్మవిశ్వాసం పెరగాలి. నేను మొదట దానిపైనే దృష్టి పెట్టాను’’ అని గుర్తు చేసుకున్నారు.


జ్ఞాన్‌భిత్‌... పొయిట్రీ అవర్‌

ప్రతి విద్యార్థితోనూ మాట్లాడి, చదువు విషయంలో వారికి ఉన్న ఇబ్బందులను, ఆసక్తులను ఆమె తెలుసుకున్నారు. బోధనలో సృజనాత్మకమైన పద్ధతులను అనుసరించారు. దానికోసం సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. పిల్లల తల్లిదండ్రులను నిరంతరం సంప్రతిస్తూ... డ్రాపవుట్ల నివారణకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో మాట్లాడి... గ్రామంలోని ముప్ఫైకి పైగా గోడలపై ‘జ్ఞాన్‌భిత్‌’ పేరిట మ్యాప్‌లను, లెక్కల్లోని మెలకువలను, ఇంగ్లీష్‌ పదాలను, జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన అంశాలను రాయించారు. ఇది చూసి స్ఫూర్తి పొందిన విద్యార్థులు సైతం తమ ఇళ్ళ గోడలను విజ్ఞాన కుడ్యాలుగా మార్చుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనంద్‌వాలీ స్కూల్‌ చర్చనీయాంశమయింది. అదే విధంగా విద్యార్థులు మొబైల్‌ ఫోన్లకు బానిసలు కాకుండా... ‘మిషన్‌ మొబైల్‌ ఫ్రీ’ పేరుతో చేపట్టిన కార్యక్రమం కూడా ప్రశంసాపాత్రమయింది. ‘పొయిట్రీ అవర్‌’ అనేది కుందా బచ్చావ్‌ చేపట్టిన మరో విజయవంతమైన ప్రయోగం. రోజూ బడి సమయం పూర్తయ్యాక... విద్యార్థులను వివిధ అంశాల మీద కవితలు రాసేలా ఆమె ప్రోత్సహించారు. అలా వారు రాసిన వాటిలో 75 చక్కటి కవితలను ఎంపిక చేసి ఒక సంకలనాన్ని విడుదల చేశారు. నిధులు పోగు చేసి... కొందరు నిరుపేద విద్యార్థులను మొదటిసారిగా ముంబాయికి విమానంలో తీసుకువెళ్ళారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను వారికి ప్రత్యక్షంగా చూపించారు. మరోసారి బెంగళూరు ఇస్రో కేంద్రానికి మరొక బృందాన్ని తీసుకువెళ్ళారు. పిల్లల్లో ప్రాపంచికమైన అవగాహనకు ఇవన్నీ దోహదం చేస్తాయంటారు కుందా బచ్చావ్‌.


3-navya.jpg

పాఠశాలే తొలి మెట్టు కావాలి

విద్యార్థులు పాఠాలకే పరిమితం కాకుండా... వారిలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి, ప్రపంచం పట్ల వారి దృక్పథం విశాలం కావడానికి దోహదపడేలా ప్రత్యేక తరగతులను కుందా బచ్చావ్‌ నిర్వహిస్తున్నారు. దీనికోసం ‘స్టెమ్‌’ (సైన్స్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌) అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఆమె రూపొందించారు. సైన్స్‌ ప్రయోగాల ద్వారా పాఠాలు మరింత అర్థమయ్యేలా చేస్తున్నారు. మహారాష్ట్ర ఎస్‌సిఇఆర్‌టి ఇన్నోవేషన్‌ కాంపిటేషన్‌లో ‘స్టెమ్‌’ ద్వితీయ బహుమతి పొందింది. అలాగే తనకు లభించిన లక్ష రూపాయల ‘శరద్‌ పవార్‌ ఫెలోషి్‌పను పేద విద్యార్థుల చదువు కోసం ఆమె కేటాయించారు. మరోవైపు జర్మన్‌, స్పానిష్‌ భాషలను బడి పిల్లలకు ఆమె నేర్పిస్తున్నారు. పఠనాసక్తిని పెంచడం కోసం ఆనందవాలీ గ్రామంలోని ఒక ఆలయంలో దాదాపు మూడు వేల పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని, మరో ప్రాంతంలోని కమ్యూనిటీ సెంటర్‌లో మరో లైబ్రరీని ఏర్పాటు చేశారు. విరాళాలు సేకరించి... వంద మందికి పైగా విద్యార్థినుల ఉన్నత చదువుకు సాయపడ్డారు. ఆమె చేసిన బహుముఖ సేవలకు గుర్తింపుగా... మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయినిగా సత్కరించింది. ఈ ఏడాది నేషనల్‌ టీచర్స్‌ అవార్డు అందుకున్నారు. ‘‘పిల్లలు గొప్ప కలలు కనడానికి, ఆశయాలు నిర్దేశించుకోవడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి... పాఠశాల తొలి మెట్టు కావాలి. దానికోసమే నా ప్రయత్నమంతా’’ అంటున్న కుందా బచ్చావ్‌కు జాతీయ పురస్కారం మరిన్ని సృజనాత్మకమైన కార్యక్రమాలకు ప్రేరణ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 12 , 2026 | 03:31 AM