Share News

వావిలి... వాత రోగాలకు ఔషధం

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:28 AM

‘భోజన కుతూహలం’ పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి ఈ శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులన్నిటిపైనా...

వావిలి... వాత రోగాలకు ఔషధం

భోజనకుతూహలం

నిర్గుండీపుష్పం తిక్తోష్ణం కృమివాత కఫాపహమ్‌

గుల్మప్లీహా రుచిం కుష్టం శోఫం జయేత్కటు!

‘భోజన కుతూహలం’ పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి ఈ శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులన్నిటిపైనా పని చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఏర్పడే అనేక వ్యాధులపైన వీటి ప్రయోగం ఉంది. ముఖ్యంగా స్ప్లీన్‌లో వచ్చే వ్యాధులపైన బాగా పని చేస్తుందని ‘భోజన కుతూహలం’ పేర్కొంది. నోటికి రుచి తెలియకపోవటం, అన్నహితవు కలగకపోవటం లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది.

వావిలి పూలను సేకరించి, నీడన ఆరనిచ్చి, కొద్దిగా నెయ్యి వేసి వేగించాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు శనగపప్పు, మినప్పప్పును కూడా పైపైన వేగించి, మెత్తగా దంచిన కారప్పొడి తినటానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగువారికి బాగా అందుబాటులో ఉండే మొక్క ఇది. రైతుల్నిగానీ, మొక్కల గురించి తెలిసినవారిని గానీ అడిగితే కచ్చితంగా తెలుస్తుంది. చాలాసార్లు చూసిన మొక్కే ఇది. ఒక్కో కణుపు దగ్గర ఐదాకుల చొప్పున ఉంటాయి. ఈ మొక్కని గుర్తుపట్టటానికి ఇదే కొండ గుర్తు. శనగ గింజంత నీలి రంగు పూలు పూస్తాయి.

కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, వాపుల్ని తగ్గించే ఆయుర్వేద ఔషధాల్లో వావిలిని కూడా చేరుస్తారు. దీని ఆకులు చవకగా దొరుకుతాయి. వావిలి ఆకులు, పూలు, పండ్లు, గింజలు, వేళ్లు... వీటన్నింటికీ వాతాన్ని తగ్గించే శక్తి ఉంది. వీటితో కీళ్లవాతం పైన పని చేసే నిర్గుండీ తైలాన్ని తయారు చేస్తారు.

వావిలి పూలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎక్కువ. ‘సింధువారస్య పుష్పేణ బద్ధోముచ్యేత బంధనాత్‌’ అని ‘పుష్ప చింతామణి’ గ్రంథం పేర్కొంది. వావిలి పువ్వును సమర్పిస్తే అన్ని అడ్డంకులూ తొలగి, బంధనాల నుంచి విముక్తి పొందుతారని అర్థం. ఈ పూలు సూర్యుడికి ప్రీతిపాత్రమనీ, వావిలి వలన పుత్ర లాభం కలుగుతాయని కూడా ఈ గ్రంథం పేర్కొంది.

గంగరాజు అరుణాదేవి

చరకుడు వావిలి పూలను విష దోషాలు హరించేదిగా పేర్కొన్నాడు. ఎలర్జీ కారణంగా వచ్చే చర్మ రోగాలు, దురదలు, ఉబ్బసం, నీరు పట్టి ఉబ్బు ఏర్పడే వ్యాధుల్లో, ఊపిరితిత్తులు, మూత్ర, స్త్రీల వ్యాధుల్లో వావిలి పని చేస్తుంది.

‘భోజన కుతూహలం’ వావిలి పూల ఆహార యోగ్యతను మాత్రమే సూచించింది కానీ, వీటిని ఎలా వండుకోవచ్చో చెప్పలేదు. అయితే వేప పూలను ఏ విధంగా ఉపయోగిస్తామో వావిలి పూలను కూడా అలానే వాడుకోవచ్చు.

ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 12 , 2026 | 03:28 AM