రాధ... అంతరంగ ఆనందశక్తి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:18 AM
రాధాదేవి...శ్రీకృష్ణుని అంతరంగ ఆహ్లాద శక్తి స్వరూపిణి. సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుడు ఆమె నిష్కల్మష భక్తికే వశుడు అవుతాడు. ఆ పరదేవత ఆవిర్భావాన్ని స్మరిస్తూ, ఆమె కరుణ ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందే పవిత్రమైన సందర్భం... రాధాష్టమి.
రాధాదేవి...శ్రీకృష్ణుని అంతరంగ ఆహ్లాద శక్తి స్వరూపిణి. సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుడు ఆమె నిష్కల్మష భక్తికే వశుడు అవుతాడు. ఆ పరదేవత ఆవిర్భావాన్ని స్మరిస్తూ, ఆమె కరుణ ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందే పవిత్రమైన సందర్భం... రాధాష్టమి.
రాధికా పరదేవత పరమోన్నత ఆధ్యాత్మిక స్వరూపాన్ని, శ్రీకృష్ణునితో ఆమెకు ఉన్న అభేద సంబంధాన్ని బృహద్ గౌతమీయ తంత్రం, శ్రీ చైతన్య చరితామృతం తదితర అనేక గ్రంథాలు వర్ణించాయి. భగవద్గీత, బ్రహ్మ సంహితల ప్రకారం... సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుని అంతరంగ శక్తి సత్ (సంధిని), చిత్ (సంవిత్), ఆనంద (ఆహ్లాదిని) అనే మూడు రూపాలలో వ్యక్తమవుతుంది. ఆ ఆహ్లాదినీ శక్తి తాలూకు అత్యున్నతమైన, ఘనీభవించిన నిస్వార్థ ప్రేమరూపమే రాధాదేవి. స్వయం సంపూర్ణుడైన శ్రీకృష్ణుడు తన అంతరంగ ఆనందశక్తిని రాధాదేవిగా వ్యక్తపరిచాడు. శాస్త్రాల ప్రకారం శక్తికి, శక్తిమంతునికి భేదం లేదు (అచింత్య భేదాభేద తత్త్వం). సూర్యుడు, సూర్యకాంతి మాదిరిగా... శ్రీకృష్ణుడు శక్తిమాన్‌గా, రాధాదేవి ఆయన అంతరంగ శక్తిగా... తత్త్వ రీత్యా ఒక్కటే (ఏకాత్మానౌ) అయినప్పటికీ... దివ్య ప్రేమ రసాస్వాదన కోసం వారు రెండు వేర్వేరు శరీరాలుగా వ్యక్తమయ్యారు. మన్మధుణ్ణి సైతం ఆకర్షించే శ్రీకృష్ణుడు మదన మోహనుడు కాగా, తన నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమతో ఆయనను వశపరుచుకున్న రాధాదేవిని ‘మదన మోహన మోహిని’గా ఆచార్యులు కీర్తించారు.
స్వామి కృప కావాలంటే...
‘సత్యం సత్యం పునః సత్యం... వినా రాధా ప్రసాదేన మత్ప్రసాదో న విద్యతే ’అని నారద పురాణంలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. రాధాదేవి అనుగ్రహం లేకుండా శ్రీకృష్ణుని కృప లభించదు. అత్యంత దయామయి అయిన రాధాదేవిని ఆశ్రయించడం ద్వారా ఆయనను చేరుకోవడం సులభమనేది ఆచార్యుల ఉపదేశం. వారి మాటల ప్రకారం... సాధకుడు ఎంత పతితుడైనప్పటికీ... రాధాదేవిని ఆశ్రయిస్తే... ‘‘ఈ భక్తుడు మంచివాడు, నిన్ను సేవించడానికి వచ్చాడు’’ అని శ్రీకృష్ణుడికి ఆమె సిఫార్సు చేస్తుంది. ఆమె ప్రేమకు పూర్తిగా వశుడై ఉండే శ్రీకృష్ణుడు ఆ సిఫార్సును కాదనలేక... ఆ భక్తుని లోపాలను చూడకుండా తక్షణమే తన సేవలోకి స్వీకరిస్తాడు. అందుకే బృందావనంలోని భక్తులు శ్రీకృష్ణుని నామం కన్నా రాధాదేవి నామాన్ని (జయ రాధే) ఎక్కువగా కీర్తిస్తారు.
ఆ జపమే పరమౌషధం
వేగవంతమైన నేటి ప్రపంచంలో స్వార్థం, పోటీతత్వం, మానసిక ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం... భౌతిక ఇంద్రియ సుఖాల చుట్టూ జీవితాన్ని నిర్మించుకోవడమే. అలా కాకుండా... భగవంతుడు కేంద్రంగా సేవ చేసినప్పుడు సామరస్యం, విశ్వసౌభ్రాతృత్వం నెలకొంటాయి. గడ్డి పరకకన్నా వినయంగా, చెట్టుకన్నా సహనంగా ఉంటూ... ఇతరులను గౌరవించినప్పుడు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ప్రస్తుత కలియుగంలో వ్యాధులు, యుద్ధభయాలు, ఏకాకితనం లాంటి సంక్షోభాలకు ‘హరేకృష్ణ’ మహామంత్ర జపమే పరమౌషధం. ఇందులో ‘హరే’ అనే నామం రాధాదేవి (హరా) శక్తిని సంబోధిస్తుంది. ఈ నామజపం హృదయం అనే అద్దంపై ఉన్న కామ, స్వార్థ మలినాలను కడిగేస్తుంది. బ్రహ్మముహూర్తంలో, ఏకాగ్రతతో, నిర్ణీత సంఖ్యలో ఈ మంత్రాన్ని జపించాలి. ఆహారాన్ని భక్తితో కృష్ణుడికి నివేదించి... ఆ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలి. దీనివల్ల భౌతిక ఆందోళనల నుంచి విముక్తి కలుగుతుంది. శాశ్వతమైన అంతర్గత శాంతిని, దివ్యమైన కృష్ణ ప్రేమను పొందగలుగుతాం.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
ఈ వార్తలనూ చదవండి:
కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు