సత్సంగమే జీవన దిక్సూచి
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:58 AM
‘‘డాక్టర్! గుండె జబ్బులకు సంబంధించి మనం తరచుగా నిర్లక్ష్యం చేసే అతి పెద్ద ప్రమాద కారకం ఏది?’’ అని ఒక రోగి నన్ను అడిగారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, కొలెస్ట్రాల్... ఇలాంటివి నేను...
యోగా
‘‘డాక్టర్! గుండె జబ్బులకు సంబంధించి మనం తరచుగా నిర్లక్ష్యం చేసే అతి పెద్ద ప్రమాద కారకం ఏది?’’ అని ఒక రోగి నన్ను అడిగారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, కొలెస్ట్రాల్... ఇలాంటివి నేను చెబుతానని అతను భావించారు. దానికి బదులు ‘‘మనం సాంగత్యం చేసే వ్యక్తులు’’ అని నేను సమాధానం ఇచ్చాను. అతను అయోమయంగా చూశారు. కార్డియాలజిస్టుగా... ఒత్తిడి, వ్యసనాలు, అనారోగ్యమైన జీవన శైలి గుండెను నిశ్శబ్దంగా ఎలా దెబ్బతీస్తాయో నేను ప్రత్యక్షంగా చూశాను. అయితే హార్ట్‌ఫుల్‌నెస్ శిక్షకుడిగా మరో సత్యాన్ని కూడా నేను గమనించాను. మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మన అంతర్గత వాతావరణం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మనం ఎవరితో సాంగత్యం చేస్తామో... మనకు తెలియకుండా వారిలా తయారవుతాం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, అలవాట్లు, ఆకాంక్షలు క్రమంగా మనం సంబంధం కలిగి ఉన్న సామూహిక చైతన్యాన్ని పోలి ఉండడం ప్రారంభిస్తాయి. ఈ గంభీరమైన సత్యాన్ని మన పూర్వీకులు అర్థం చేసుకున్నారు. దానికి ‘సత్సంగం’ అనే చక్కనైన పేరు పెట్టారు. సత్సంగం అంటే సత్యంతో సాంగత్యం. జ్ఞానోదయం పొందిన వ్యక్తులు లేదా సత్యాన్వేషకుల సమక్షంలో ఉండడాన్ని ఇది సూచిస్తుంది. కానీ మనల్ని మనం మరింత మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల సాంగత్యాన్ని కలిగి ఉండడం అనేది విస్తృతమైన అర్థం.
సజీవ శాంతి కేంద్రాలుగా...
‘‘మనం ఎవరితో సాంగత్యం చేస్తామో వారు మన చైతన్యానికి దిశా నిర్దేశం చేస్తారు. హృదయాలు చిత్తశుద్ధితో, ప్రేమతో ఏకమైనప్పుడు... పరివర్తన బలవంతంగా కాకుండా సహజంగా జరుగుతుంది’’ అంటారు దాజీ. ‘‘ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, మన అంతర్గత స్థితిని శుద్ధి చేసుకోవడం. తద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా శాంతిని వ్యాప్తి చేయడం’’ అని సాధకులకు ఆయన గుర్తు చేస్తారు. బహుశా సత్సంగం తాలూకు ఉద్దేశం ఇదే కావచ్చు. మనం శాంతిని పొందడమే కాదు, మన సమక్షంలో ఇతరులు తేలికపడేంత శాంతియుతంగా మారాలి. నివారణా చికిత్స అనేది ఆహారం, వ్యాయామం, మందులకన్నా ఎంతో ముందుగా... మనం కలిసి నడిచే వ్యక్తులను ఎంచుకోవడంతో మొదలవుతుందని ఒక వైద్యునిగా నేను తరచుగా అనుకుంటూ ఉంటాను. ఆరోగ్యకరమైన హృదయాలకు ఆరోగ్యమైన ధమనులు కావాలి. ఆరోగ్యకరమైన సమాజాలకు ఆరోగ్యమైన సహవాసాలు కావాలి. కలిసి ధ్యానం చేసే ప్రతి కుటుంబం శాంతియుతమైన భావోద్వేగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
కరుణకు విలువ ఇచ్చే ప్రతి కార్యాలయం ఆరోగ్యమైన నిపుణులను తయారు చేస్తుంది. ఉన్నతమైన ఉద్దేశాలతో సమావేశమయ్యే ప్రతి సమాజం కంటికి కనిపించని సామరస్య భాండాగారాన్ని సృష్టిస్తుంది. వ్యక్తులు పరివర్తన చెందితే కుటుంబాలు, వాటి ద్వారా సమాజాలు, వాటి ద్వారా దేశాలు పరివర్తన చెందుతాయి. బహుశా ప్రాచీన గురువులు సత్సంగానికి అందుకే అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే... మనం ఏది కావాలనుకుంటున్నామో అది కాకుండా... మనం పదేపదే ఎవరితో సహవాసం చేస్తామో అదే అవుతాం. కాబట్టి సహవాసాన్ని తెలివిగా ఎంచుకుందాం. ఉన్నతమైన హృదయాలను అన్వేషిద్దాం. సామూహిక ధ్యానం చేద్దాం. అంతర్గత సామరస్యం కోసం పరితపించే ప్రపంచానికి సజీవ శాంతి కేంద్రాలుగా రూపుదిద్దుకుందాం.
పరివర్తన శక్తి
పురాణాలలోని ఒక అందమైన కథ సత్సంగం తాలూకు పరివర్తన శక్తిని వివరిస్తుంది. ఒకసారి శ్రీకృష్ణుని దగ్గరకు నారదమహర్షి వెళ్ళాడు. ‘‘ప్రభూ! అందరూ సత్సంగం గొప్పదనం గురించి మాట్లాడతారు. అది నిజంగానే అంత శక్తిమంతమైనదా?’’ అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వి ‘‘ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చిన్న కీటకాన్ని అడుగు’’ అని చెప్పాడు. ‘ఆ చిన్న జీవికి సమాధానం ఎలా తెలుస్తుంది?’ అని నారదుడు ఆశ్చర్యపోయినా... శ్రీకృష్ణుడి మాటకు విధేయుడిగా ఆ కీటకం దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆ కీటకం మరణించింది. గందరగోళానికి, దుఃఖానికి లోనైన నారదుడు తిరిగి వచ్చి, శ్రీకృష్ణుడికి ఆ విషయం చెప్పాడు. ‘‘ఈసారి ఆ చిలుకను అడుగు’’ అన్నాడు శ్రీకృష్ణుడు. నారదుడు వెళ్ళాడు. మహర్షిని చూసిన వెంటనే ఆ చిలుక కూడా నిర్జీవమయిపోయింది. దీంతో నారదుడి గందరగోళం మరింత పెరిగింది. ఆ తరువాత... అప్పుడే పుట్టిన దూడ దగ్గరకు పంపాడు శ్రీకృష్ణుడు. ఆ దూడ కూడా నారదుణ్ణి చూడగానే చనిపోయింది. అప్పుడు నారదుడు ఆందోళనగా ‘‘స్వామీ! నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసిన ప్రాణులు చనిపోతున్నాయి’’ అని శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి... కొద్ది సమయం కిందట ఒక రాజకుమారుడు జన్మించిన రాజమందిరాన్ని సందర్శించాల్సిందిగా కోరాడు. నారదుడు అయిష్టంగానే రాజభవనానికి వెళ్ళి, ఆ శిశువును సమీపించాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆ శిశువు నవ్వుతూ ‘‘నారదా! ఇంకా మీకు అర్థం కాలేదా? ఒకప్పుడు నేను కీటకాన్ని, తరువాత చిలుకగా, ఆ తరువాత దూడగా జన్మించాను. ప్రతిసారీ ఆత్మజ్ఞానులైన మీ పవిత్ర సాంగత్యం వల్ల నా చైతన్యం ఉన్నతమయింది. ఆ పరివర్తన ప్రభావం వల్లనే ఈ రోజు నేను అమూల్యమైన ఈ మానవ జన్మను పొందగలిగాను’’ అని చెప్పింది. అప్పుడు నారదుడికి సత్సంగం ప్రభావం ఎంతటిదో అర్థమయింది.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News