క్షమ దైవత్వానికి ప్రతీక
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:03 AM
గతాన్ని మోస్తూ ఉంటే మనసు బందీగా మిగిలిపోతుంది. క్షమా గుణంతో వ్యవహరిస్తే బంధనాల నుంచి ఆత్మ విముక్తి పొందుతుంది. అన్ని సద్గుణాలనూ ప్రకాశింపజేసే మహోన్నత గుణం క్షమ. క్షమించడం...
సహజయోగ
గతాన్ని మోస్తూ ఉంటే మనసు బందీగా మిగిలిపోతుంది. క్షమా గుణంతో వ్యవహరిస్తే బంధనాల నుంచి ఆత్మ విముక్తి పొందుతుంది. అన్ని సద్గుణాలనూ ప్రకాశింపజేసే మహోన్నత గుణం క్షమ. క్షమించడం బలహీనత కాదు. అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తి. కోపంతో ప్రతిస్పందించడం సులభం. కానీ ద్వేషాన్ని దాచుకోకుండా, జరిగినదాన్ని అక్కడికక్కడే వదిలేయడమే నిజమైన క్షమ. అది దైవత్వానికి ప్రతీక. క్షమించే హృదయంలోనే దైవం నివసిస్తుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ఏసు క్రీస్తు లాంటి ఎందరో మహనీయులు బోధించారు.
నిన్న ముగిసిపోయింది...
గౌతమ బుద్ధుడు ఒక గ్రామంలో ఉపన్యాసం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆయనను తీవ్రంగా దూషించడం మొదలుపెట్టాడు. బుద్ధుడి శిష్యులు, ఉపన్యాసానికి హాజరైన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కానీ బుద్ధుడి ముఖంలో కోపం కాని, బాధ కాని, ద్వేషం కాని లేదు. కేవలం ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. కాసేపటికి... దూషించిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత అతను తన తప్పును గ్రహించాడు. మరుసటిరోజు బుద్ధుడు ఉన్న గ్రామానికి వెళ్ళి, ఆయన పాదాలమీద పడి, క్షమించాలని వేడుకున్నాడు. అప్పుడు బుద్ధుడు ‘‘నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు? అని అడిగాడు. ‘‘నిన్న’’ అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. ‘‘ఎక్కడ?’’ అని ప్రశ్నించాడు బుద్ధుడు. అతను ఆ గ్రామం పేరు చెప్పాడు. ‘‘నిన్నటి రోజు ముగిసిపోయింది. ఆ గ్రామాన్ని కూడా మనం దాటి వచ్చాం. ఇక క్షమించడానికి అక్కడ ఏముంది?’’ అన్నాడు బుద్ధుడు. ఆ ఒక్క వాక్యంలోనే సంపూర్ణ ఆధ్యాత్మికత దాగి ఉంది. గురువుగా ఎదగాలంటే బుద్ధుడిలాంటి అపారమైన క్షమాగుణం అవసరం. ఎందుకంటే గురువు తనను అవమానించినవారిని కూడా ప్రేమగా చూడగలగాలి. అజ్ఞానంతో ప్రవర్తించేవారిని ద్వేషించకుండా, వారికి జ్ఞానాన్ని అందించాలనే దయ కలిగి ఉండాలి. అసలైన గురుత్వం జ్ఞానంలో కాదు, క్షమాగుణంలో వ్యక్తమవుతుంది. క్షమించడం అనేది ఇతరులకు ఇచ్చే బహుమతి కాదు, మనకు మనం ఇచ్చుకొనే స్వేచ్ఛ. నిన్న జరిగిన సంఘటన గురించి ఈ రోజు ఆలోచిస్తే... రేపటి ఆనందాన్ని కోల్పోతాం. బుద్ధుడు చెప్పినట్టు ‘నిన్న’ ముగిసిపోయింది. గతాన్ని వదిలి వర్తమానంలో జీవించడం నేర్చుకున్నప్పుడే శాంతి కలుగుతుంది. మనకు బాధ కలిగించేవారిని మనస్ఫూర్తిగా క్షమిస్తే హృదయం తేలిక పడుతుంది. ఆలోచనలు పవిత్రమవుతాయి. మనలోని దివ్య చైతన్యం మరింత ప్రకాశిస్తుంది. క్షమించే మనసు ఆత్మజ్ఞానానికి ఆలయం.
వాటిని వదిలేద్దాం...
గతాన్ని మోసే మనసు ఎప్పటికీ బంధనంలోనే ఉంటుంది. చాలామంది చిన్న చిన్న సంఘటనలను ఏళ్ళ తరబడి గుర్తుంచుకుంటారు. ఎవరో పదేళ్ళ క్రితం అన్న మాటను, ఎప్పుడో జరిగిన అవమానాన్ని, అపార్థాన్ని మనసులో దాచుకొని, మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి ఆ సంఘటన కన్నా... దాన్ని పదేపదే గుర్తు చేసుకోవడమే ఎక్కువ బాధ కలిగిస్తుంది. మనసు గతంలోనే జీవించడం ప్రారంభిస్తుంది. వర్తమానం అందించే ఆనందాన్ని కోల్పోతుంది. క్షమించే గుణం లేని వ్యక్తి... తనను బాధించిన వ్యక్తిని శిక్షిస్తున్నానని అనుకుంటాడు. కానీ నిజానికి తన మనసునే శిక్షిస్తూ ఉంటాడు. క్షమించడం అంటే అన్యాయాన్ని సమర్థించడం కాదు, తప్పును ఒప్పుకోవడం కాదు. మన హృదయంలో ఏర్పడిన ద్వేషాన్ని, కోపాన్ని, ప్రతీకార భావాన్ని విడిచిపెట్టడం. క్షమించడం ద్వారా ఎదుటివారికన్నా మనకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. మనస్సు ప్రశాంతమవుతుంది. ఆలోచనలు నిర్మలమవుతాయి. అంతరంగంలో ఆనందం వికసిస్తుంది.
‘‘మీరు ఇతరులను క్షమించిన క్షణమే మీలోని బంధనాలు తొలగిపోతాయి. క్షమాగుణమే కుండలినీ శక్తి ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది’’ అని సహజయోగ వ్యవస్థాపకురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి తరచూ చెప్పేవారు. మన ఆజ్ఞాచక్రానికి ప్రధానమైన లక్షణం క్షమాగుణం. ఎవరిమీదైనా ద్వేషం, కోపం, అసూయ, ప్రతీకారభావం నిలిచి ఉంటే... మన అంతరంగం సంకుచితం అవుతుంది. కానీ క్షమించినప్పుడు మనసు విశాలమవుతుంది. ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు మార్గం సుగమం అవుతుంది. ఈ సామాజిక మాధ్యమాల యుగంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా శత్రుత్వంగా మారుతున్నాయి. కుటుంబాలలో, కార్యాలయాలలో, రాజకీయాలలో, సమాజంలో అసహనం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్షమాగుణం వ్యక్తిగతమైన సద్గుణం మాత్రమే కాదు, సమాజానికి అవసరమైన సంస్కారం. క్షమించే వ్యక్తి కుటుంబాన్ని కాపాడగలడు. క్షమించే నాయకుడు సమాజాన్ని ఏకం చేయగలడు. క్షమించే గురువు శిష్యుడి జీవితాన్ని మార్చగలడు. క్షమించే మనిషి ఆత్మను ఉన్నతంగా చేసుకోగలడు.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News