Share News

పోలీస్‌ పవరేంటో చిన్నప్పుడే తెలిసింది

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:07 AM

ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమయిన పోలీస్‌ ఫోర్స్‌లో ప్రస్తుతం మహిళలు కూడా తమ సత్తా చాటుతున్నారు. అత్యున్నత స్థానాలకు చేరుకొని తమ ప్రతిభను...

పోలీస్‌ పవరేంటో చిన్నప్పుడే తెలిసింది

ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమయిన పోలీస్‌ ఫోర్స్‌లో ప్రస్తుతం మహిళలు కూడా తమ సత్తా చాటుతున్నారు. అత్యున్నత స్థానాలకు చేరుకొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) తొలి మహిళా చీఫ్‌ బడుగుల సుమతి ఒకరు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ ప్రకటించిన పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌ (ఎంఎ్‌సఎం) సాధించిన ఐజీ సుమతి ‘నవ్య’తో తన అనుభవాల్ని పంచుకున్నారు.

‘‘మాది జోగులాంబ గద్వాల జిల్లా కలుగోట్ల గ్రామం. కృష్ణ, తుంగభద్ర ఉండే ప్రాంతం కావడంతో అందరూ దానిని నడిగడ్డ అంటారు. తెలంగాణ, రాయలసీమ సంస్కృతులు అక్కడ కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి నాపై మా నానమ్మ ప్రభావం ఎక్కువగా ఉండేది. ‘‘అమ్మాయిలు శక్తిమంతంగా ఉండాలి.. పది మందికి పనికొచ్చే పనులు చేయాలి. బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం చేయాలి’’ అని ఆమె చెబుతూ ఉండేవారు. దాంతో పది మందికి మేలు చేసే ఉద్యోగం చేయాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి నాలో నాటుకుపోయింది. చిన్నప్పుడు గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసినప్పుడు పోలీస్‌ పవరేమిటో అర్ధమైంది. వంద మందిని కంట్రోల్‌ చేసే పవర్‌ పోలీస్‌ దుస్తువులకు ఉందని తెలిసింది. ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా... ఒక్క పోలీస్‌ వస్తే అంతా సద్దుమనిగిపోయేది. అంతేకాదు... చిన్న వయస్సులోనే తాత చనిపోవడంతో నానమ్మ ఇంటికి పెద్ద అయింది. మా ఊర్లో కూడా ఆమె మాటకు ఎవరు ఎదురుచెప్పేవారు కాదు. పోలీసు ఉద్యోగం చేస్తే అందరికీ మేలు చేయవచ్చనే ఆలోచనకు నాలో బీజం వేసింది మా నానమ్మే! 2000 సంవత్సరంలో నా డిగ్రీ పూర్తి అయింది. వెంటనే గ్రూప్‌-1 సాధించా. వేరే ఆలోచన లేకుండా పోలీసు సర్వీసును ఎంచుకున్నా.


000-Navya.jpg

మార్పులు ఎన్నో...

నేను విధుల్లో చేరినప్పటితో పోలిస్తే ఇప్పుడు పోలీసింగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు పోలీసింగ్‌లో మగ, ఆడ అనే తేడా లేదు. మహిళా ప్రాతినిధ్యం బాగా పెరిగింది. 25 ఏళ్ల సుదీర్ఘ సర్వీ్‌సలో పోలీస్‌ శాఖలో శాంతి భద్రతలు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌, సీఐడీ, ఎస్‌ఐబీ ఇలా కీలక విభాగాల్లో పనిచేసా. డీఎస్పీ నుంచి ఐజీ వరకు ప్రతి దశలో సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాల్ని చేరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా తొలి మహిళా అధికారిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ బాధ్యతను నిర్వహించడం కూడా సవాలనే చెప్పాలి. 1991 తర్వాత ఎస్‌ఐబీలో మహిళా అధికారిగా వచ్చింది నేనే! ఇక పోలీసు ఫోర్స్‌లో పని చేస్తున్నప్పుడు నిర్దిష్టమైన పనివేళలు ఉండవు. తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దానిని వ్యక్తిగత జీవితం దాకా తీసుకువస్తే- అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే నా వ్యక్తిగత జీవితంలోకి ఎటువంటి ఒత్తిడిని చేరనివ్వను. ఒత్తిడి అంతా ఆఫీస్‌ వరకే. ఒక సారి ఇంటికెళ్తే పూర్తిస్థాయి గృహిణిగా ఉండటమే ఇష్టం. నా భర్త, ఇతర కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో సహకరిస్తారు. పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడితే ఒత్తిడి మొత్తం పోతుంది. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందరూ సంస్కృతి సంప్రదాయాలు పాటించాలనేది నా ఉద్దేశం. అందుకే మా అమ్మాయిలకు ప్రకృతి, సంస్కృతి అని పెట్టుకున్నా! వారితో ప్రతి పండగను చేసుకుంటా! ఆ పండగల వెనకున్న అర్ధాన్ని వాళ్లకు చెబుతూ ఉంటా!

యస్‌. సోమేశ్వర్‌

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 06:07 AM