ఫలం, ఫలితం మన చేతిలోనే!
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:51 AM
కొత్త సంవత్సరంలో ప్రవేశించగానే... పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడం రివాజు. అయితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎవరో చెప్పనక్కర్లేదు....
పరాభవ నామ సంవత్సర ఉగాది
కొత్త సంవత్సరంలో ప్రవేశించగానే... పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడం రివాజు. అయితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎవరో చెప్పనక్కర్లేదు.
మనమే తెలుసుకోగలం. అలాగైతే ‘మరి పంచాంగాలు, సిద్ధాంతులు, హోరాశాస్త్రాల మాటేమిటి?’ అనే సందేహం కలగడం సహజమే.
మహర్షులు సంవత్సరాల పేర్లను నిర్ణయిస్తూ... ఆ పేరును బట్టే ఫలితాన్ని అర్థం చేసుకోగలిగేలా చేశారు. కాబట్టి ఈ ‘పరాభవ నామ సంవత్సరం’లో ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు... మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆప్తులను సంప్రతించి మాత్రమే పనిలోకి దిగాలి. ఇక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకుంటే... మనం ఏ విధమైన ఆహారం తీసుకుంటే దానికి తగిన ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. అదే విధంగా ఎవరు ఎంతెంత అసత్యం మాట్లాడతారో, అధర్మంగా ప్రవర్తిస్తారో, అన్యాయానికి పాల్పడతారో... దానికి తగిన ఫలితం అనుభవించకుండా ఉండడం సాధ్యమేనా? భగవంతుడు ధర్మమూర్తి. ఈ ప్రపంచం మొత్తం ఆయన ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి అందరి ధర్మాధర్మాలను కలిపి లెక్కించి, ఎంత శుభాన్ని, ఎంత ఉపద్రవాన్ని మనకు కలిగించాల్సి ఉందో... అంతమేరకు ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండవలసిందే. పరీక్ష రాసిన విధానాన్ని బట్టి ఉత్తీర్ణత శాతం ఉన్నట్టు... మన ధర్మాధర్మాలే మనకు రాబోయే సంవత్సర ఫలితాలు అవుతాయి.
అదే పరిష్కారం...
అయితే మరింత తీవ్రమైన ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే... చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. పొరపాట్లను అంగీకరించాలి. తప్పనిసరిగా దైవధ్యానాన్ని కొనసాగించాలి. అప్పుడు వర్షంలో గొడుగు ధరించినట్టు కొంత ఉపశమనం లభించి తీరుతుంది. ఏది ఏమైనా నీళ్ళు కొద్దికొద్దిగా లోపలకు వస్తున్న నావలోనే మనం ప్రయాణం సాగించబోతున్నాం. కాబట్టి శ్రమ అనుకోకుండా ఎప్పటికప్పుడు నీటిని తోడి తిరిగి నదిలో పోసేస్తూ ఉన్నప్పుడే... మనశ్శాంతి, ఉపద్రవాల నుంచి ఉపశమనం లభిస్తాయి. అన్నిటికీ దైవధ్యానమే సరైన పరిష్కారం.
భగవంతుడి ఆమోదం కావాలి...
జ్యోతిశ్శాస్త్రాన్ని మనకు అందించిన ఋషులు ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కాలం ఎలా ఉండబోతోందో చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్థించారు. అంటే... శాస్త్ర పరిశీలన ద్వారా విషయం తెలిసినా... భగవంతుడి ఆమోదం ఉంటే తప్ప ఆ శాస్త్రం... ఆ ఋషి రచనా విధానం ప్రకారం నడవదన్నమాట. అంటే... ఏ పంచాంగకర్త అయినా, సిద్ధాంతి అయినా దైవానుష్ఠానాన్ని ఎంత స్థాయిలో చేస్తారో ఆ స్థాయిలో మాత్రమే వారు చెప్పినది ఫలిస్తుందని అర్థం. మొదటిదైన కృతయుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుందని, ఆ యుగంలో అందరూ సత్య ధర్మ పరాయణులే ఉంటారనీ ఋషులు చెప్పిన మాట యదార్థం అయింది. అలాగే 12,96,000 ఏళ్ళపాటు ఉన్న త్రేతాయుగంలో ఒకరి (శ్రీరాముడి) మార్గదర్శకత్వంలో ధర్మం నిలబడుతుందన్న మాట సత్యమయింది. అదే తీరులో 8,64,000 సంవత్సరాల పాటు ఉండే ద్వాపర యుగంలో అనుమానంగా, సందేహిస్తూ నడవడమే ప్రధానంగా ఉంటుందని చెప్పిన మాటలు కౌరవుల జీవితానికి దర్పణాలవంటివి అయ్యాయి. ఇక చివరిదైన కలియుగంలో (కలిః కలహ ఉచ్యతే) ఇంటా బయటా, దేశంలో విదేశంలో, స్వపక్షంలో పరపక్షంలో... ఎన్ని నిష్పత్తుల ప్రకారం కలహాలకు అవకాశం ఉంటే అన్ని తీరులుగానూ దెబ్బలాటలే కనిపిస్తున్నాయి కదా! మౌనంగా, ప్రశాంత చిత్తంతో ఉండవలసిన స్వాముల్లో కూడా వాక్ కలహాలు వస్తున్నాయి కదా! అంటే శాస్త్రం చెప్పిన మాట సిద్ధాంతి ద్వారా ఫలించాలంటే... ఆ సిద్ధాంతి నిత్యం దైవారాధనను తగినంత చేయవలసిందే.
మహాస్వామి మాట
నిజంగా పంచాంగాలను ఒకదాని పక్కన మరొకటి పెట్టి చూస్తే... రాశి ఫలితాల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. దేన్ని నమ్మాలో తెలియదు. మనసు లోపల గుబులు, భయం, నిరుత్సాహం... మరి దీనికి పరిష్కారం ఏమిటి? నాటి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి మహాస్వామి ఒక సభలో మాట్లాడుతూ ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలో... ఆ వయసును బట్టి, సంవత్సరానికి ఒక నిమిషం చొప్పున (నలభయ్యేళ్ళ వారైతే నలభై నిమిషాలపాటు ప్రతిరోజూ) ఆ వ్యక్తికి నచ్చిన దైవధ్యానం చేస్తూ ఉంటే... ఆ రోజు అతని మనోభయం అదుపులో ఉంటుందని చెప్పారు. మనం ఈ పని చేయగలగాలి. ఇదొక పరిష్కారం. ఇక... వాట్సప్, యూట్యూబుల్లో ఎవరెవరికి ఏది తోస్తే దాన్ని ఆర్థిక లాభాపేక్షతో చెబుతున్నారు. అది వాళ్ళ తప్పుకాదు. వాటిని విశ్వసించకపోవడాన్ని మనం నేర్చుకోవాలి. మన ఇంటి పక్కనే మద్యం అమ్ముతూ ఉంటే... దాన్ని గమనిస్తూ కూడా మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. అంతే తప్ప ఆ కారణంగా ఇలా మారిపోయానని అనడం విజ్ఞత కాదు.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
9866700425
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్
గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News