రంగు రంగుల చీరలతో పండుగ శోభ
ABN , Publish Date - Oct 14 , 2026 | 03:01 AM
దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు రోజుకో రంగు చీర కట్టుకుని మురిసిపోతుంటారు. ఈ రంగులు మహిళల అభిరుచికి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంటాయి. అంతేకాదు మానసిక ప్రశాంతతను పెంచుతూ...
ఫ్యాషన్
దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు రోజుకో రంగు చీర కట్టుకుని మురిసిపోతుంటారు. ఈ రంగులు మహిళల అభిరుచికి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంటాయి. అంతేకాదు మానసిక ప్రశాంతతను పెంచుతూ అహ్లాదకరమైన అనుభూతి నిస్తాయి. సిల్క్, షిఫాన్, క్రేప్, కాటన్... ఇలా చీర ఏదైనా సరే... ఏ రంగు ఎలాంటి భావాలను పలికిస్తుందో చూద్దాం..!
గులాబీ రంగు - సోమవారం
ఇది కరుణ, సఖ్యత, సయోధ్య, శ్రావ్యత, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుంది. బంధాన్ని బలపరచడంలో ఈ రంగుని మించింది లేదు. గులాబీ రంగు చీర కట్టుకుంటే సంపద, అదృష్టం వెన్నంటి ఉంటాయని మహిళలు నమ్ముతుంటారు.
ఆకుపచ్చ - గురువారం
ఆకుపచ్చ రంగు ప్రకృతికి, శ్రేయస్సుకు, శాంతికి చిహ్నం. నూతన ఆరంభానికి, సామరస్యానికి సంకేతంగా నిలుస్తుంది. పండుగలప్పుడు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే ఒత్తిడి, అలసట మాయమై మనసంతా సంతోషంగా అనిపిస్తుంది. అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.
బూడిద రంగు - శుక్రవారం
నలుపు, తెలుపు కలిసినట్లుండే ఈ బూడిద రంగును బలానికి, మార్పునకు ప్రతీకగా భావిస్తారు. ఇది జీవితంలో సమతుల్యత ప్రాముఖ్యాన్ని, క్రమశిక్షణ విలువను నిశ్శబ్దంగా చాటిచెబుతుంది. ఏ సందర్భంలోనైనా బూడిద రంగు చీర కట్టుకుంటే హుందాగా కనిపిస్తారు. ప్రతికూల ఆలోచనలు, నిరాశ, భయం తొలగి మానసిక స్థిరత్వం లభిస్తుంది.
పీకాక్ గ్రీన్- ఆదివారం
మహిళలందరికీ ఇష్టమైన ఈ రంగు... వ్యక్తిత్వానికి, స్వచ్ఛతకు, కరుణకు, విలక్షణతకు చిహ్నం. పీకాక్ గ్రీన్ కలర్ పట్టుచీర విజయాన్ని ప్రతిబింబిస్తుంది. పండుగలు, శుభకార్యాలప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే అహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది.
కాషాయం - శనివారం
ఎరుపు, పసుపుల కలయికతో కళ్లకు ప్రకాశవంతంగా కనిపించే కాషాయం రంగు.. అంతర్గత శక్తిని, తేజస్సును, త్యాగాన్ని ప్రతిబింబిస్తుంది. మానసిక ధైర్యాన్ని ప్రతిఫలిస్తుంది. ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంటే సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదిరించి విజయాన్ని సాధించగలననే ధీమా కలుగుతుంది.
పసుపు - బుధవారం
పసుపు రంగు శుభానికి, సంతోషానికి, సమృద్ధికి సంకేతం. ఇది సానుకూల శక్తికి, జ్ఞానానికి ప్రతీక. ఆశావాదాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. పండుగలు, పూజల సందర్భాల్లో పసుపు రంగు చీర కట్టుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండడంతోపాటు మనసంతా స్నేహపూర్వక భావనలతో నిండుతుంది. ఇంటికి వచ్చిన అతిథులను ఆకర్షిస్తుంది.
భార్గవి కూనం
99898 99881, హైదరాబాద్
ఇవి కూడా చదవండి...
.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే
గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం
Read Latest AP News And Telugu News