Share News

మూడు శక్తులు

ABN , Publish Date - May 29 , 2026 | 01:43 AM

దైవం ఎల్లప్పుడూ, అంతటా ఉంటాడు అనేది అన్ని విశ్వాసాలకు మూలాధారం. అయితే ఒక్కొక్క ధర్మానికి తనదైన ప్రత్యేక పంధా ఉంటుంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం...

మూడు శక్తులు

దైవమార్గం

దైవం ఎల్లప్పుడూ, అంతటా ఉంటాడు అనేది అన్ని విశ్వాసాలకు మూలాధారం. అయితే ఒక్కొక్క ధర్మానికి తనదైన ప్రత్యేక పంధా ఉంటుంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు ఎప్పుడూ మానవుల వెన్నంటే ఉంటాడు. అవసరమైనప్పుడు సంభాషిస్తాడు. చెప్పదలచినది చెప్పి, నడిపిస్తాడు. ‘‘నేను నీతోనే వస్తూ ఉంటాను. నిను విడువను, ఎడబాయను’ అంటాడు. ‘‘గడ్డి ఎండిపోతుంది. పువ్వు వాడిపోతుంది. దేవుని వాక్యం నిత్యం మనతోనే ఉంటుంది’’ అని యెషయా చెబుతాడు. ఇది లోకానికి తండ్రి అయిన దేవునికి సంబంధించిన విషయం.

క్రీస్తుకు ‘ఇమ్మానుయేలు’ అనే పేరు ఉంది. ‘దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు’ అని దాని అర్థం. భూమిపై జీవించి, మరణం తరువాత కూడా నలభై రోజులు తన వారితో ఉండి, మోక్షానికి పయనమవుతూ ‘‘ఇదిగో! నేను యుగ సమాప్తివరకూ ఎల్లకాలము మీతో ఉంటాను’’ అని వారితో చెప్పాడు ఏసుక్రీస్తు. ‘‘ఆకాశం, భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించవు’’ అని ప్రభువు చెప్పినట్టు ముగ్గురు సువార్తీకులు పేర్కొన్నారు. దైవానికి బైబిల్‌లో ‘వాగ్రూపుడు’ అనే ఇంకో పేరు ఉంది. అంటే మాట రూపంలో ఆయన ఉన్నాడు. ఇవన్నీ గమనించినప్పుడు... ‘దేవుడు మనిషిని ఒంటరిగా విడిచి పోలేదు. వెంటే ఉండి నడిపించాడు, నడిపిస్తున్నాడు’ అని బైబిల్‌ గ్రంథాన్ని బట్టి, దాని వ్యాఖ్యానాలను బట్టి స్పష్టమవుతోంది.

ఈ సృష్టికి రూపకల్పన చేసిన దేవుడు... ఆ సృష్టి భ్రష్టమైపోతున్న దశలో... తన కుమారుడు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. క్రీస్తు లోకులకు బోధలు చేశాడు. అందరికోసం మరణించాడు. మరణం నుంచి తిరిగి లేచాడు. తిరిగి మోక్షానికి వెళ్ళాడు. మరి ఆ తరువాత... ఈ లోకానికి దిశా నిర్దేశం చేసేవారు ఎవరు? ‘’దైవం మీకు తోడు వస్తాడు. మిమ్మల్ని నడిపిస్తాడు’’ అని ప్రభువు చెప్పిన ప్రకారమే... అగ్ని శిఖలతో పవిత్రాత్మ వచ్చి, శిష్యుల తలలపై చేరింది. ఆ పవిత్రాత్మే ఈ లోకాన్ని నడిపిస్తోందనేది విశ్వాసుల నమ్మకం. సమస్త లోకానికి తండ్రి అయిన దైవం, ఆయన ప్రియ పుత్రుడైన క్రీస్తు, పవిత్రాత్మ... విడివిడిగా ఉంటూనే, ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండే మూడు శక్తులు. క్రీస్తు మళ్ళీ వస్తాడనీ, అప్పటివరకూ ఈ పవిత్రాత్మ తన బోధనను శిష్యులద్వారా కొనసాగిస్తూ ఉంటుందని క్రైస్తవుల విశ్వాసం.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 01:43 AM