Share News

మఖానాతో మజాగా...

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:31 AM

మఖానాతో రకరకాల వంటకాలు ఎలా చేసుకుకోవాలో తెలుసుకుందాం....

మఖానాతో మజాగా...

మఖానాతో రకరకాల వంటకాలు ఎలా చేసుకుకోవాలో తెలుసుకుందాం....

మఖానా బైట్స్‌

కావాల్సిన పదార్థాలు

మఖానా- కప్పు, బొంబాయి రవ్వ- అర కప్పు, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, పచ్చి మిర్చి- నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, ఉల్లిపాయ- ఒకటి, క్యాప్సికమ్‌- ఒకటి, క్యారెట్‌- ఒకటి, చిల్లీ ఫ్లేక్స్‌- అర చెంచా, ఉప్పు- తగినంత

తయారీ విధానం

మిక్సీలో మఖానా వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. తరువాత ఆవాలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్‌, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చిన్న మంట మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కప్పు నీటిని పోసి మరిగించాలి. అందులో మఖానా పోడి వేసి కలిపిన తరువాత బొంబాయి రవ్వ వేసి కలపాలి. మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించి దించాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ పీటమీద ఉంచి చతురస్రాకారంగా పరిచి చిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. తరువాత మఖానా మిశ్రమంతో తయారుచేసిన ముక్కలను వేసి మధ్యస్థ మంట మీద దోరగా వేయించి గిన్నెలోకి తీయాలి. ఈ మఖానా బైట్స్‌ని టమాటా సాస్‌తో సర్వ్‌ చేయాలి.


మఖానా డ్రింక్‌

కావాల్సిన పదార్థాలు

పాలు- అర లీటరు, మఖానా- కప్పు, ఖర్జూరాలు- తొమ్మిది, కాజు- ఆరు, నానబెట్టి తొక్క తీసిన బాదం పప్పులు- నాలుగు, సబ్జా గింజలు- చెంచా, యాలకులు- రెండు

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో మఖానా వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. పాలను కూడా కాచి చాల్లార్చాలి. ఒక గిన్నెలో ఖర్జూరాలు, కాజు, బాదం పప్పులు వేసి అవి మునిగే వరకు గోరువెచ్చటి పాలు పోసి గంటసేపు నాననివ్వాలి. మరో గిన్నెలో సబ్జా గింజలు వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. మిక్సీలో మఖానా, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పళ్లెంలోకి తీయాలి. తరువాత ఖర్జూరం మిశ్రమం వేసి గ్రైండ్‌ చేయాలి. అందులో మఖానా పొడి వేసి మరికొన్ని పాలు పోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. గాజు గ్లాసుల్లో నానిన సబ్జా గింజలు వేసి మఖానా-పాల మిశ్రమాన్ని పోసి పైన కాజు, బాదం పలుకులు చల్లి సర్వ్‌ చేయాలి.


మఖానా దోశ

కావాల్సిన పదార్థాలు

మఖానా- కప్పు, బొంబాయి రవ్వ- కప్పు, అటుకులు- అర కప్పు, ఉప్పు- ముప్పావు చెంచా, పెరుగు- అర కప్పు, నూనె- తగినంత

తయారీ విధానం

వెడల్పాటి గిన్నెలో మఖానా, బొంబాయి రవ్వ, అటుకులు, పెరుగు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి బాగా కలిపి మూతపెట్టి అరగంట సేపు నాననివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి అర కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. ఈ పిండిని అయిదు నిమిషాలు వేగంగా బీట్‌ చేయాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి వేడిచేయాలి. గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసి చుట్టూ కొద్దిగా నూనె చిలకరించాలి. చిన్న మంట మీద అయిదు నిమిషాలు రెండు వైపులా దోరగా వేగనిచ్చి పళ్లెంలోకి తీయాలి. ఈ మఖానా దోశని టమాటా చట్నీ లేదా కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.


మఖానా లడ్డూ

కావాల్సిన పదార్థాలు

మఖానా- నాలుగు కప్పులు, బాదం పప్పులు- అర కప్పు, కాజు- అర కప్పు, కొబ్బరి పొడి- కప్పు, నెయ్యి- రెండు చెంచాలు, కిస్‌మిస్‌లు- కొన్ని, గసగసాలు- రెండు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, బెల్లం తురుము- ఒకటిన్నర కప్పులు

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి మఖానా వేసి దోరగా వేయించి చల్లార్చి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. అలాగే బాదం, కాజులను కూడా దోరగా వేయించి పొడి చేయాలి. కొబ్బరి పొడిని కూడా చిన్న మంట మీద ఎర్రగా వేయించాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి కరిగించి కొన్ని కిస్‌మిస్‌లు, బాదం, కాజు పలుకులను వేయించి పళ్లెంలోకి తీయాలి. వెడల్పాటి గిన్నెలో మఖానా పొడి, కాజు-బాదం పొడి, కొబ్బరి పొడి, గసగసాలు, యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన పలుకులు వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి బెల్లం తురుము వేసి అర కప్పు నీటిని పోసి తీగ పాకం రానివ్వాలి. అందులో ముందుగా సిద్దం చేసుకున్న పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి దించాలి. ఈ మిశ్రమం చల్లారాక అరచేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టాలి. ఈ మఖానా లడ్డూలు వారంపాటు నిల్వ ఉంటాయి.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 12:45 AM