Share News

లోకాభిరామం శ్రీరామం

ABN , Publish Date - May 29 , 2026 | 01:54 AM

శ్రీమహావిష్ణువు అవతారాల్లో అత్యంత విశిష్టమైనది శ్రీరామావతారం. ఆయన ఆదికావ్యమైన రామాయణ కథానాయకుడు. ధర్మనిష్ట, సత్యసంధత అనే ఆదర్శాలకు...

లోకాభిరామం శ్రీరామం

తెలుసుకుందాం

శ్రీమహావిష్ణువు అవతారాల్లో అత్యంత విశిష్టమైనది శ్రీరామావతారం. ఆయన ఆదికావ్యమైన రామాయణ కథానాయకుడు. ధర్మనిష్ట, సత్యసంధత అనే ఆదర్శాలకు ప్రతిరూపం. రామాలయం లేని గ్రామంలో ఒక్క రాత్రి కూడా నిద్రించకూడదన్నారు పూర్వులు. సామాన్యంగా ఆలయాల్లో శ్రీరాముడు విడిగా కనిపించడం అరుదు. ధర్మపత్ని అయిన సీత, సోదరుడు లక్ష్మణుడు, సేవకుడైన హనుమంతుడు, కొన్నిసార్లు మరో ఇద్దరు సోదరులు భరత, శత్రుఘ్నులతో కలిసి దర్శనమిస్తాడు. శ్రీరాముని రూపాలు మూడు విధాలుగా ఉంటాయి. అవి: స్థిత (నిలబడిన) రూపం. ఆసీన (కూర్చున్న) రూపం. శయన (పవళించిన) రూపం.

స్థితరూపం: ‘పాంచరాత్రాగమం’, ‘పాద్మ సంహిత’ ప్రకారం నిలబడిన శ్రీరాముడు మూడు వంపులున్న శ్యామల వర్ణ దేహంతో, రెండు చేతులతో ఉంటాడు. కిరీటం, శ్రీవత్సం లాంటి అలంకారాలతో, ప్రసన్నవదనంతో, కుడిచేతిలో బాణాన్ని, ఎడమ చేతిలో ధనుస్సును ధరించి ఉంటాడు. కొన్ని ఆలయాలలో నాలుగు చేతులతో... కుడి పరహస్తంలో చక్రం, ఎడమ పరహస్తంలో శంఖం ధరించి ఉంటాడు. శ్రీరాముని దివ్యరూపం 33 శుభ లక్షణాలను కలిగి ఉంటుంది. శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి శ్రీరాముని ప్రతిమ మధ్యమ దశతాళమానం ప్రకారం 120 అంగుళాలకన్నా ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. ఆ మూర్తి త్రిభంగిలో ఉన్న స్థానక మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించిన, నల్లని రూపం కలిగిన మూర్తి. రామునికి కుడివైపున నవార్ధ (తొమ్మిదిన్నర) తాళమానంలో చేసిన సీతా ప్రతిమ ఉండాలి. సీతాదేవి సమభంగిలో ఉండి, రాముని భుజాల ఎత్తు వరకూ ఉండాలి. రాముని తల మీద కిరీట మకుటం, సీత తలమీద కరండ మకుటం ఉండాలి. సీతాదేవి తన ఎడమ చేతిలో నీలోత్పలాన్ని ధరించి, కుడి చేతిని జారవిడిచినట్టు చూపించాలి. రామునికి ఎడమవైపున... 116 అంగుళాలకు మించని లక్ష్మణుని ప్రతిమ ఉండాలి. లక్ష్మణుడు రాముని భుజాల వరకు లేదా చెవుల వరకు... పసుపు పచ్చని మేని ఛాయతో, అన్ని విధాలా రాముణ్ణి పోలి, ధనుర్భాణాలు ధరించి ఉంటాడు. రామునికి ఎదురుగా... కాస్త కుడివైపున, 84 అంగుళాలకు మించని హనుమంతుడు ఉంటాడు. ఒక చేతిని నోటి మీద, వేరొక చేతిని జారవిడిచినట్టు చూపాలి. ‘విష్ణుధర్మోత్తర పురాణం’ ప్రకారం భరత, శత్రుఘ్నుల ప్రతిమలు కూడా ఉండాలి.


ఆసీన రూపం: రెండు చేతులు కలిగిన రాముని విగ్రహం ఆసీన భంగిమలో ఉన్నప్పుడు... ధనుర్భాణాలతో ఉండదు. ఈ రూపంలో శ్రీరాముడు కుడి, ఎడమ చేతులు అభయ, వరద ముద్రలతో ఉంటాయి. రామునికి ఎడమవైపున సీతాదేవి సుఖాసీనురాలై ఉంటుంది. ఎడమవైపున లక్ష్మణుడు అంజలీ బద్ధుడై ఉంటాడు. భద్రాచల దివ్య క్షేత్రంలో శ్రీవైకుంఠ రామచంద్రమూర్తి ఆసీన రూపంలో దర్శనమిస్తాడు. కుంభకోణంలోని రామర్‌ కోయిల్‌లో కూడా కూర్చున్న రాముణ్ణి దర్శించుకోవచ్చు.

శయనరూపం: శ్రీరాముడు శయన భంగిమలో ఉన్నప్పుడు... ఆయన కిరీటం దగ్గర సీతాదేవి సుఖాసీన స్థితిలో ఉంటుంది. లక్ష్మణుడు తదితరులు అంజలీబద్ధులైనట్టు, హనుమంతుడు యానాసనంలో లేదా శరాసనంలో ఉన్నట్టు రూపొందించాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. తిరువల్లూరులోని శ్రీవీరరాఘవస్వామిని, కుంభకోణంలోని శ్రీసారంగపాణి పెరుమాళ్‌ను శయనించి ఉన్న శ్రీరాముని ప్రతిమలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

కేవల శ్రీరాముడు: ‘పాద్మసంహిత’ ప్రకారం... రాముని విగ్రహం ఒక్కటే ప్రతిష్ఠించాల్సి వస్తే.. స్వామిని గర్భగుడి మధ్యభాగమైన బ్రహ్మభాగంలో ప్రతిష్ఠించాలి. స్వామి నిలబడి ఉంటే...

ధనస్సును, బాణాలను పట్టుకొని ఉన్నట్టు రూపొందించాలి. అయోధ్యలో బాలరాముణ్ణి ఆ విధంగానే రూపొందించి, ప్రతిష్ఠించారు.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి,

9440525788

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 01:54 AM