నిమ్మకాయ...ఊరగాయ
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:52 AM
నిమ్మకాయలో పులుపును ఇచ్చే సిట్రిక్ ఆమ్లం, విటమిన్ సి, పీచు పదార్థాలు, సువాసననిచ్చే సహజ తైలాలు, ఇంకా ఎన్నో వృక్ష రసాయనాలు ఉంటాయి. వాటిలో ఫ్లేవనాయిడ్లు, లిమోనాయిడ్లు, ఇతర ఫీనాలిక్ పదార్థాలు కూడా ఉన్నాయి.
నిమ్మకాయలో ఏముంది?
నిమ్మకాయలో పులుపును ఇచ్చే సిట్రిక్ ఆమ్లం, విటమిన్ సి, పీచు పదార్థాలు, సువాసననిచ్చే సహజ తైలాలు, ఇంకా ఎన్నో వృక్ష రసాయనాలు ఉంటాయి. వాటిలో ఫ్లేవనాయిడ్లు, లిమోనాయిడ్లు, ఇతర ఫీనాలిక్ పదార్థాలు కూడా ఉన్నాయి. నిమ్మ తొక్కను కూడా తేలిగ్గా తీసి పారేయకూడదు. తొక్కలో సువాసననిచ్చే సహజ తైలాలు, పీచు పదార్థాలు, కొన్ని వృక్ష రసాయనాలు ఉంటాయి. అందుకే తొక్కతో కలిపి చేసే నిమ్మ ఊరుగాయకు ప్రత్యేకమైన వాసన, రుచి వస్తాయి.
నిమ్మకాయకు ఉన్న పులుపు, ఘాటు, జీర్ణానికి తోడ్పడే గుణం, నోటి శుభ్రత, దప్పిక, కడుపు నొప్పి, కఫం, వాంతి, ఆయాసం, నులిపురుగులు, మలబద్ధకం వంటి వాటిపై కలిగించే ప్రభావాలను ‘భోజన కుతూహలం’ గ్రంథం వివరించింది. శరీరానికి బలాన్ని ఇచ్చేదిగా కూడా పేర్కొంది. రుచిని, ఆకలిని పెంచుతుంది. చర్మానికి మంచి కాంతినిస్తుంది. నిమ్మకాయ సన్ స్ర్కీనింగ్ ఏజెంట్ కూడా. అంటే ఎండవలన వచ్చే రియాక్షన్లను తగ్గిస్తుంది. నిమ్మకాయ మన వంటింట్లో చిన్నదే. కానీ దాని పని మాత్రం గుమ్మడికాయ కంటే పెద్దది. పప్పులో పులుపు తెస్తుంది. పులుసుకు రుచిని, చారులో కమ్మదనాన్ని పెంచుతుంది. ఇక ఉప్పులో ఊరబెడితే ఏడాది పొడవునా భోజనానికి తోడుగా ఉండే ఊరుగాయగా మారుతుంది.
ఉప్పు వేసి ఊరబెట్టి...
బాక్టీరియాలు, సూక్ష్మజీవుల గురించి ఈనాటి శాస్త్ర జ్ఞానం పుట్టక ముందే మన ఇళ్లలో ఆహారం చెడిపోకుండా దాచుకునే పద్ధతులు ఉండేవి. కాలానుగుణంగా విరివిగా దొరికే పండ్లను, కూరగాయలను ఉప్పులో ఊరబెట్టి ఎక్కువ కాలం నిల్వ చేసుకునేవారు. ఉప్పు ఆహార ద్రవ్యంలోని నీటిని కొంత బయటకు లాగుతుంది. దాంతో చెడుని కలిగించే సూక్ష్మజీవులు పెరగడాన్ని నిరోధిస్తుంది. నిమ్మకాయలో సహజంగా ఉండే సిట్రిక్ ఆమ్లం దాని పులుపునకు కారణం. ఆ పులుపు కూడా సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డగిస్తుంది. అందువల్ల ఉప్పు, పులుపు కలయిక నిమ్మకాయను ఎక్కువ కాలం నిల్వ ఉంచే సహజమైన మార్గం. ఉప్పు ఎంత వేయాలనేది తూనికలు, కొలతల పద్ధతితో కాకుండా ఆడవాళ్లు తన చేతి అనుభవంతోనే నిర్ధారిస్తారు. రూల్ ఆఫ్ థంబ్ అంటే ఇదే కదా. అయితే నిమ్మకాయను ఊరబెట్టిన తరువాత దానిలోని ప్రతి పోషక పదార్థం పెరుగుతుందని అనుకోవడం సరికాదు. ముఖ్యంగా విటమిన్ సి ఊరబెట్టడంవల్ల పెరగదు. నిల్వ కాలం, ఉప్పు, వేడి, వెలుగు, గాలి వంటి వాటిని బట్టి అది కొంతమేర తగ్గవచ్చు కూడా.
ఊరగాయ ఇలా...
నిమ్మకాయను ఉప్పులో ఊరబెట్టిన తరువాత కారం, పసుపు, ఆవ పిండి, మెంతి పిండి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కలుపుతాం. దీనివల్ల నిమ్మ ఊరుగాయలో పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు రుచులు కలసి నిమ్మ ఊరగాయని సంపూర్ణాహారంగా మలుస్తాయి.
గంగరాజు అరుణాదేవి
ఈ వార్తలనూ చదవండి...