Share News

యశోదను చేరిన శిశువు

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:08 AM

కారాగారంలో దేవకీ వసుదేవులకు దివ్యదర్శనం ఇచ్చిన శ్రీహరి... మళ్ళీ పసిబాలుడిగా మారిపోయాడు. ఆయనను వారం కీర్తిస్తూ ఉండగా... వారి సంకెళ్ళు విడిపోయాయి. శ్రీహరి ఆదేశం ప్రకారం ఆ పసిబిడ్డను వస్త్రంలో చుట్టి, నెత్తిన పెట్టుకొని, నందవ్రజానికి వసుదేవుడు బయలుదేరాడు.

యశోదను చేరిన శిశువు

కారాగారంలో దేవకీ వసుదేవులకు దివ్యదర్శనం ఇచ్చిన శ్రీహరి... మళ్ళీ పసిబాలుడిగా మారిపోయాడు. ఆయనను వారం కీర్తిస్తూ ఉండగా... వారి సంకెళ్ళు విడిపోయాయి. శ్రీహరి ఆదేశం ప్రకారం ఆ పసిబిడ్డను వస్త్రంలో చుట్టి, నెత్తిన పెట్టుకొని, నందవ్రజానికి వసుదేవుడు బయలుదేరాడు. చెరసాల తలుపులన్నీ బార్లా తెరుచుకున్నాయి. కావలివాళ్ళు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నారు. సన్నగా వర్షం మొదలయింది. పసివాడు తడిసిపోతాడేమోనని వసుదేవుడు భయపడ్డాడు. అంతలోనే ఆదిశేషుడు తన పడగలు విప్పి, శిశువు తడవకుండా ఛత్రం పట్టాడు. అదంతా విష్ణుమాయ అని అర్థమైన వసుదేవుడు మంత్రముగ్ధుడై ముందుకు సాగాడు. పరవళ్ళు తొక్కుతున్న యమున... కృష్ణదేవునికి దారి ఇచ్చింది. పూర్తిగా తెల్లవారకుండానే నందవ్రజానికి వసుదేవుడు చేరుకున్నాడు.

గోకులమంతా అందంగా, హాయిగా ఉంది. కానీ చిత్రంగా అందరూ మాయామోహితులై ఉన్నారు. ఎక్కడా ఏ అలికిడీ లేదు. వసుదేవుడు నేరుగా తన ప్రాణస్నేహితుడైన నందుని ఇంటికి చేరుకొని, సరాసరి పురిటి గదిలోకి వెళ్ళాడు. అక్కడ యశోదను, ఆమె పక్కనే ఉన్న పసికందును చూశాడు. తన చేతుల్లోని చక్కనయ్యను యశోద పక్కన పడుకోబెట్టి, ఆమెకు పుట్టిన పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం తన లీలా శిశువును చూశాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. వెనక్కు తిరిగి బయటకు వచ్చేశాడు. వచ్చిన దారినే మధురను చేరాడు. తన చేతుల్లోని బిడ్డను దేవకి పక్కన పడుకోబెట్టాడు. తక్షణమే వసుదేవుని కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు పడ్డాయి. ద్వారబంధాలన్నీ మూసుకున్నాయి. అంతలో దేవకి పక్కన ఉన్న పసిపాప ఏడవడం మొదలుపెట్టింది. కావలి వాళ్ళకు మెలకువ వచ్చింది. గబగబా రాజప్రాదానికి వెళ్ళారు. దేవకీదేవి ప్రసవించిందని చెప్పారు. తనను ఇంతకాలంగా భయపెడుతూ వచ్చిన మృత్యువు... గుమ్మం ముందే నిలబడినట్టు కంసుడు గజగజ వణికిపోయాడు. పరుగులాంటి నడకతో కారాగారం చేరుకున్నాడు. దేవకి చేతిలో ఉన్న బిడ్డను లాక్కున్నాడు.


కంసుడి పశ్చాత్తాపం

దేవకీ వసుదేవులు అతణ్ణి బతిమాలారు. ‘‘పుట్టింది ఆడపిల్ల కదా! తనవల్ల నీకు ఎలాంటి ప్రాణహానీ ఉండదు. దయతలచు’’ అని వేడుకున్నారు. కంసుడు వినలేదు. పసిపిల్ల కాళ్ళు రెండూ పట్టుకొని, గిరగిరా తిప్పి ఆకాశంలోకి ఎగరేశాడు. అలా పైకి వెళ్ళిన పాప పైపైకే వెళ్ళంది కానీ నేల మీద పడలేదు. పైకి వెళుతూ క్షణక్షణం తన రూపాన్ని మార్చుకుంది. ఎనిమిది చేతులతో ఆయుధపాణిగా, అతి భీకరంగా దర్శనమిచ్చింది. కంసుడు హడలిపోయాడు. ఆ పసిపాప కంసుణ్ణి ఉద్దేశించి... ‘‘కంసా! నువ్వు క్రూరుడివి. దుర్మార్గుడివి. కనుకనే దేవకి కన్న బిడ్డలందరినీ కిరాతకంగా చంపావు. అయినా నీ రాక్షసత్వం చల్లారలేదు. ఆడపిల్లననే కనికరం లేకుండా నన్ను సంహరించబోయావు. నిన్ను చంపేవాడు నాతోనే పుట్టి, మరోచోట పెరుగుతున్నాడు. అతణ్ణి తలచుకుంటూ బతికినంతకాలం భయం భయంగా గడుపు. ఏ క్షణాన్నైనా నీ బతుకు ముగిసిపోవచ్చు’’ అని చెప్పి అదృశ్యమయింది. తనకు చావు దగ్గరకొచ్చిందని తెలియగానే కంసునిలో పశ్చాత్తాపం మొదలయింది. దేవకీ వసుదేవులను బంధించి, ఇంకా చెరసాలలో ఉంచడం వల్ల ప్రయోజనం లేదనుకున్నాడు. వాళ్ళను చెరసాల నుంచి విడిపించాడు. అశరీరవాణి మాటలు విని... ప్రాణభయంతో మీ బిడ్డలను అకారణంగా హతమార్చాను. నా దుర్మార్గాన్ని క్షమించండి. నన్ను మన్నించండి’’ అని పదేపదే వేడుకొని, తన రాజప్రాసాదానికి వెళ్ళిపోయాడు.


సహచరుల దుర్బోధ

మర్నాడు కంసుడు తన సహచరులతో సమావేశమయ్యాడు. క్రితం రోజు జరిగిన సంగతంతా చెప్పాడు. ‘‘నన్ను సంహరించడానికి శ్రీహరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడట’’ అంటూ భయాందోళనలు వ్యక్తం చేశాడు. ‘‘మహారాజా! దేవతలు మనకు బద్ధ శత్రువులు. వారు వట్టి పిరికిపందలు. గతంలో మీ జోలికి వచ్చి దెబ్బ తిన్నారు. కాబట్టి మళ్ళీ అటువంటి సాహసం చేస్తారని మేము అనుకోము. అయితే దొంగ దెబ్బ తియ్యడానికి ప్రయత్నించవచ్చు. ఆ విషయంలో ఆరితేరినవాడు శ్రీహరి. కాబట్టి శత్రుశేషం లేకుండా చేయాలి. అయినా నిన్నో, మొన్నో పుట్టినవాడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అతను పెరిగి పెద్దవాడయ్యేవరకూ మనం ఉండనిస్తేగా! అయితే మహారాజా! ఇక్కడ ఒక సమస్య ఉంది. అనునిత్యం పుడుతూ ఉండే అసంఖ్యాకమైన శిశువుల్లో శ్రీహరిని గుర్తించడం ఎలా? అందుకు కూడా ఒక ఉపాయం ఉంది. వారూ, వీరూ అని లేకుండా ఇటీవల పుట్టిన పిల్లలందరినీ సంహరిద్దాం. అలా చేస్తే దేవకి అష్టమ పుత్రుడు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేడు’’ అని దుర్బోధ చేశారు. కంసుడికి ఆ ఆలోచన నచ్చింది. వెంటనే ‘‘సరే’’ అన్నాడు. మరికొందరు మరో సందేహం వ్యక్తపరిచారు. ‘‘ఆ శిశువు సామాన్యుడు కాదు. మాయలూ, మంత్రాలు తెలిసినవాడు. ఈమధ్యే పుట్టి ఉండొచ్చు. పుడుతూనే పెద్దవాడిగా మారిపోయి కూడా ఉండవచ్చు. కాబట్టి అతను నివసించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను, మునివాటికలను, సాధువుల సత్రాలను, యజ్ఞ యాగాది క్రతువులను ధ్వంసం చేద్దాం. అప్పుడు శ్రీహరి అంతరించి తీరుతాడు’’ అని సలహా ఇచ్చారు. కంసుడికి ఈ మాటలు మరీ బాగా నచ్చాయి. ‘‘తక్షణమే బయలుదేరండి’’ అన్నాడు ఉత్సాహంగా. వాళ్ళు విజృంభించారు.

ప్రయాగ రామకృష్ణ

ఈ వార్తలనూ చదవండి:

అడవిని గెలిచిన ధీర

కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు

Updated Date - Sep 18 , 2026 | 12:11 AM