Kite Flying Safety: పతంగులు... ప్రమాదాలకు దూరంగా...
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:01 AM
పతంగుల పండుగ వచ్చేస్తోంది. అయితే వాటితో ప్రమాదాలకు గురి కాకుండా పండుగ సరదాలను ఆస్వాదించే మార్గాలను అనుసరించాలి...
అప్రమత్తం
పతంగుల పండుగ వచ్చేస్తోంది. అయితే వాటితో ప్రమాదాలకు గురి కాకుండా పండుగ సరదాలను ఆస్వాదించే మార్గాలను అనుసరించాలి.
గాజు, లోహపు పొడి మిశ్రమంతో తయారయ్యే మాంజా దారాలతో, గాలిపటాల క్రీడ ప్రమాదకరంగా మారిపోతోంది. గాయాలతో పాటు అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రాణహానికి కూడా దారి తీస్తోంది. వృత్తి జీవితంలో భాగంగా వైద్యులు అలాంటి అనేక సందర్భాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి కొన్ని సందర్భాలు, ఉదంతాలు, ప్రమాదాల గురించి వివరించాలనుకుంటున్నాను. అవి పండుగ ముందు రోజులు. 45 ఏళ్ల మహిళను అత్యవసర వార్డులో చేర్పించారు. గాలిపటం మాంజా దారం మెడకు ఒరుసుకుపోవడంతో, తీవ్ర రక్తస్రావానికి గురైన ఆమె పరిస్థితి ప్రాణాంతకంగా మారిపోయింది. ఆస్పత్రికి చేరువలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో అత్యవసర శస్త్రచికిత్సతో ఆమె ప్రాణాలను కాపాడగలిగాం! ఇలా వృత్తి జీవితంలో భాగంగా ఇప్పటివరకూ ఆరు అత్యవసర సర్జరీలు చేశాను. అయితే కాలక్రమేణా గాలిపటం ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2016లో ఢిల్లీలో ఇద్దరు పిల్లలు గాలిపటం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో, గాజు పొడి పైపూతతో కూడిన మాంజా దారాల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాల మీద ప్రభుత్వం నిషేథం విధించింది. ఈ రకమైన మాంజా దారాలను విక్రయించిన వారికి ఐదేళ్ల కారాగార శిక్ష, లక్ష రూపాయాల జరిమానాలను ప్రభుత్వం విధించింది.
దారాలే ఉరితాళ్లు...
గాలిపటాల గాయాలు స్వల్పంగా ఉండడం వల్ల సాధారణంగా వెలుగులోకి రాకుండాపోతూ ఉంటాయి. మాంజా వల్ల చేతులు కోసుకుపోవడమన్నది సర్వసాధారణం. కానీ అదే దారం మెడకు ఒరుసుకుపోతే, ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. ద్విచక్రవాహన దారులు ఎక్కువగా ఈ ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. కరెంటు తీగలకు చుట్టుకున్న, లేదా చెట్లలో ఇరుక్కుపోయిన గాలిపటాలను అందుకునే క్రమంలో పిల్లలు, యువత ప్రమాదాలకు గురయ్యే సందర్భాలు కూడా ఎక్కువే! ఈ దారాలు కాళ్లకు చుట్టుకుపోయి పలు పక్షులు కూడా మృత్యువాత పడుతూ ఉంటాయి. ప్రతి ఏటా గాలిపటాల దారాల వల్ల గాయపడే పక్షులకు సంబంధించి ‘పెటా’ (ప్యూపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)కు వేలకొద్దీ కాల్స్ వస్తూ ఉంటాయి. మాంజా దారాలతో ఈ ప్రమాదాలతో పాటు ఇంకొన్ని ముప్పులు కూడా పొంచి ఉంటాయి. మాంజా దారాలు కలిగి ఉండే లోహపు పైపూతతో కూడిన ఈ దారాలు, విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగలకు చుట్టుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్స్, అగ్నిప్రమాదాలు తలెత్తే ముప్పు ఉంటూ ఉంటుంది.
నిఘా ముఖ్యం
ఈ ప్రమాదాలను అరికట్టడం కోసం పతంగులు, దారాలు అమ్మే దుకాణాల మీద నిఘా పెట్టి, కఠినచర్యలు తీసుకోవడం అత్యవసరం. మాంజా దారాల ప్రమాదాలను అరికట్టడంలో ప్రజల పాత్ర కూడా కీలకమే!
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి