Earlobe Repair: చెవిపోగు రంధ్రాన్ని సరిచేద్దాం
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:04 AM
చెవిలో కింది భాగమైన ఇయర్ లాబ్యూల్‌లో చర్మం, కొవ్వు మాత్రమే ఉంటుంది. కాబట్టి మృదువుగా, సాగే గుణాన్ని కలిగి ఉండే ఈ ప్రదేశంలో ఏర్పరిచే రంధ్రాలు కూడా క్రమేపీ సాగుతాయి. చెవి పైభాగమైన ఇయర్ హెలిక్స్, నమ్యత...
పండగ అలంకరణలో భాగంగా బరువైన కమ్మలు, జూకాలు లాంటివి అలంకరించుకోవాలంటే అందుకు చెవులు కూడా సహకరించాలి. కానీ చెవి రంధ్రం సాగిపోయిన వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ ఇబ్బందిని సరి చేసే వీలుందా? వైద్యులేమంటున్నారు?
చెవిలో కింది భాగమైన ఇయర్ లాబ్యూల్‌లో చర్మం, కొవ్వు మాత్రమే ఉంటుంది. కాబట్టి మృదువుగా, సాగే గుణాన్ని కలిగి ఉండే ఈ ప్రదేశంలో ఏర్పరిచే రంధ్రాలు కూడా క్రమేపీ సాగుతాయి. చెవి పైభాగమైన ఇయర్ హెలిక్స్, నమ్యత కలిగిన మృదు కణజాలంతో కాస్త బిగుతుగా, దృఢంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏర్పరిచే రంథ్రాలు సాగవు. అలాగని ఇయర్ లాబ్యూల్ అందర్లో ఒకేలా ఉండదు. కాబట్టి అందరికీ సాగిపోతుందని అనుకోడానికి కూడా వీల్లేదు. ఈ సమస్య ప్రధానంగా శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొందరు మహిళల ఇయర్ లాబ్యూల్స్ సాగిపోతూ, తెగిపోతూ ఉంటాయి. దుస్తులు మార్చుకునేటప్పుడు లేదా పిల్లలు కమ్మలు పట్టుకుని లాగేసినప్పుడు ఇలా జరగవచ్చు.
సరికొత్త సర్జరీలతో...
ఇయర్ లాబ్యూల్ రంధ్రం సాగిపోయి లేదా తెగిపోయినప్పుడు, చిన్న రంధ్రాన్ని వదిలేసి, మిగతా భాగాన్ని జోడించే సంప్రదాయ సర్జరీ చేసేవారు. కానీ ఈ రకమైన సర్జరీతో తిరిగి సమస్య పునరావృతయ్యే అవకాశాలు ఎక్కువ. సంప్రదాయంలో భాగంగా చెవి కమ్మలు ధరించకుండా ఉండలేని సందర్భాల్లో మాత్రమే ఇలాంటి సర్జరీని అనుసరించాలి. లేదంటే లాబ్యూల్ రంధ్రాన్ని పూర్తిగా మూసేసే సర్జరీని ఎంచుకోవాలి. ఈ సర్జరీ చేయించుకున్న ఆరు వారాల తర్వాత, అవసరమైన చోట రంధ్రాన్ని ఏర్పరుచుకుని, ఆరు వారాల పాటు తేలికపాటి కమ్మలు పెట్టుకుంటూ, ఆ తర్వాత బరువైన కమ్మలు పెట్టుకోవచ్చు. ఈ రకమైన సర్జరీతో ఇయర్ లాబ్యూల్ రంథ్రం సాగిపోయే సమస్య ఉండదు. అరుదుగా కొందర్లో ఈ భాగం పలుచగా ఉండి, కొన్నేళ్లకు మళ్లీ రంథ్రం సాగిపోవచ్చు. ఇలాంటి అరుదైన సందర్భాల్లో, ఇయర్ ఫెలిక్స్ (చెవి పైభాగం)లోని మృదుకణజాలాన్ని సేకరించి, ఇయర్ లాబ్యూల్ లోపల అమర్చి, చర్మాన్ని మూసేసి, గాయం పూర్తిగా మానిపోయిన తర్వాత రంధ్రం చేయొచ్చు. ఈ సర్జరీతో సమస్య తిరగబెట్టే అవకాశం ఉండదు.
నీడిల్ పియర్సింగ్ ఉత్తమం
సాధారణంగా పియర్సింగ్ కోసం గన్స్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఈ విధానంలో రంధ్రం ఏర్పడే ప్రదేశంలో స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకోవచ్చు. ఇయల్ లాబ్యూల్ మరీ చిన్నగా ఉన్న వారిలో 1 లేదా 2 మిల్లీమీటర్ల వ్యత్యాసం కూడా పెద్ద తేడాను సృష్టించవచ్చు. అలాగే ఈ విధానంలో అమర్చే ఆభరణాలు కృత్రిమమైనవి ఉంటాయి. దాంతో కొందరికి అలర్జీ తలెత్తవచ్చు. కాబట్టి ఈ విధానానికి బదులుగా కచ్చితత్వంతో రంధ్రాన్ని ఏర్పరుచుకోవడం కోసం నీడిల్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ విధానంతో, ఇయర్ లాబ్యూల్‌తో పాటు వంపుతో కూడిన ఇయర్ హెలిక్స్‌లో కచ్చితమైన ప్రదేశంలో రంధ్రాన్ని ఏర్పరుచుకుని, కృత్రిమ ఆభరణాలకు బదులుగా బంగారు ఆభరణాన్నే చెవికి అమర్చుకోవచ్చు.

బిగుతుగా బిగిస్తే...
కొందరు కమ్మలు జారిపోతున్నాయనే ఆలోచనతో వాటికి ఆసరాగా బటన్స్ బిగించుకుంటూ ఉంటారు. అయితే వీటిని బిగుతుగా బిగించేసి, అలాగే వదిలేయడం వల్ల ఆ ప్రదేశం ఒరుసుకుపోయి, బటన్ పైనుంచి కండ పెరిగిపోతుంది. దాంతో చెవి కమ్మ తొలగించలేని సమస్య తలెత్తుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అప్పుడప్పుడూ కమ్మలను తొలగిస్తూ ఉండాలి. కమ్మలతో తలెత్తే అసౌకర్యాన్ని పరిశీలించుకుంటూ, ఒరుసుకుపోకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు అలంకరించే చెవి జూకాల విషయంలో కూడా ఇవే జాగ్రత్తలు పాటించాలి.
కిలాయిడ్స్ సమస్య ఉంటే...
కొందరికి గాయమైన ప్రదేశంలో కండ పెరిగే ‘కిలాయిడ్’ సమస్య ఉంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు ఇయర్ హెలిక్స్‌లో రంధ్రాలు చేయించుకోకుండా ఉండడమే మేలు. ఈ సమస్య ఉన్నవారు గన్‌షాట్‌కు బదులుగా సంప్రదాయ పద్ధతిలో భాగంగా, చేత్తో చెవి లాబ్యూల్‌కు రంధ్రం చేయించుకోవడం ఉత్తమం.
రంథ్రం సాగిపోకుండా...
బరువైన చెవి ఆభరణాలు అరుదుగా అలంకరించుకోవాలి
చెవి ఆభరణానికి ఆసరా అందించే అదనపు ఆభరణాలు వాడుకోవాలి
రంధ్రం సాగుతున్నట్టు గ్రహించిన వెంటనే జాగ్రత్త పడాలి
కమ్మలు, జూకాలు దుస్తులకు తగులుకోకుండా చూసుకోవాలి
చిన్న పిల్లల చేతికి అందకుండా జాగ్రత్తపడాలి
డాక్టర్ వెంకటేష్ బాబు
ప్లాస్టిక్ రికన్‌స్ట్రక్టివ్ అండ్
ఈస్థటిక్ సర్జన్,
కాస్మోస్యూర్ క్లినిక్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి