ఈ ప్రయాణం నిరంతర యుద్ధం
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:21 AM
దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. కఠిన చట్టాలు వస్తున్నా, శిక్షలు పడుతున్నా మృగాళ్ల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యవస్థాగత...
దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. కఠిన చట్టాలు వస్తున్నా, శిక్షలు పడుతున్నా మృగాళ్ల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యవస్థాగత వైఫల్యాలను ఎండగడుతూ, బాధితులకు కొండంత అండగా నిలుస్తున్న ధీశాలి ఢిల్లీకి చెందిన యోగితా భయానా. ఆ పోరాటం.. ఆమె మాటల్లోనే..
చాలామంది నన్ను అడుగుతుంటారు. ‘యోగితా నీకు ఇదంతా అవసరమా? హాయిగా ఉండే జీవితాన్ని వదిలి ఈ కన్నీళ్లు, గాయాల మధ్య ఎందుకు ఉంటావు?’ అని. కానీ, 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు, ఆ తల్లిదండ్రుల వేదనను దగ్గరుండి చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది.. మన చట్టాలు కాగితాల మీద బలంగానే కనిపిస్తాయి కానీ క్షేత్ర స్థాయిలో బాధితులకు అవి భరోసా అందించలేకపోతున్నాయని. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం నుంచి కోర్టులో తీర్పు వచ్చే వరకు ఒక మహిళ ఎన్ని అవమానాలను, ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటుందో నేను కళ్లారా చూశాను. ఆ అగాధాన్ని పూడ్చడమే నా జీవితాశయంగా మార్చుకున్నాను. నేను కేవలం ఏసీ గదుల్లో కూర్చుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తను కాను. నా కార్యక్షేత్రం ఆసుపత్రి వార్డులు, పోలీస్ స్టేషన్ కారిడార్లు, కిక్కిరిసిన కోర్టు గదులు. అక్కడే అసలైన భారతం ఉంది.
వ్యవస్థాగత లోపాలతో పోరాటం
ప్రతి రోజు నా పోరాటం మూడు అంచెలుగా సాగుతుంది. ఒక ఘటన జరిగిన వెంటనే బాధితురాలు భయంతో వణికిపోతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ పోలీసుల నిర్లక్ష్యం చూసినప్పుడు నా రక్తం మరుగుతుంది. ‘అర్ధరాత్రి బయట నీకేం పని?’, ‘అతడు నీకు ముందే తెలుసా?’ వంటి ప్రశ్నలతో బాధితురాలిని వేధించే అధికారులను నేను వదిలిపెట్టను. సరైన సెక్షన్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించడం కోసం నేను అధికారులతో గంటల తరబడి వాదించాల్సి వస్తుంది. పోలీసులకు చట్టం చెప్పడం నా పనికాదు, కానీ వారు చట్టాన్ని అమలు చేసేలా చేయడం నా బాధ్యత. ఆ తర్వాత ఆసుపత్రిలో ఫోరెన్సిక్ పరీక్షల దగ్గరి నుంచి వారికి సరైన చికిత్స అందే వరకు అక్కడే ఉంటాను. వైద్య పరీక్షల సమయంలో బాధితులకు జరిగే అవమానం వర్ణనాతీతం. వారికి ప్రైవసీ ఉండదు. కనీసం ఓదార్చే మనిషి ఉండడు. అందుకే నేను తోడుగా నిలుస్తాను. ఇక చివరిగా కోర్టులో విచారణ. ఏళ్ల తరబడి కేసులు నలుగుతుంటే బాధితులు విసిగిపోతారు. సాక్షులను బెదిరిస్తారు. ఆర్థికంగా వేధిస్తారు. రాజకీయ పలుకుబడి ఉన్న దోషులను ఎదిరించినప్పుడు నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నాపై దాడులు జరిగాయి. హత్రాస్ నుంచి ఉన్నావో వరకు నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఎందుకంటే అక్కడ ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఒక కేసులో విజయం సాధించడానికి ఏళ్లు పట్టొచ్చు. కానీ, ఆ విజయం ఇచ్చే నమ్మకం వేలమంది బాధితులకు ఊపిరిపోస్తుంది.
అలుపెరగని ఆవేదన
నిజం చెప్పాలంటే, ప్రతి రోజు దారుణమైన నేరాల గురించి వినడం, బాధితుల గ్రాఫిక్ చిత్రాలను చూడటం నన్ను మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో దగ్గరగా చూసినప్పుడు మనుషులపైనే అసహ్యం వేస్తుంది. ఒక్కోసారి నా శరీరం, మనసు అలసిపోతాయి. దానినే అందరూ బర్నౌట్ అంటారు. కానీ అది నా బలహీనత కాదు, ఒక మనిషిగా మరొకరి బాధను పంచుకున్నప్పుడు కలిగే సహజమైన ప్రతిస్పందన. నా ఈ పోరాటం వెనుక ఎలాంటి స్వార్థం లేదు. దీనివల్ల నాకు ఆర్థికంగా ఒనగూడే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇది ‘అన్‌పెయిడ్ యాక్టివిజం’. కానీ ఒక బాధితురాలికి న్యాయం జరిగినప్పుడు, వ్యవస్థలో చిన్న మార్పు వచ్చినప్పుడు కలిగే తృప్తి వెలకట్టలేనిది. నేను కేవలం వీధుల్లో మాత్రమే కాదు, విధానపరమైన నిర్ణయాల్లో కూడా భాగస్వామిని అవుతున్నాను. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ (పి.వో.ఎ్‌స.హెచ్) సభ్యురాలిగా ఉంటూ మహిళలకు సురక్షితమైన వాతావరణం కోసం కృషి చేస్తున్నాను. విద్యావ్యవస్థలో మార్పు రావాలని, చిన్నతనం నుంచే లైంగిక సమానత్వం గురించి నేర్పించాలని నేను నమ్ముతాను. మనం ఎన్ని చట్టాలు తెచ్చినా, మనిషి ఆలోచన మారనంత కాలం ఈ నేరాలు ఆగవు.
వ్యవస్థ మారాలి
మహిళల భద్రత గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది. ఏటా పార్లమెంటులో మహిళల భద్రతపై ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని నేను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాను. బడ్జెట్‌పై ఎలా చర్చిస్తారో, దేశ భద్రత గురించి ఎలా మాట్లాడతారో, అలాగే దేశంలోని సగం జనాభా గురించి కూడా చర్చించాలి. చట్టాలు మారాలి. అంతకంటే ముఖ్యంగా సమాజం ఆలోచనా విధానం మారాలి. దోషులను వెనకేసుకొచ్చే రాజకీయ సంస్కృతి అంతం కావాలి. అధికార వర్గాలు తమ బాధ్యతను మానవత్వంతో నిర్వహించిన రోజున నా అవసరం ఉండదు. పోలీస్ స్టేషన్‌లో బాధితులకు గౌరవం దక్కిన రోజున, కోర్టుల్లో న్యాయం వేగంగా జరిగే రోజున నేను ప్రశాంతంగా నిద్రపోతాను. కానీ అప్పటి వరకు అధికారులు ఎక్కడైతే వెనుకడగు వేస్తారో, అక్కడ నిలబడతాను. వారు ఎక్కడైతే మౌనంగా ఉంటారో అక్కడ నేను ప్రశ్నిస్తాను. న్యాయం అందరికీ సమానంగా అందే వరకు, ప్రతి ఆడబిడ్డ నిర్భయంగా నడిచే వరకు నా ఈ పోరాటం ఆగదు. ఇది కేవలం యోగితా భయానా పోరాటం కాదు, ఇది మనందరి సామూహిక బాధ్యత. మన ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడే కాదు, ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా స్పందించే గుణం మనలో ఉండాలి. అప్పుడే మనది నిజమైన నాగరిక సమాజం అవుతుంది.
లక్ష్యం ఒక్కటే
నేను ‘పీపుల్స్ అగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా’ (పిఎఆర్‌ఐ) సంస్థను స్థాపించినప్పుడు నా ముందున్న లక్ష్యం ఒక్కటే.. ఏ బాధితురాలు కూడా ఒంటరిగా పోరాడకూడదు. అత్యాచారానికి గురైన మహిళకు సమాజం ఇచ్చే శిక్ష మరణం కంటే ఘోరంగా ఉంటుంది. వారిని చూసే చూపు, చేసే వ్యాఖ్యలు వారిని మానసికంగా చంపేస్తాయి. అందుకే వారికి ‘ధైర్యం’ అనే మందును ఇవ్వడానికి నేను ముందు వరుసలో నిలబడతాను. మన సమాజంలో బాధితురాలిని నిందించే ధోరణి ఇంకా పోలేదు. ఆ ఆలోచనా విధానాన్ని మార్చడమే అతిపెద్ద సవాలు.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News