Share News

క్యాన్సర్‌ కొమ్ములు విరుద్దాం!

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:42 AM

క్యాన్సర్‌ విషయంలో మనందరం హర్షించవలసిన విషయం ఒకటుంది. దశ, రకంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా క్యాన్సర్లు అదుపులోకొస్తున్నాయి. ఈ రోగులందరూ మునుపటి కంటే దీర్ఘకాలం...

క్యాన్సర్‌ కొమ్ములు విరుద్దాం!

ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం

ప్రముఖ క్యాన్సర్‌ పరిశోధకులు, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, డాక్టర్‌ నోరి దత్తాత్రేయ, క్యాన్సర్‌ వ్యాధి, అధునాతన చికిత్సల పట్ల లోతైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా, క్యాన్సర్‌ చికిత్సలో సాధించిన పురోగతి గురించీ, ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే మార్గాల గురించీ ఆయన వివరించిన ఆసక్తికరమైన విశేషాలివి..

క్యాన్సర్‌ విషయంలో మనందరం హర్షించవలసిన విషయం ఒకటుంది. దశ, రకంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా క్యాన్సర్లు అదుపులోకొస్తున్నాయి. ఈ రోగులందరూ మునుపటి కంటే దీర్ఘకాలం జీవించగలుగుతున్నారు. వ్యాధినిర్థారణ పరీక్షల విస్తృతి పెరగడం, క్యాన్సర్‌ మొదటి, రెండు దశలకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే మూడు, నాలుగో దశల్లో వ్యాధినిర్థారణ అయిన రోగులకు కూడా ఇమ్యునో, టార్గెటెడ్‌ థెరపీలతో వ్యాధిని అదుపులోకి తెచ్చి, ఆయుర్దాయాన్ని పెంచగలుగుతున్నాం.

అవగాహన మరింత పెరగాలి

మన దేశంలో ప్రతి ఏటా, 10 లక్షల 47 వేల మందికి క్యాన్సర్‌ నిర్థారణ అవుతోంది. అలాగని క్యాన్సర్‌ పెరిగిపోతోందని భయపడకూడదు. వ్యాధినిర్థారణ సులభతరం కావడం, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెరిగి తొలినాళ్లలోనే ఈ వ్యాధిని కనిపెట్టగలగడం వల్ల క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. అలాగని ప్రతిచోటా క్యాన్సర్‌ కేంద్రాలను విస్తరించుకుంటూ వెళ్లడం సరి కాదు. ఈ వ్యాధితో వ్యవహరించవలసిన తీరు ఇది కానే కాదు. వ్యాధికి అడ్డుకట్ట వేయడం ద్వారానే దీని మీద విజయం సాధించగలుగుతాం! అందుకోసం క్యాన్సర్‌ పట్ల అవగాహనను మరింత పెంచాలి. వ్యాధి రాకుండా చూసుకోవడం, తొలినాళ్లలోనే కనిపెట్టడం, వ్యాధి నిర్థారణ పరీక్షలను మరింత విస్తృతపరచడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని తుదముట్టించగలుగుతాం!


మాలిక్యులర్‌ ఆంకాలజీ ప్రత్యేకత ఇదే!

రేడియేషన్‌, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. అలాగే క్యాన్సర్‌ సోకిన వ్యక్తి నుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ చేసి, నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ (ఎన్‌జిఎస్‌) చేయగలిగితే, ఆ క్యాన్సర్‌ ఏ పరమాణు మార్పుల వల్ల వచ్చిందన్నది తేలిపోతుంది. తద్వారా నిర్దిష్ట క్యాన్సర్‌ కారక జన్యువును గుర్తించి, టార్గెటెడ్‌ థెరపీ ద్వారా సదరు క్యాన్సర్‌ను సరిదిద్దే నోటి మాత్రను ఎంచుకుని వాడుకోవడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి పొందే వీలుంది.

స్వయంకృతాపరాథమే!

70 శాతం క్యాన్సర్లు నివారించదగినవే! వీటిలో ఎక్కువ శాతం పొగాకుతోనే ముడిపడి ఉంటున్నాయి. ఏకబిగిన 30 ఏళ్ల పాటు సిగరెట్లు తాగేసి, క్యాన్సర్‌ తెచ్చుకుని, ‘చికిత్స లేదా?’ అని వైద్యులను ప్రశ్నించడం ఎంతవరకూ సమంజసం? సంక్లిష్టమైన జన్యు ఉత్పరివర్తనాలతో తలెత్తే క్యాన్సర్లకు ఎవరూ బాధ్యులు కారు. కానీ స్వయంగా కొని తెచ్చుకునే క్యాన్సర్లకు మనదే పూర్తి బాధ్యత. నిన్న లేని క్యాన్సర్‌ ఒకేసారి నాల్గో దశలో బయల్పడడం అసంభవం. క్యాన్సర్‌ కచ్చితంగా కొన్ని సంకేతాలు, లక్షణాల ద్వారా ముందస్తుగానే మనల్ని హెచ్చరిస్తుంది. ఇదంతా పక్కన పెట్టి, ఇష్టారాజ్యంగా జీవితాన్ని గడిపేసి, వ్యాధిని నయం చేయలేకపోతున్నారని వైద్యులను నిందించడం, మెరుగైన చికిత్స కోసం విదేశాలకు పరుగులు పెట్టడం అవివేకం.

ఆంకోటైప్‌ డిఎక్స్‌ పరీక్ష

ప్రతి క్యాన్సర్‌, సొంత మాలిక్యులర్‌ సిగ్నేచర్‌ను కలిగి ఉంటుంది. కాబట్టే ఒకే రకమైన చికిత్స అందరికీ సమాన ఫలితాన్ని ఇవ్వదని ఆలస్యంగా బయల్పడింది. దీనికి ముందు రొమ్ము క్యాన్సర్‌ సోకిన మహిళలందరికీ గడ్డ పరిమాణం, రకంతో పని లేకుండా, కీమోథెరపీనే సూచించేవారు. కానీ నేడు చికిత్స తీరు మారింది. తొలిదశ రొమ్ము క్యాన్సర్‌ సోకిన వారికి, ఆంకోటైప్‌ డిఎక్స్‌ పరీక్ష చేపట్టి, కణితి కణజాలంలోని 21 జన్యువులను విశ్లేషించి, క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశాలను, కీమోథెరపీతో ఒరిగే ప్రయోజనాలను అంచనా వేయగలుగుతున్నాం. అలాగే ఏ రకమైన కీమో ప్రయోజనకరం, ఆ కీమో ఎంతటి టాక్సిసిటీని కలిగి ఉంటుంది, టాక్సిసిటీ లేకుండా ఎంత ప్రయోజనం పొందే వీలుందన్నది కూడా వైద్యులు తెలుసుకోగలుగుతారు. అలా ఈ పరీక్ష ఆధారంగా దుష్ప్రభావాలు తక్కువ, ప్రయోజనం ఎక్కువ ఉన్న రోగులకే వైద్యులు కీమోను ఎంచుకుంటున్నారు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • శరీరం చెప్తున్నది వినాలి: తొలి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. మహిళల నెలసరి రక్తస్రావంలో అసహజ మార్పులు కనిపించినా, ఎవరికైనా వారాల తరబడి వీడని దగ్గు వేధిస్తున్నా వైద్యులను కలవడానికి అలసత్వం ప్రదర్శించకూడదు

  • కుటుంబ చరిత్ర కీలకం: దగ్గరి రక్త సంబంఽధీకుల్లో క్యాన్సర్లు ఉంటే ముందే అప్రమత్తం కావాలి. స్ర్కీనింగ్‌ పరీక్షలు ముందుగానే మొదలుపెట్టుకోవాలి

  • దురలవాట్లకు దూరం: ధూమపానం, మద్యపానం, అసాంఘిక ప్రవర్తనలకు దూరంగా ఉండాలి

  • కొవ్వు పదార్థాలు: వీటిని వీలైనంత పరిమితంగా తీసుకోవాలి. పీచును పెంచుకోవాలి. ఇందుకోసం తాజా కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి

  • పరీక్షలు: క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి

  • టీకాలు: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్లకు అందుబాటులో ఉన్న టీకాలు తీసుకోవాలి

11-Navya.jpg

చికిత్సలో అద్భుత పురోగతి

40, 50 ఏళ్ల కిత్రం క్యాన్సర్‌ పట్ల కలిగి ఉన్న దృక్పథానికీ నేటి దృక్పథానికీ ఏమాత్రం పొంతన లేదు. ఒకప్పుడు క్యాన్సర్‌ నిర్థారణ అవగానే, సర్జరీ, కీమో, రేడియేషన్‌ చికిత్సలతో వ్యాధిని నయం చేయడం మీదే దృష్టి కేంద్రీకరించాం. కానీ ఒక కణంలోని డిఎన్‌ఎకు మల్టిప్లై అవమనే ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న అప్పట్లో ఎవర్లోనూ తలెత్తలేదు. కానీ ఆ ఆదేశం డిఎన్‌ఎ చుట్టూరా ఉన్న పరిధీయ ప్రాంతం నుంచే వస్తోందని ఆ తర్వాత తెలుసుకోగలిగాం! అలాగే ఆ ఆదేశాల్లో క్యాన్సర్‌ను వేర్వేరు అవయవాలకు వ్యాపించమనేవీ ఉంటున్నాయని తెలుసుకోగలిగాం! కాబట్టి ఆ ఆదేశాలకు అడ్డుకట్ట వేయగలిగితే క్యాన్సర్‌ వృద్ధిని అరికట్టవచ్చనే ఉద్దేశంతో టార్గెటెడ్‌ థెరపీని కనిపెట్టాం! అయితే దాంతో పరిమిత ఆదేశాలను మాత్రమే అడ్డుకోగలిగాం. బదులుగా బహుళ ఆదేశాలను అడ్డుకోగలిగే చికిత్సా విధానాన్ని కనిపెట్టే క్రమంలో ఇమ్యునో థెరపీని ఆవిష్కరించుకున్నాం. ఈ చికిత్స... కీమో, రేడియేషన్‌ చికిత్సల్లాంటిది కాదు. ఈ చికిత్స క్యాన్సర్‌ పెరుగుదలను నియంత్రిస్తుంది. మిగతా చికిత్సల మాదిరిగా ఇతర ఆరోగ్యకరమైన కణాల్లో టాక్సిసిటీని పెంచదు.


ప్రతి క్యాన్సర్‌ నయం చేయదగినదే! అయితే తొలి దశలోనే వ్యాధిని గుర్తించాలి. తొలి దశలో కీమోథెరపీ, రేడియేషన్‌, ఖర్చు.. అన్నీ తక్కువే! మూడు, నాల్గవ దశ క్యాన్సర్లను కూడా రెండు నుంచి మూడు చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు. పదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్‌ చికిత్స ఫలితం ఎంతో మెరుగుపడింది.

ఈ సంతులనం కీలకం

శరీరంలో క్యాన్సర్‌ను ఉత్పత్తి చేసే, క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే రెండు రకాల జన్యువులుంటాయి. ఈ రెండు జన్యువుల మధ్య సంతులనాన్ని కొనసాగించినంత కాలం క్యాన్సర్‌ దరి చేరదు. దురలవాట్లతో ఈ సంతులనం దెబ్బతిని, క్యాన్సర్‌ సోకుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 03:42 AM