Share News

పైత్యాన్ని హరించే వెలగపండు!

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:13 AM

కొద్దిగా పసుపు కలిసిన తెలుపు రంగులో ప్రకాశవంతంగా కనిపించే గుండ్రని కాయ వెలగ. ఇది అడవిలో పెరిగే మొక్క. చుట్టూ దట్టంగా కమ్ముకున్న ముదురు ఆకుపచ్చ రంగు ఆకుల మధ్య...

పైత్యాన్ని హరించే వెలగపండు!

భోజనకుతూహలం

కొద్దిగా పసుపు కలిసిన తెలుపు రంగులో ప్రకాశవంతంగా కనిపించే గుండ్రని కాయ వెలగ. ఇది అడవిలో పెరిగే మొక్క. చుట్టూ దట్టంగా కమ్ముకున్న ముదురు ఆకుపచ్చ రంగు ఆకుల మధ్య వెలగ పండు వెలుగులు చిమ్ముతూ కనిపిస్తుంది కాబట్టి- వెలగ సార్థక నామధేయి. తొలి ఏకాదశికి ఒకసారి, వినాయకచవితికి ఒకసారి వెలగపళ్లు పంటకొస్తాయి. కాయ పెరిగి పక్వానికి రావటానికి చాలా కాలం పడ్తుంది. కోసిన తరువాత కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ పండు కోతులకు చాలా ఇష్టమైనది కాబట్టి- దీనికి ‘కపిత్థ’ అనే పేరు కూడా ఉంది. దీని చుట్టూ ఆవరించి ఉండే కఠినమైన చెక్క కారణంగానే దీనిని ఇంగ్లీషులో ఉడ్‌ యాపిల్‌ అని పిలుస్తారు. అంత కఠినమైన చెక్క రక్షణకవచంగా ఉన్నా లోపల గుజ్జుని ఫంగస్‌ నల్లగా ఆవహించగలదు. కరి అంటే నలుపు అనే అర్థంలో ‘కరిమింగిన వెలగపండు’ అనే పదబంధానికి నల్లఫంగస్‌ పట్టిందని భావం. ఏనుగు వెలగపండుని నమలకుండా మింగినా లోపలి సారాన్ని జీర్ణం చేసుకోగలదనే అర్థం ఇంకొకటి. ఇక ఈ పండుకు ఉన్న ఔషధగుణాలను మన పూర్వీకులు ఎప్పుడో గమనించారు. అవేమిటో చూద్దాం..

  • వెలగ పండు పైత్యాన్ని హరిస్తుంది. వాతాన్ని అదుపు చేస్తుంది.

  • నోటి పూత నుంచి పేగు పూత వరకు అల్సర్లను తగ్గించే గుణం దీనికి ఉంది. అమీబియాసిస్‌ వ్యాధి ఉన్న వారు వెలగపండు పెరుగుపచ్చడి తింటే మంచి ఫలితాలు లభిస్తాయి.

  • పచ్చి వెలగకాయ గుజ్జు తింటే కంఠస్వరాన్ని హీనపరుస్తుంది. ఇది బాగా పుల్లగా ఉంటుంది. వేడి చేస్తుంది పైత్యాన్ని కలిగిస్తుంది. వాతం చేస్తుంది. అందుకని బాగా పండిన వెలగే ఆరోగ్యదాయకం.

  • వెలగ పండు గుజ్జును మిక్సిలో వేసి జ్యూస్‌గా చేసి నీళ్లలోను.. మజ్జిగలోను కలిపి తాగితే దప్పిక తీరుతుంది.

  • గుండె కండరాలు దృఢపడటానికి వెలగపండు గుజ్జు ఉపకరిస్తుంది. ఇది రక్తప్రసారాన్ని పెంచుతుంది.

  • వెలగ పండు గుజ్జు ఉబ్బసానికి మంచి మందు. ఈ గుజ్జును తేనెతో కలిపి తింటే మంచి ఫలితాలు లభిస్తాయి.

  • పేవులలో ఉండే సూక్ష్మక్రిములను సంహరించే శక్తి వెలగపండుకు ఉంది.

గంగరాజు అరుణాదేవి

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:13 AM