Share News

అడవి మామిడి... ఓ అపురూప వృక్షం

ABN , Publish Date - May 23 , 2026 | 06:05 AM

కొండమామిడి లేదా అడవి మామిడికాయల్ని ‘ఆమ్రాతకం’ అనీ, ‘కోశామ్రం’ అనీ పిలుస్తారు. కొండ అంటే హిమాలయాలనే! ఈ మామిడికాయల్ని హిమాలయన్‌ మామిడి అని కూడా పిలుస్తారు...

అడవి మామిడి... ఓ అపురూప వృక్షం

భోజన కుతూహలం

ఆమ్రాతకం కషాయామామ్లమం బృహత్కంఠకర్షణమ్‌

పక్వం తు మధురామ్లాఢ్యం స్నిగ్ధం కించిత్కఫాపహమ్‌!

కొండమామిడి లేదా అడవి మామిడికాయల్ని ‘ఆమ్రాతకం’ అనీ, ‘కోశామ్రం’ అనీ పిలుస్తారు. కొండ అంటే హిమాలయాలనే! ఈ మామిడికాయల్ని హిమాలయన్‌ మామిడి అని కూడా పిలుస్తారు. మనవైపు పండే మామిడిని వృక్ష శాస్త్రపరంగా ‘మాంగోఫెరా ఇండికా’ అని, హిమాలయాల మామిడిని ‘మాంగోఫెరా సిల్వాటికా’ అని అంటారు. ఈ కాయ చివర కొసదేలి ఉంటుంది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున ఉండే చల్లని ప్రాంతాల్లోనే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. దక్షిణ మధ్య, తూర్పు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా అసోం, బంగ్లాదేశ్‌, నేపాల్‌, కంబోడియా, మయన్మార్‌, నికోబార్‌ అండమాన్‌ దీవుల్లో వీటి వ్యాప్తి ఎక్కువ.

మన మామిడిలాగానే జూన్‌, జూలై నెలల్లో ఈ కాయలు చేతికొస్తాయి. పర్యావరణ నిపుణులు... అంతరించిపోతున్న వృక్షజాతుల్లో ఈ అడవి మామిడిని కూడా చేర్చారు.

దొరికితే పక్వానికి వచ్చిన వాటిని వదలకండి. పలకబారి కండపట్టిన కొండ మామిడి ఊరగాయ పచ్చళ్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు. పచ్చివి, లేతగా ఉన్న పిందెలు వగరు, చేదు, పులుపు కలిగి గొంతు నుస పెడతాయి. పలకబారిన కాయలు బాగా వేడి చేస్తాయి. కానీ, చర్మవ్యాధులున్నవారికి మేలు చేస్తాయి. పండినవి రుచిగా ఉంటాయి. కఫాన్ని కొద్దిగా తగ్గిస్తాయని ‘భోజన కుతూహలం’ గ్రంథంలో పేర్కొన్నారు.

మనం చెత్తబుట్టలో పడేసే మామిడి టెంకె లోపల జీడికి ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్‌ ఉంది. జీడిలోంచి కొవ్వు పదార్థాలను వేరు చేస్తున్నారు. మన వైపు పండే మామిడి టెంకెలోని జీడికన్నా ఈ అడవి మామిడి జీడిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇటీవల వెలువడిన ఒక పరిశోధనలో చాక్లెట్‌ తయారీకి ఉపయోగించే కోకో బట్టర్‌తో సమానమైన కొవ్వు పదార్థం ఈ అడవి మామిడి జీడి నుంఛి లభిస్తుందని, ఉత్పాదకత రీత్యా చూసినప్పుడు కోకో మొక్కల గింజల నుండి తీసే కొవ్వు కన్నా ఇది చాలా చవకగా లభిస్తుందనేది ఈ పరిశోధన సారాంశం. బంగ్లాదేశ్‌ భూటాన్‌లాంటి దేశాల్లో అడవి మామిడి ఎక్కువగా పండుతుంది.

గంగరాజు అరుణాదేవి

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2026 | 06:05 AM