Share News

హింసారాగంలో పసి మనసు

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:05 AM

హరియాణాలోని పంచకులలో ఎనిమిదేళ్ల బాలుడు.. కిండర్‌గార్టెన్‌ చదువుతున్న ఆరేళ్ల బాలికపై విచక్షణ రహితంగా జరిపిన దాడి దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇలాంటి దారుణాలు ఒక్కోచోట ఒక్కో రూపంలో...

హింసారాగంలో పసి మనసు

పేరెంటింగ్‌

హరియాణాలోని పంచకులలో ఎనిమిదేళ్ల బాలుడు.. కిండర్‌గార్టెన్‌ చదువుతున్న ఆరేళ్ల బాలికపై విచక్షణ రహితంగా జరిపిన దాడి దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇలాంటి దారుణాలు ఒక్కోచోట ఒక్కో రూపంలో పునరావృతమవుతుండటం పసిప్రాయపు ప్రవర్తనా శైలిపై గుబులు రేపుతోంది. ఎదుటివారి వేదనను స్పృశించలేని మొరటుదనం.. చిన్నపాటి వివాదాలకే హింసను ఆయుధంగా మలచుకుంటున్న పసిమనసుల ధోరణి నేడు సమాజం ముందు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ అసాధారణ హింసా ప్రవృత్తికి మూలాలేమిటి? చిన్నారుల ఆలోచనా విధానంలో ఈ చీకటి కోణాలు ఎందుకు ఆవహిస్తున్నాయి? అసలు లోపం ఎక్కడుందనేదానిపై లోతైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

పిల్లల్లో దాడులకు పాల్పడే స్వభావం పెరుగుతోంది. ఎదుటి వారి బాధను అర్థం చేసుకునే సున్నితత్వం లోపిస్తోంది. ఈ ధోరణికి, కుటుంబ వాతావరణం, డిజిటల్‌ మీడియా, పరిసరాల ప్రభావాలు కారణం కావచ్చు.

కుటుంబ వాతావరణం

కుటుంబమే పిల్లల తొలి పాఠశాల, తల్లితండ్రులే తొలి గురువులు. ఇంట్లో తరచూ గొడవలు, అవమానాలు, భౌతిక దాడులను చూస్తూ పెరిగే పిల్లల్లో హింస ధోరణి అలవడుతుంది. ప్రతి సమస్యనూ బల ప్రయోగంతో పరిష్కరించుకోవచ్చనే ఆలోచన బలపడుతుంది. ప్రేమాప్యాయతలు, భద్రత దొరకని పిల్లలు అభద్రతకూ, అసంతృప్తికీ లోనవుతారు. కాబట్టి తల్లితండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ, వాళ్లతో సంభాషిస్తూ, వాళ్ల మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

డిజిటల్‌ మీడియా ప్రభావం

స్మార్ట్‌ ఫోన్లు, వీడియో గేమ్స్‌, సామాజిక మాధ్యమాలు నేటి పిల్లల జీవితాల్లో విడదీయలేని భాగాలైపోయాయి. హింసను వినోదంగా చూపించే దృశ్యాలు, ఆన్‌లైన్‌ వేధింపులు, ప్రమాదకరమైన సవాళ్లు పిల్లల ప్రవర్తన మీద ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. అయితే వీటితో పిల్లలు గడిపే సమయానికంటే ఎక్కువగా, వాటిని పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారనే అంశం మీద దృష్టి పెట్టాలి. పిల్లలకు డిజిటల్‌ స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు బాఽధ్యతాయుత వినియోగం విలువను తెలియచెప్పాలి.


భావోద్వేగ నియంత్రణ

భావోద్వేగాలు సహజసిద్ధ మానవ స్వభావాలు. అయితే వీటిని నియంత్రించుకుని, సందర్భానుసారంగా వ్యక్తపరిచే తీరు మీదే విచక్షణ ఆధారపడి ఉంటుంది. ఆవేశాన్ని నియంత్రించుకోవడం, పరిణామాలను అంచనా వేయడం మొదలైన సామర్థ్యాలు కౌమార దశలోనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ వయసులో పెద్దల మార్గదర్శకత్వం అవసరమవుతుంది.

స్నేహితుల ప్రభావం

కౌమారదశలో స్నేహితుల మెప్పు కోసం పాకులాడే తపనలో భాగంగా వాళ్లు చేసే తప్పులను ప్రోత్సహించే నైజం అలవడుతుంది. వాళ్లలో ఒకరు కావాలనే కోరికతో, స్నేహితులకు దూరమైపోతామనే భయంతో వాళ్ల తప్పుల్లో పాలుపంచుకోవడం మొదలుపెడతారు. ఇలాంటి స్వభావాన్ని కనిపెట్టిన వెంటనే... తప్పు చేయడం ధైర్యం అనిపించుకోదనీ, తప్పును ఎదిరించడమే అసలైన ధైర్యమనీ పిల్లలకు నేర్పించాలి.

పోటీతత్వం, చదువు ఒత్తిడి

మార్కులు వ్యక్తి విలువకు ప్రమాణాలు కావు. అలాగే వైఫల్యం కూడా జీవితానికి ముగింపు కాదు. అది మరో ప్రయత్నానికి ఆరంభం మాత్రమే! అనే విషయాన్ని పిల్లలకు తెలియపరచాలి. పోటీ తత్వం కలిగి ఉండడం మంచి స్వభావమే అయినప్పటికీ, ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండడం అవసరమని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు, పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం, తక్కువ మార్కులొస్తే అవమానించడం సరి కాదు. వైఫల్యాన్ని అంగీకరించే మానసిక పరిణతి పిల్లలకు చిన్న వయసులోనే అలవడేలా కృషి చేయాలి.


సానుభూతి ముఖ్యం

ఎదుటి వారి దృష్టి నుంచి ఆలోచించే స్వభావాన్ని పిల్లలకు చిన్న వయసు నుంచే అలవాటు చేయాలి. ఎదుటి వారి స్థానంలో మనల్ని మనం ఊహించుకుని, వారి బాధను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పిల్లల్లో పెంచాలి. బాల్యం నుంచే ఇతరులను గౌరవించడం, ఆపన్నులకు సహాయపడడం, జీవహింసకు దూరంగా ఉండడం లాంటివి నేర్పించాలి.

మానసిక సమస్యలు

పిల్లల దూకుడు ప్రవర్తనకు మానసిక సమస్యలు కూడా కారణం కావచ్చు. దుందుడుకు స్వభావం, జంతువులతో క్రూరంగా ప్రవర్తించడం, వస్తువులను ధ్వంసం చేయడం, వేధించడం లాంటి లక్షణాలు పిల్లల్లో కనిపించినప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి. కౌన్సెలింగ్‌, కుటుంబ సహకారంతో పిల్లలను సరైన మార్గంలోకి మళ్లించుకోవాలి.

సన్మార్గంలో నడిపించి...

పిల్లలను సన్మార్గంలో నడిపించడంలో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కీలక భూమిక పోషిస్తారు. తల్లితండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి.ఉపాధ్యాయులు పిల్లల మానసిక వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి తల్లితండ్రులూ కోరుకుంటారు. అయితే వాళ్లు మంచి

వ్యక్తులుగా ఎదుగుతున్నారా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎంపథీ కనబరచడం, కోపాన్ని నియంత్రించుకోవడం, ఓటమిని అంగీకరించడం నేర్పించాలి. పిల్లలు జీవితంలో విజయం సాధించగలిగితే సరిపోదు. బాధ్యతాయుతమైన, మానవత్వంతో కూడిన మంచి వ్యక్తులుగా ఎదగడం కూడా అవసరమే! అందుకోసం తల్లితండ్రులందరూ కృషి చేయవలసిన అవసరం ఉంది.

డాక్టర్‌ ఆలూరి విజయలక్షి

గైనకాలజిస్ట్‌

శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌

హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 02:05 AM