చదునైన పొట్ట అవసరమా?
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:59 AM
మహిళలూ... ఎంత వ్యాయామం చేసినా, ఎంత డైట్ చేసినా పొట్ట చదునుగా మారడం లేదని ఆందోళన పడుతున్నారా? నిజానికి మన శరీర నిర్మాణం అందుకు తగ్గట్టే...
లైఫ్
మహిళలూ... ఎంత వ్యాయామం చేసినా, ఎంత డైట్ చేసినా పొట్ట చదునుగా మారడం లేదని ఆందోళన పడుతున్నారా? నిజానికి మన శరీర నిర్మాణం అందుకు తగ్గట్టే నిర్మితమైంది. కాబట్టి పొత్తికడుపు దగ్గర చిన్నపాటి ఉబ్బెత్తు అత్యంత సహజం. ఇది అనారోగ్యం, అందవికారం కానే కాదని వైద్యనిపుణులు కూడా భరోసా కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
మహిళల శరీరాలు పరిపూర్ణమైన చదునైన పొట్టకు తగ్గట్టుగా రూపొందలేదు. గర్భాశయం, పేగులు, కటి ఎముకలు ఇవన్నీ ఒకచోట ఇమిడిపోయే ప్రదేశం కాబట్టి పొత్తికడుపు దగ్గర సహజసిద్ధంగానే స్వల్ప వంపు ఏర్పడుతుంది. అయినప్పటికీ దశాబ్దాలుగా చదునైన పొట్ట అందానికి నిర్వచనంగా ప్రశంసలను అందుకుంటూ ఉండడంతో, మహిళలు దాన్నొక వ్యసనంగా మలుచుకున్నారు. ఫ్యాషన్ పరిశ్రమ మొదలు, సౌందర్య పరిశ్రమ వరకూ పొత్తికడుపు కొవ్వు కరిగించడాన్నే లక్ష్యంగా మార్చుకున్నాయి. చదునైన పొత్తికడుపును కలిగి ఉండడం ఎంతటి వ్యసనంగా మారిందంటే, అక్కడ ఏమాత్రం కొవ్వు పేరుకోకుండా చూసుకోవడం, ఉన్న కొవ్వును కరిగించుకోవడం కోసం ఎంతటి ప్రయత్నాలకైనా పూనుకునేంతగా మహిళలు ఒత్తిడికి లోనవుతున్నారు.
కొద్దిపాటి వంపు సహజమే!
అంతర్గత అవయవాలకు తోడు, మహిళల అస్థిపంజర నిర్మాణం కూడా పొత్తికడుపు వంపుకు దోహదపడుతుంది. కటి ప్రదేశం, పక్కటెముకలు, కనెక్టివ్ కణజాలాలు పొత్తికడుపు రూపాన్ని నిర్థారిస్తాయి. చదునైన పొట్టను సాధించాలనుకునే మహిళలు ఈ ముఖ్యమైన అంశాన్ని విస్మరిస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, తక్కువ శరీర కొవ్వును నిర్వహించే మహిళల్లో కూడా పొత్తికడుపు దగ్గర స్వల్ప కొవ్వు ఉంటూనే ఉంటుంది. మహిళల శరీర నిర్మాణం చదునైన పొట్ట సాధ్యం కాదని చెప్తున్నప్పటికీ, అది సాధ్యమేనని సామాజిక ఒత్తిడిలు వాదిస్తున్నాయి. కాలక్రమేణా ఫిట్‌నెస్, ఫ్యాషన్ సంస్కృతులు మరీ ముఖ్యంగా నడుము చుట్టుకొలతను, పలుచని పొత్తికడుపును... క్రమశిక్షణకూ, విజయానికీ, ఆకర్షణకూ సంకేతాలుగా మార్చేశాయి. అంతిమంగా అందమైన శరీరాకృతి స్వీయ క్రమశిక్షణకూ, సామాజిక హోదాకూ చిహ్నాలుగా మారి, సహజసిద్ధ శరీర నిర్మాణాన్ని శారీరక లోపంగా మలిచేశాయి. ఈ ధోరణి అంతిమంగా మహిళలు వారి శరీర నిర్మాణాన్ని మార్చుకునే సంక్లిష్టమైన, కష్టతరమైన ప్రయత్నాలకు పూనుకునేలా పురిగొల్పుతోంది. సౌందర్య, ఫిట్‌నెస్ పరిశ్రమలు మహిళల్లో ఈ ఒత్తిడులకు మరింత ఊతమిస్తున్నాయి. మార్పు చేసిన అందమైన మహిళల చిత్రాలతో, క్రమం తప్పిన వ్యాయామాలతో ఆకర్షణీయమైన రూపాన్ని పొందేలా మహిళలను ఒత్తిడికి గురి చేస్తూ, ఎత్తైన పొత్తికడుపు అవలక్షణమనే భావనకు లోను చేస్తున్నాయి. ఫలితంగా కొందరు మహిళలు విపరీతమైన డైటింగ్, వ్యాయామాలను ఆశ్రయిస్తున్నారు.
పరిపూర్ణమైన ప్రమాణాలు ఏవి?
అవాస్తవికమైన సౌందర్య అంచనాలను సవాలు చేయడానికి శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం అవసరమని నిపుణులు వాదిస్తున్నారు. అంతర్గత అవయవాలు, ఎముకల నిర్మాణం, రక్షణ కల్పించే కొవ్వుతో సహా మహిళల సహజసిద్ధ శరీర నిర్మాణంలో చదునైన పొట్ట ఒక భాగం అన్నది సార్వత్రికం, సాధారణం కాదు. శరీర వైవిద్యం, వాస్తవిక ఆరోగ్య ప్రమాణాలపై చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో సౌందర్య దృష్టితో కాకుండా, శరీర నిర్మాణం దృష్టితో అందాన్ని పునర్నిర్వచించగలిగితే, చదునైన పొత్తికడుపు పట్ల మహిళలకున్న వ్యామోహాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
భౌతిక వాస్తవం ఇదే!
మహిళల పొత్తికడుపు పలు అంతర్గత నిర్మాణాల మూలంగా రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి డైట్, వ్యాయామాలతో ఆ ప్రదేశం చదునుగా మారడం సాధ్యపడదు. సాధ్యపడినా, అది తాత్కాలికమే! మూత్రాశయం, గర్భాశయం, జీర్ణ వ్యవస్థ.. ఈ అవయవాలన్నీ పొత్తికడుపులోని కొద్దిపాటి జాగాలో ఇమిడిపోయి ఉంటాయి. అలాగే ఈ అవయవాలకు రక్షణగా, కుషన్‌లా పని చేయడం కోసం ఆ ప్రదేశంలో కొద్దిపాటి కొవ్వు కూడా పేరుకుంటుంది. ఈ కొవ్వు హార్మోన్ల ఆరోగ్యానికి కూడా తోడ్పాటును అందిస్తుంది. మరీ ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లాంటి కీలకమైన హార్మోన్ల ఉత్పత్తిలో పొత్తికడుపు కొవ్వు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కొవ్వును అవసరానికి మించి వదిలించుకునే ప్రయత్నాలు చేయడం అనారోగ్యకరం.
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News