వెండితెర రూపసి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:41 AM
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందాతో ముంబై విమానాశ్రయంలో కనిపించి.. ఆయన భార్య సునీతా అహూజా వ్యాఖ్యలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన నటి కోమల్ రాణి స్వర్ణకార్...
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందాతో ముంబై విమానాశ్రయంలో కనిపించి.. ఆయన భార్య సునీతా అహూజా వ్యాఖ్యలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన నటి కోమల్ రాణి స్వర్ణకార్. రూమర్లు, వివాదాలు పక్కనపెడితే.. అసలు ఎవరీ కొత్త భామ? ఆమె నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాలీవుడ్ అరంగేట్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ నూతన తార వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు ఇవి..
సినీ పరిశ్రమలో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ లేదా విస్తృతమైన గుర్తింపు రావడం అనేది చాలా అరుదు. కోమల్ రాణి స్వర్ణకార్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాతో కలిసి ముంబై విమానాశ్రయంలో బహిరంగంగా కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై గోవిందా పునరాగమనం చేస్తున్న సమయంలో.. ఆయన సరసన కొత్త నటి కనిపించడంతో రకరకాల ఊహాగానాలు, రూమర్లు షికారు చేయడం ప్రారంభించాయి. గోవిందా వ్యక్తిగత జీవితం గురించి ఆయన భార్య సునీతా అహుజా చేసిన ఘాటు కామెంట్లపై బాలీవుడ్‌లో ఎంతటి రచ్చ నడుస్తున్నప్పటికీ మీడియా, సినీ అభిమానుల దృష్టి మాత్రం ‘ఎవరీ కోమల్ రాణి స్వర్ణకార్?’ అనే ప్రశ్న వైపే వెళ్లింది. ఈ ఒక్క ఘటనతో ఆమె పేరు గూగుల్ ట్రెండ్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పతాక శీర్షికలకు ఎక్కింది.
కోమల్ నేపథ్యం
బాలీవుడ్‌కు పరిచయం కాకముందు కోమల్ రాణి స్వర్ణకార్ (రాణి స్వర్ణకార్ అని కూడా పిలుస్తుంటారు) ఓ సాధారణ మోడల్. నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ఆమెది ఉత్తరప్రదేశ్. చిన్నతనం నుంచే కళారంగం, మోడలింగ్, నటనా రంగాలపై మక్కువ పెంచుకున్న కోమల్ తన కలలను సాకారం చేసుకునేందుకు ముంబై చేరుకుంది. ఉత్తరప్రదేశ్ నేపథ్యం ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత వివరాలు, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి స్పష్టమైన సమాచారం బయటి ప్రపంచానికి అతి కొద్దిగా మాత్రమే తెలుసు. ఆమె వయసు గురించి కూడా పక్కా సమాచారం లేదు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదాయ చీరకట్టు నుంచి వెస్ట్రన్ దుస్తుల వరకు విభిన్నమైన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. తన ప్రొఫైల్‌లో శ్రీరాముడి భక్తురాలినని పేర్కొనడం ద్వారా తన ఆధ్యాత్మిక భావాలను పంచుకుంది. గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన కొత్తలోనే తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోడానికి ప్రాధాన్యం ఇస్తోంది. మీడియాలో వచ్చే రకరకాల ప్రచారాలకు దూరంగా ఉంటూ తన దృష్టినంతా సినీ కెరీర్ పైనే నిలపడానికి ప్రయత్నిస్తోంది.
‘రూపా’తో గ్రాండ్ ఎంట్రీ
బాలీవుడ్ నటుడు గోవిందా అంటే ఒకప్పుడు కామెడీ, డ్యాన్స్, వినోదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన నటుడు. ఆయన సరసన కథానాయికగా అవకాశం రావడం ఏ నూతన నటికైనా ఎంతో అరుదైన అవకాశం. కోమల్ రాణి ఈ అవకాశాన్ని దక్కించుకుంది. గోవిందా పునరాగమనం చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రూపా’లో కోమల్ కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఈ ఒక్క చిత్రానికే పరిమితం కాకుండా గోవిందా తదుపరి చిత్ర ‘దునియాదారీ’లోనూ కోమలే కథానాయిక అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ నటుడితో ఒకటి తర్వాత ఒకటిగా రెండు సినిమాల్లో వరుసా నటించే అరుదైన మైలేజ్ ఈ కొత్త భామకు దక్కుతోంది. ఇది ఆమె సినీ ప్రయాణానికి పునాదిగా మారనుంది.
రూమర్ల వెనుక నిజమెంత?
గోవిందా, కోమల్ మధ్య ప్రేమాయణం లేదా రొమాంటిక్ రిలేషన్‌షి్‌ప ఉందంటూ బాలీవుడ్ గాసిప్ వర్గాల్లో అనేక ప్రచారాలు జోరందుకున్నాయి. అయితే, ఈ డేటింగ్ కథనాలపై గోవిందా కానీ, కోమల్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 1987లో సునీతా అహుజాను పెళ్లాడిన గోవిందాకు టీనా, యశ్‌వర్ధన్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
భవిష్యత్తు ఆశయాలు
బాలీవుడ్‌లో ఒక కథానాయికగా సుదీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే కేవలం గ్లామర్ లేదా వివాదాలు మాత్రమే సరిపోవు. నటనలో ప్రతిభ, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే సమర్థత ఎంతో అవసరం. ఈ విషయాన్ని బాగా గుర్తించిన కోమల్.. తన రాబోయే చిత్రాలు ‘రూపా’, ‘దునియాదారీ’లతో ప్రేక్షకులను మెప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. గోవిందా లాంటి అగ్రనటుడితో తెరను పంచుకోవడం వల్ల లభించే అనుభవం, పాఠాలు ఆమె భవిష్యత్తు కెరీర్‌కు ఎంతో దోహదపడతాయి. వివాదాలను పక్కనపెట్టి తన నటనతో, ప్రతిభతో హిందీ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలనేది కోమల్ రాణి స్వర్ణకార్ లక్ష్యంగా కనిపిస్తోంది. చిన్న పట్టణం నుంచి వచ్చి బాలీవుడ్ గడపతొక్కిన ఈ నూతన రూపసి భవిష్యత్తులో వెండితెరపై ఎలాంటి సంచనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.
మోడలింగ్ నుంచి బాలీవుడ్ వైపు
గ్లామర్ ప్రపంచంలో స్థానం సంపాదించుకోవడానికి కోమల్ ఎంచుకున్న మార్గం శ్రమ, పట్టుదల. ముంబైలాంటి మహానగరంలో నటన, మోడలింగ్ రంగాల్లో నిలదొక్కుకోవడం ఏ నూతన నటికైనా అంత సులభం కాదు. మోడలింగ్ రంగంలో పలు ఆడిషన్లు ఇచ్చి, కెమెరా ముందు తన ప్రతిభను రుజువు చేసుకున్న తర్వాతనే ఆమె ఈ సినిమాలో అవకాశం దక్కింది. మోడలింగ్ అనుభవం ఆమెకు కెమెరా ముందు భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో నటించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. సంప్రదాయ, ఆధునిక శైలి రెండింటినీ ప్రతిబింబించగల సామర్థ్యం కోమల్‌కు ఉంది. ఈ ఆకర్షణీయమైన రూపం, నటనలోని సహజత్వమే ఆమెను దర్శకుల దృష్టిలో పడేలా చేశాయి.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News