ఆక్రోటు... మెదడుకు మేత
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:58 AM
‘జుగ్లాన్స్ రెజియా’ అనే లాటిన్ పేరున్న ఆక్రోటు చెట్టు కాయ లోపలి గింజనే ప్రపంచ వ్యాప్తంగా వాల్‌నట్ అని పిలుస్తారు. దీన్ని ‘ఆక్షోటకం’ అని ఆయుర్వేదం పిలిచింది. మెదడు ఆకారంలో...
భోజనకుతూహలం
ఆక్షోటకం సరం స్నిగ్ధో మధురం రసపాకయోః
గురూష్ణం బృంహణం వృష్యో బల్యో విష్టంభి రోచనమ్
హృద్యం క్షయాస్రపవనదాహాఘ్నం కఫపిత్తలమ్!
‘జుగ్లాన్స్ రెజియా’ అనే లాటిన్ పేరున్న ఆక్రోటు చెట్టు కాయ లోపలి గింజనే ప్రపంచ వ్యాప్తంగా వాల్‌నట్ అని పిలుస్తారు. దీన్ని ‘ఆక్షోటకం’ అని ఆయుర్వేదం పిలిచింది. మెదడు ఆకారంలో కనిపించే ఈ గింజ, నిజంగానే మెదడుకు మేలు చేయడం ప్రకృతి ఇచ్చిన అద్భుత సంకేతం. ‘సమాన గుణ ధర్మాలున్నవి సమాన గుణాలను పెంపొందిస్తాయిు’ అనేది ఆయుర్వేద సిద్ధాంతం. డాక్ట్రయిన్ ఆఫ్ సిగ్నేచర్ అనే భావనకు వాల్‌నట్ ఒక చక్కని ఉదాహరణ.
మెదడు ఎదుగుదలకు వాల్‌నట్ మేటి ఆహారం. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యల్లో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలను రక్షించేందుకు తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి, విద్యార్థుల ఏకాగ్రతకు, వృద్ధుల జ్ఞాపకశక్తి పరిరక్షణకు ఇది విలువైన పోషకాహారం.
మంచుకొండలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో వంద అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ వృక్షం, ప్రపంచం గుర్తించిన సూపర్ ఫుడ్. దీని గింజల్లో సుమారు 15 శాతం ప్రొటీన్లు, 11 శాతం పిండిపదార్థాలు, శరీరానికి మేలు చేసే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, ఎ, బి, సి, ఇ విటమిన్లు అలాగే మెగ్నీషియం, రాగి, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి.
జీవ కణాల పెరుగుదలకు...
‘భోజన కుతూహలం’ గ్రంథం ఆక్షోటకాన్ని బృంహణం, బల్యం, వృష్యం, హృద్యం అని అభివర్ణించింది. అంటే ఇది శరీర ధాతువుల్ని పెంపొందిస్తుంది. బలాన్ని, పుష్టిని, శక్తిని అందిస్తుంది. పురుషుల్లో జీవ కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. హృదయ రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తప్రసరణను మెరుగుపరచడంలోనూ,
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తుందని ఆధునిక పరిశోధనలు ధ్రువీకరిస్తున్నాయి. చర్మానికి మృదుత్వాన్ని, పోషణను అందించడమే కాకుండా, హెర్పిస్ వంటి కొన్ని వైరస్ సంబంధిత చర్మ వ్యాధుల్లోనూ ఉపయుక్తంగా పని చేస్తుంది. గడ్డలను కరిగిస్తుంది.
తక్షణ శక్తి...
తీపి రుచిగల ఈ గింజ స్నిగ్ధ గుణం కలిగి ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తూ, ఆలస్యంగా జీర్ణమవడం వల్ల గ్లూకోజు ఒక్కసారిగా రక్తంలోకి చేరకుండా నిరోధిస్తుంది. కొద్దిగా వేడి చేస్తుంది. అయినా, క్షీణించిన శరీరానికి పుష్టిని అందించి, చిక్కిపోతున్నవారిలో బరువు పెరగడానికి తోడ్పడుతుంది. గౌట్, కీళ్ల వాపులు, అరిచేతులు, అరికాళ్ల మంటలవంటి సమస్యల్లో కూడా ఉపశమనం కలిగిస్తుందని ‘భోజన కుతూహలం’ పేర్కొంది.
గంగరాజు అరుణాదేవి
రోజుకు ఒకటి...
పేగుల్లో నివసించే మేలు చేసే మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు వాల్‌నట్‌లోని పీచు పదార్థం దోహదపడుతుంది. శరీర కణాలను దెబ్బతీసే ఆక్సీకరణ ప్రభావాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే అవకాశంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. వయస్సు, శరీరతత్వాన్ని బట్టి రోజుకు ఒకటి లేదా రెండు ఆక్రోటు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం ఉత్తమం.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News