సంగీతం నేర్పి...
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:03 AM
బతుకుల్ని మార్చి గుజరాత్... రాజస్థాన్ సరిహద్దు... ఆరావళి పర్వత ప్రాంతం. అక్కడికి వెళితే... యాభై మంది గిరిజన బాలికల బ్యాగ్‌పైపర్స్ బ్యాండ్ స్వాగతం...
సంకల్పం
బతుకుల్ని మార్చి గుజరాత్... రాజస్థాన్ సరిహద్దు... ఆరావళి పర్వత ప్రాంతం. అక్కడికి వెళితే... యాభై మంది గిరిజన బాలికల బ్యాగ్‌పైపర్స్ బ్యాండ్ స్వాగతం పలుకుతుంది. అందులో ప్రత్యేకత ఏమిటంటే... వారంతా ఒకప్పుడు పొట్ట కూటి కోసం చేతులు చాచినవారు. దాతల కరుణ తమపై ప్రసరించాలని ఎదురుచూసినవారు. అలాంటివారికి సమాజంలో గౌరవాన్ని కల్పించి... తల రాతను మార్చే ప్రయత్నం చేస్తున్నారు విద్యావేత్త, సామాజిక కార్యకర్త... ఉషా అగర్వాల్.
‘‘ప్రభుత్వ ఉద్యోగం వదిలి సామాజిక సేవను ఎంచుకోవడమంటే సాధారణ విషయం కాదని చాలామంది అంటుంటారు. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా మాది. చదువు అయిపోగానే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఒక రోజు గుజరాత్- రాజస్థాన్ సమీపంలోని అంబాజీకి వెళ్లాను. 51 శక్తి పీఠాల్లో ఒకటైన మా అంబా కొలువైన ఆరావళి పర్వత శ్రేణుల్లోని ప్రాంతం అది. కానీ అప్పుడు అనుకోలేదు... నా జీవితం కొత్త మలుపు తీసుకొంటుందని. గుడికి వెళుతుంటే కొంతమంది గిరిజన బాలికలు సంప్రదాయ రావణహట్ట వాయిద్యం వాయిస్తూ బిచ్చమెత్తుకొంటున్నారు. దాదాపు పదకొండు వందల మెట్లు ఉంటాయి ఆలయానికి. ఆ మెట్లు ఎక్కి దిగుతూ చేయి చాస్తున్న ఆ బాలికలను చూసి నా మనసు చలించింది. అంతకుమించి... వారు లయబద్దంగా వాయిద్యాన్ని వాయిస్తున్న తీరు అబ్బురపరిచింది. ఆ చిన్నారుల సహజసిద్ధమైన నైపుణ్యానికి ఫిదా అయిపోయాను. వారి అభ్యున్నతికి బాటలు వేయాలని, తద్వారా వారి జీవన గతిని మార్చాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.
శ్రీ శక్తి సేవా కేంద్ర...
అంబాజీ నుంచి తిరిగి వచ్చాక గిరిజన బాలికల గురించే నా ఆలోచనంతా. ఏం చేస్తే బాగుంటుంది? ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాను. ముందుగా వారికి కావల్సింది కడుపు నిండా అన్నం. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడటానికి విద్య. ఆ తరువాత వారిలోని కళాకారులకు మెరుగులు అద్దడం. దీని కోసం 2011లో అంబాజీలోనే ‘శ్రీ శక్తి సేవా కేంద్ర’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. అంబాజీతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్లాను. ప్రధానంగా గుడి మెట్లపైన, రోడ్లపైన బిచ్చమెత్తుకొని బాలికలను గుర్తించాను. వారందరినీ ఒకచోట చేర్చాను. ఆకలి తీర్చి, వారిలోని కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో అడుగులు వేశాను.
అదే పెద్ద సవాలు...
అయితే నా ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు... చిన్నారుల తల్లిదండ్రులను ఒప్పించడం. ఎందుకంటే పిల్లల భిక్షాటన మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు కడుపు నింపుకొంటున్నాయి. పిల్లలను బడికి పంపిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందనే భయం. కానీ ఎలాగో అందరినీ ఒప్పించాను. తొలి దశలో మొత్తం 200 మంది చిన్నారులను గుర్తించి, వారికి వసతి కల్పించాను. విద్యా బుద్ధులు చెప్పేందుకు టీచర్లను నియమించాను. వీరిలో బాలికలే కాదు, బాలురు కూడా ఉన్నారు. వారందరికీ చదువుతో పాటు బ్యాగ్‌పైపర్స్ వాయిద్యం పరిచయం చేశాను. దాని కోసం ముంబయి నుంచి కళాకారులను రప్పించి శిక్షణ ఇప్పించాను.

మొట్టమొదటి బ్యాండ్...
రెండేళ్ల కఠోర శిక్షణ తరువాత విద్యార్థులు నైపుణ్యం సంపాదించారు. అందులో నుంచి యాభైమంది బాలికలతో బ్యాగ్‌పైపర్స్ బ్యాండ్ ఏర్పాటు చేశాను. విశేషం ఏంటంటే... గుజరాత్ రాష్ట్రంలో గిరిజన బాలికలతో ఏర్పాటైన మొట్టమొదటి బ్యాగ్‌పైపర్స్ బ్యాండ్ ఇది. కేవలం సంస్కృతిని ప్రతిబింబించే బ్యాండ్‌గా మాత్రమే కాకుండా ఒక బలమైన సామాజిక సందేశాన్ని కూడా ఇస్తుంది. దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది... భిక్షాటనతో మసకబారిపోతున్న బాల్యానికి భరోసా ఇచ్చి, వారిని విద్యావంతులు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ. ఏ ఒక్క వ్యక్తో, సంస్థనో పూనుకొంటే నెరవేరే లక్ష్యం కాదిది. ఆ దిశగా ప్రజల్లో కూడా ఈ బ్యాండ్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. తొలుత అంబాజీని బిచ్చగాళ్లు లేని పట్టణంగా మారుస్తున్నాం.
ఉషా మా...
ఇక్కడి ప్రజలు నన్ను ‘ఉషా మా’ అంటూ అప్యాయంగా పిలుస్తారు. ముఖ్యంగా అనాథ, గిరిజన పిల్లలు నాలో తల్లిని చూసుకొంటున్నారు. వారితో నాది భావోద్వేగ బంధం. మేం నెలకొల్పిన బాలికల బ్యాగ్‌పైపర్స్స్ బ్యాండ్ ఎన్నో విజయాలను అందుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తదితర అధికారిక ఉత్సవాల్లో ఈ బ్యాండ్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఎంతోమంది ప్రశంసలు, అభినందనలు అందుకొంది.
వీరి స్ఫూర్తితో ప్రస్తుతం మరో ఐదొందలమంది బాలబాలికలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంబాజీతో పాటు చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లోని 200 కుటుంబాలకు ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఇది మా సంస్థ సాధించిన మరో విజయం.’’
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News