Share News

యుద్ధ క్షేత్రంలో ప్రాణదాతలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:37 AM

యుద్ధం అంటే పోరాటం మాత్రమే కాదు.. చావును ఎదిరించి నిలిచే గుండె ధైర్యం కూడా. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురుస్తున్నా, తుపాకుల మోత వినిపిస్తున్నా...

యుద్ధ క్షేత్రంలో ప్రాణదాతలు

యుద్ధం అంటే పోరాటం మాత్రమే కాదు.. చావును ఎదిరించి నిలిచే గుండె ధైర్యం కూడా. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురుస్తున్నా, తుపాకుల మోత వినిపిస్తున్నా.. అంబులెన్స్‌ స్టీరింగ్‌ పట్టి మృత్యువు నోటి నుంచి ప్రాణాలను లాక్కువస్తున్నారు ముగ్గురు ధీర వనితలు.. ఇన్నా, అలీనా, నటాలియా. వీరు అంబులెన్స్‌ డ్రైవర్లు మాత్రమే కాదు.. యుద్ధభూమిలో ప్రాణం పోసే వైద్య నిపుణులు.

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌. ప్రస్తుతం ఈ ప్రాంతం ఒక గాయపడిన నగరం. ఇప్పుడు అక్కడి గాలిలో ఆక్సిజన్‌ కంటే గన్‌పౌడర్‌ వాసనే ఎక్కువగా ముక్కును తాకుతోంది. ఎటుచూసినా కూలిపోయిన భవనాలు, ధ్వంసమైన రోడ్లు. ఈ విలయం మధ్య ఒక అంబులెన్స్‌ సైరన్‌ వినిపిస్తే.. అది ఆశకు సంకేతం. ఆ అంబులెన్స్‌లను నడిపిస్తూ, వాటిలో వైద్యం అందిస్తూ మృత్యువును ఎదిరిస్తున్నారు ముగ్గురు మహిళలు. ‘మోయాస్‌’ అనే అంతర్జాతీయ సంస్థ తరపున వారు చేస్తున్న ఈ పని యుద్ధక్షేత్రంలో స్త్రీ శక్తికి నిలువుటద్దం.

కర్తవ్యమే దైవం

అనస్థీషియాలజిస్ట్‌, మెడికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇన్నాకు మాటల కంటే చేతలే ఎక్కువ. ఆమె కళ్లలో యుద్ధం తాలూకా అలసట ఉండదు. నిశ్చలమైన లక్ష్యం కనిపిస్తుంది. ఒక వైద్యురాలిగా ఆమెకు విజయం అంటే మెడల్స్‌ కాదు.. ఒక ప్రాణం నిలబడటం. ‘‘యుద్ధం వచ్చినప్పుడు లింగభేదానికి తావుడందు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ సైనికులే. కొందరు ఆయుధాలు పడితే, మేం వైద్యం ద్వారా మా బాధ్యతను నెరవేరుస్తున్నాం’’ అంటారు ఇన్నా. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే యుద్ధ వాతావరణంలో ఆమెకు ఎప్పుడూ వివక్ష ఎదురుకాలేదు. కారణం.. ఆమె చూపే వృత్తి నైపుణ్యం. గంటల తరబడి క్షతగాత్రుల మధ్య గడిపాక, ఆ మానసిక ఒత్తిడిని జయించడానికి ఆమె ఎంచుకునే మార్గం నిద్ర. ఆ తర్వాత క్రీడల ద్వారా తన శరీరాన్ని, మనసును మళ్లీ సిద్ధం చేసుకుంటారు. ఆమె ఉక్కు సంకల్పం ముందు యుద్ధ బీభత్సం కూడా తల వంచాల్సిందే.

విలయంలోనూ చెదరని సంకల్పం

ఒక యూనిట్‌ లీడర్‌గా అలీనా బిలౌస్‌ బాధ్యత చాలా సంక్లిష్టమైనది. అంబులెన్స్‌ ఎటు వెళ్లాలి? ఏ బృందం ఎక్కడ ఉండాలి? మెడిక్స్‌తో కమ్యూనికేషన్‌ ఎలా ఉంది? ఇలా ప్రతి అంశాన్ని ఆమె పర్యవేక్షించాలి. ఆమె దృష్టిలో టీం వర్క్‌ అంటే ఒక యంత్రం లాంటిది కాదు.. ఒక ‘జీవి’ లాంటిది. ఒక అవయవానికి దెబ్బ తగిలితే మరొకటి ఎలా స్పందిస్తుందో, తన టీం కూడా అలాగే ఒకరికి ఒకరు తోడుండాలని ఆమె కోరుకుంటారు. యుద్ధం అలీనా నుంచి చాలా లాగేసుకుంది. కుటుంబానికి దూరంగా, రేపటి గురించి ఎలాంటి ప్లాన్స్‌ లేకుండా గడపడం మామాలు విషయం కాదు. ‘‘మేం యుద్ధంలో పురుషులతో సమానంగా పోరాడుతున్నాం. కానీ, ఈ క్రూరత్వం మధ్య కూడా మాలోని సౌకుమార్యాన్ని, అందాన్ని, ప్రేమను కాపాడుకోవాలని అనుకుంటాం.


రాక్షసత్వం రాజ్యమేలుతున్న చోట మనిషిగా మిగిలి ఉండటమే పెద్ద విజయం’’ అని ఆమె చెప్పే మాటలు గుండెను హత్తుకుంటాయి. అలసిపోయినప్పుడు ఒక కప్పు వేడి కాఫీ, లేదా పార్క్‌లో చిన్న నడక ఆమెకు మళ్లీ శక్తినిస్తాయి.

ప్రతి క్షణం ఒక సవాల్‌

మెడిక్‌గా పనిచేస్తున్న నటాలియా తారాస్యుక్‌ జీవితం క్షణమొక సవాల్‌. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే లోపు ఇచ్చే చికిత్స అత్యంత కీలకం. అక్కడ భయం ఉంటే ప్రాణం పోతుంది. అందుకే ఆమె మెదడు కేవలం ‘అల్గారిథమ్స్‌’ (వైద్య సూత్రాలు) మీద పనిచేస్తుంది. బాంబులు పడుతున్నా, రోగి నాడిని పట్టుకోవడంలో ఆమె చేయి వణకదు. యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే ఆమె ఈ సేవలో ఉన్నారు. ఈ రెండేళ్ల కాలం ఆమెకు జీవితం విలువను నేర్పింది. ఒక శ్వాస, ఒక కౌగిలింత, ఒక పలకరింపు ఎంత విలవైందో ఆమెకు అర్థమైంది. ఇంటికి వెళ్లాక ఒక కూతురిగా, ఒక తల్లిగా ఆమె తన బాధ్యతలు నెరవేరుస్తారు. తన కొడుకుతో మాట్లాడటం, సైకాలజీ పుస్తకాలు చదవడం ద్వారా ఆమె తన మనసును కుదుటపరుచుకుంటారు. ‘‘వైద్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం’’ అని ఆమె బలంగా నమ్ముతారు.

యోధుల కన్నా తక్కువేమీ కాదు

ఈ ముగ్గురు మహిళల కథలు ఒక ఉదాహరణ మాత్రమే. యుద్ధక్షేత్రంలో మహిళలు అంటే బాధితులు మాత్రమే కాదు.. వారు బలమైన నాయకులు, నిర్ణేతలు, రక్షకులు. తుపాకి పట్టిన సైనికుడికి ఎంత ధైర్యం కావాలో, రక్తసిక్తమైన దేహాలను మోస్తూ అంబులెన్స్‌ నడిపే ఈ మహిళలకు కూడా అంతే గుండె నిబ్బరం కావాలి. వీరు కోరుకునేది గుర్తింపు మాత్రమే కాదు.. సమానత్వం. వృత్తిలో రాణిస్తున్నప్పుడు లింగ వివక్షకు తావులేదని వీరు నిరూపించారు. ప్రపంచం యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ ధీర వనితలు ఆ యుద్ధం ఆర్పేస్తున్న ప్రాణాలను మళ్లీ వెలిగించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఖార్కివ్‌ గడ్డపై వీరు చిందిస్తున్న ప్రతి చెమట చుక్క ఒక కొత్త ఆశకు ఊపిరి పోస్తోంది.

Also Read:

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 01:37 AM