Share News

విశ్వవేదికపై ఆ ముగ్గురు!

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:09 AM

ఒకరు అగ్రరాజ్యపు అజెండాను మార్చారు.. మరొకరు మరణశాసనం రాసే వ్యాధులను జయిస్తున్నారు.. ఇంకొకరు మారుమూల పల్లెల్లో అక్షర విప్లవం తెస్తున్నారు....

విశ్వవేదికపై ఆ ముగ్గురు!

ఒకరు అగ్రరాజ్యపు అజెండాను మార్చారు.. మరొకరు మరణశాసనం రాసే వ్యాధులను జయిస్తున్నారు.. ఇంకొకరు మారుమూల పల్లెల్లో అక్షర విప్లవం తెస్తున్నారు. 2026 ‘టైమ్స్‌ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో నిలిచిన ముగ్గురు భారతీయ వనితలు.. రేష్మా సౌజాని, రేష్మా కేవల్‌రమణి, సఫీనా హుస్సేన్‌ల అద్భుత ప్రస్థానం ఇది.

అణచివేతకు వ్యతిరేకంగా వినిపిస్తున్న ఒక శక్తివంతమైన గొంతుక రేష్మా సౌజాని. టెక్నాలజీ రంగంలో అమ్మాయిల ముద్ర వేసినా.. అమెరికా అధ్యక్ష అభ్యర్థినే సూటిగా ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేసినా అది ఆమెకే సాధ్యం. రేష్మా సౌజాని నేపథ్యం ఒక సినిమా కథను తలపిస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఉగాండాలో స్థిరపడిన భారతీయులు. 1970లలో అక్కడి నియంత ఇడీ అమీన్‌ భారతీయులను దేశం నుంచి వెళ్లగొట్టినప్పుడు ఆమె కుటుంబం సర్వం కోల్పోయి శరణార్థులుగా అమెరికా చేరుకుంది. ఇల్లినాయిస్‌లోని ఒక సాధారణ వాతావరణంలో పెరిగిన రేష్మా తన తల్లిదండ్రులు అనుభవించిన వివక్షను, కష్టాలను చూస్తూ పెరిగారు. అదే ఆమెలో పోరాటపటిమను పెంచింది. 2010లో అమెరికా కాంగ్రెస్‌కు పోటీచేసిన తొలి భారత సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

ఒక వైరల్‌ ప్రశ్న.. ఆమెరికా ఆత్మశోధన

2024 సెప్టెంబర్‌లో జరిగిన ఒక బహిరంగ వేదిక అది. దానిపై అప్పటి అమెరికా అధ్యక్ష అభ్యర్థి (ప్రస్తుత అధ్యక్షుడు) డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నారు. అందరూ రాజకీయాల గురించి అడుగుతుంటే రేష్మా సౌజాని మాత్రం సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ‘‘అమెరికాలో సామాన్య కుటుంబాలకు శిశు సంరక్షణ భారం కొండలా మారుతోంది. దీనిపై మీ ప్రణాళిక ఏంటి?’’. ఈ ప్రశ్నకు ట్రంప్‌ తడబడటం అప్పట్లో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. గణాంకాల ప్రకారం.. అమెరికాలోని యువ తల్లిదండ్రులు తమ ఆదాయంలో 20 శాతానికిపైగా కేవలం పిల్లల సంరక్షణకే ఖర్చు చేస్తున్నారు. ఈ సమస్యను జాతీయ అజెండాగా మార్చిన ఘనత రేష్మాదే.

కోడింగ్‌ ప్రపంచంలో లింగ వివక్షపై యుద్ధం

రేష్మా ప్రయాణం ఈనాటిది కాదు. 2012లో ఆమె ‘గర్ల్స్‌ హూ కోడ్‌’ అనే విప్లవాత్మక సంస్థను స్థాపించారు. అప్పట్లో టెక్నాలజీ అంటే కేవలం అబ్బాయిల సామ్రాజ్యమే అనే భావన ఉండేది. దానిని చెరిపివేస్తూ ఇప్పటి వరకు 7.6 లక్షల మందికిపైగా విద్యార్థినులకు కోడింగ్‌ నేర్పించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మహిళా ఇంజినీర్ల సంఖ్య పెరగడానికి ఆమె వేసిన పునాదులే కారణం.


తల్లుల కోసం ఒక సైన్యం

కరోనా మహమ్మారి తర్వాత మహిళలు ఉద్యోగాల కంటే పిల్లల పెంపకానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడం ఆమెను కలచివేసింది. అందుకే ‘మామ్స్‌ ఫస్ట్‌’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించి, పనిచేసే తల్లుల కోసం ‘పెయిడ్‌ లీవ్‌’, సరసమైన ధరకే చైల్డ్‌కేర్‌ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆమె పోరాటం ఫలించి న్యూయార్క్‌ ప్రభుత్వం ఇటీవల ఐదేళ్లలోపు పిల్లలందరికీ ‘యూనివర్సల్‌ కేర్‌’ అందిస్తామని ప్రకటించింది. దీని కోసం 1.7 బిలియన్‌ డాలర్లు కేటాయించింది.

అమెరికా శిశు సంరక్షణ సంక్షోభాన్ని జాతీయస్థాయి చర్చగా మార్చడంలో ఆమె చూపిన తెగువను, నాయకత్వాన్ని గుర్తిస్తూ టైమ్‌ మ్యాగజైన్‌ ఆమెను 2026 ‘విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో చేర్చింది.

అపజయమెరుగని ధీశాలి

మందులేని వ్యాధికి మార్గం చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శాస్త్రవేత్త రేష్మా కేవల్‌ రమణి. ముంబై వీధుల నుంచి ప్రపంచస్థాయి బయోటెక్‌ దిగ్గజం వరకు ఆమె ప్రయాణం అసాధారణం. 1973లో ముంబైలో జన్మించిన రేష్మా తన 11వ ఏట తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కష్టపడి చదివి మెడిసిన్‌ పూర్తిచేశారు. ‘‘మా ఇంట్లో రెండే ఆప్షన్లు ఉండేవి. ఒకటి ఇంజినీర్‌ అవడం, రెండు డాక్టర్‌ కావడం. నేను డాక్టర్‌ ఎంచుకున్నాను’’ అని ఆమె చెబుతుంటారు. బోస్టన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ పూర్తిచేసిన రమణి.. కిడ్నీ వ్యాధుల నిపుణురాలిగా కెరీర్‌ మొదలుపెట్టి బయోటెక్‌ రంగంవైపు అడుగులు వేశారు.

నేడు అమెరికా బయోటెక్‌ దిగ్గజం ‘వర్టెక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌’కు సీఈవోగా ఉన్న ఆమె ప్రాణాంతకమైన ‘సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌’ వ్యాధికి చికిత్స అందించడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందారు. కేవలం మందులు తయారుచేయడమే కాకుండా ‘సీఆర్‌ఐఎస్‌పీఆర్‌’ అనే అత్యాధునిక జన్యుసవరణ టెక్నాలజీ ద్వారా రక్త సంబంధిత వ్యాధులను నయం చేసే అద్భుతాన్ని ఆమె ఆవిష్కరిస్తున్నారు. ‘ఫార్చ్యూన్‌ 500’ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న తొలి భారత సంతతి మహిళగా రేష్మా కేవల్‌ రమణి రికార్డు సృష్టించారు. లాభాల కోసం కాకుండా రోగుల ప్రాణాలను కాపాడటమే పరమావధిగా ఆమె చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘టైమ్‌ మ్యాగజైన్‌’ ఆమెను 2026 ‘విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటించింది.


అక్షర వెలుగుల సామాజిక శిఖరం

ముంబైలోని గ్లామర్‌ ప్రపంచం నుంచి వచ్చి మారుమూల పల్లెల్లో విద్యావిప్లవం కోరుకున్న విలక్షణ వ్యక్తిత్వం సఫీనా హుస్సేన్‌. లక్షల మంది బాలికల జీవితాల్లో చీకట్లు తొలగించిన స్ఫూర్తి ప్రదాత. సఫీనా హుస్సేన్‌ బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దివంగత యూసుఫ్‌ హుస్సేన్‌ కుమార్తె. ముంబైలోని విలాసవంతమైన వాతావరణంలో పెరిగినా, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఉన్నత చదువులు చదువుకున్నా ఆమె హృదయం మాత్రం తన దేశంలోని పేదరికంలో మగ్గుతున్న బాలికల కోసం తపించింది. అందుకే గ్లామర్‌ ప్రపంచాన్ని వదిలి సేవా పథాన్ని ఎంచుకున్నారు.

2007లో ఆమె ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థను స్థాపించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని అత్యంత వెనుకబడిన గ్రామల్లో ఇంటింటికీ తిరిగి, బడికి దూరమైన బాలికలను గుర్తించారు. ఇప్పటి వరకు 15 లక్షలమందికిపైగా బాలికల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించారు. గ్రామీణ భారతంలో ఆమె తెచ్చిన ఈ మార్పును ప్రపంచం గుర్తించింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న సఫీనా.. 2026 ‘టైమ్స్‌ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలవడం భారతీయ సామాజిక సేవా రంగానికి దక్కిన గౌరవం.

ఈ వార్తలు కూడా చదవండి..

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు

For More AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 03:10 AM