Share News

మిద్దె తోట ఇలా...

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:33 AM

ఇంటి డాబాపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కలతో కూడిన మిద్దె తోటను పెంచేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

మిద్దె తోట ఇలా...

ఇంటి డాబాపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కలతో కూడిన మిద్దె తోటను పెంచేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

  • బరువు ఎక్కువగా ఉండే మట్టి, సిమెంట్‌, సిరామిక్‌ కుండీలకు బదులు తేలికగా ఉండే ప్లాస్టిక్‌ కుండీలు లేదా గ్రో బ్యాగ్స్‌ను ఉపయోగించడం మంచిది. వీటివల్ల భవనంపై ఎక్కువ భారం పడదు. గోడలకు పగుళ్లు రావు.

  • అదనపు నీరు బయటికి వెళ్లేలా కుండీలు, గ్రో బ్యాగ్స్‌ అడుగున రంధ్రాలు చేయాలి. లేదంటే నీరు నిలిచి మొక్కల వేర్లు కుళ్లిపోతాయి. డాబాపైన నీరు నిల్వ ఉండకుండా డ్రెయిన్‌ రంధ్రాలు ఏర్పాటు చేసుకోవాలి.

  • కోకోపీట్‌, ఎండిన ఆకులు, పశువుల ఎరువు, పండ్ల తొక్కలు, గుడ్ల పెంకులు తదితరాలను కలిపితే మట్టి వదులుగా ఉంటుంది. ఎక్కువసేపు తేమను నిలుపుకుంటుంది కూడా. దీంతో వేర్లకు గాలి బాగా తగలడంతోపాటు పోషకాలు అంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

  • రెండు వారాలకు ఒకసారి జీవామృతం లేదా వేపపిండి లాంటి సేంద్రీయ ఎరువులను మొక్కలకు అందించాలి. క్రిమి కీటకాలు ఆశించకుండా అప్పుడప్పుడు వేపనూనె, వెల్లుల్లి లేదా సబ్బు నీటిని పిచికారీ చేస్తుండాలి.

  • రోజుకు కనీసం అయిదారు గంటలు మొక్కలన్నింటికీ ఎండ తగిలేలా చూడాలి. మొక్కల స్వభావాన్ని అనుసరించి నీటిని అందించాలి. అధిక వేడి, వర్షం నుంచి మొక్కలను సంరక్షించేందుకు వీలుగా ఆకుపచ్చని షేడ్‌ నెట్‌ లేదా ఓవర్‌ హెడ్‌ ఫ్రేమ్‌ను నిర్ణీత వాలులో ఏర్పాటు చేయాలి.

  • కాకర, బీర, దొండ, పొట్ల లాంటి తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిని ఏర్పాటు చేయాలి. కీటకాలను ఆకర్షించే బంతి, జిన్నియా లాంటి పూల మొక్కల కుండీలను అక్కడక్కడా ఉంచాలి. ఏడాది పొడవునా పూలు పూసే మందారం, సదాబహార్‌, బోగెన్‌విల్లా మొక్కలను పెంచితే తోట అందంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 12:33 AM