పచ్చని ఆశల పల్లెబాట!
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:31 AM
గ్రామాల్లో పెళ్లిళ్లయినా, పేరంటాలైనా నిన్నటిదాకా కనిపించిన ప్లాస్టిక్ కుప్పల స్థానంలో ఇప్పుడు మెరిసే స్టీలు పాత్రలు దర్శనమిస్తున్నాయి. ఒక మంచి ఆలోచన మహిళల చేతుల్లో...
గ్రామాల్లో పెళ్లిళ్లయినా, పేరంటాలైనా నిన్నటిదాకా కనిపించిన ప్లాస్టిక్ కుప్పల స్థానంలో ఇప్పుడు మెరిసే స్టీలు పాత్రలు దర్శనమిస్తున్నాయి. ఒక మంచి ఆలోచన మహిళల చేతుల్లో పడితే ఎలాంటి సామాజిక విప్లవం వస్తుందో చెప్పడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సాగుతున్న ఈ పర్యావరణ యజ్ఞమే నిదర్శనం.
ప్రకృతిని కాపాడుకోవడం, భావి తరాలకు పచ్చని, పరిశుభ్రమైన భూమిని అందించడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతిఒక్కరి సామాజిక కర్తవ్యం. నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ఎన్నో వ్యాధులకు, పర్యావరణ వినాశనానికి కారణమవుతున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టేందుకు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా ఒక అద్భుతమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామాల అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను ఒకే వేదికపైకి తెస్తూ ‘స్టీల్ బ్యాంక్’ అనే వినూత్న భావనను ఇక్కడ అమలు చేశారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రచారం చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదని గ్రహించి.. దానికి బలమైన, శాశ్వతమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల చేతుల్లో పెట్టాలనే సత్సంకల్పంతో రాష్ర్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్’ ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ స్థానంలో.. దశాబ్దాలపాటు మన్నికగా ఉండే స్టీల్ పాత్రలను ప్రవేశపెట్టడం ఇక్కడి సామాజిక పరిణామంలో ఒక మైలురాయిగా నిలిచింది.
సామాజిక ఉద్యమం
గ్రామగ్రామాన ప్లాస్టిక్‌పై పోరు విజయవంతం కావాలంటే అది.. సమాజంలో సగభాగంగా ఉంటూ, ఇంటి బాధ్యతలను మోసే మహిళల ద్వారానే సాధ్యపడుతుందని నిర్వాహకులు బలంగా నమ్మారు. అందుకే నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు ఈ స్టీల్ బ్యాంకులను అప్పగించారు. గతేడాది జూలై 17న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. నేడు విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఒక అద్భుతమైన సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ ఏడాది కాలంలో హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం సాగింది. నేడు ఇక్కడి పల్లెల్లో జరిగే పెళ్లిళ్లు, దైవకార్యాలు, శుభకార్యాలు, అన్నదానాలు, చివరకు అధికారిక గ్రామసభల్లో సైతం ప్లాస్టిక్ డిస్పోజబుల్ పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ పాత్రలనే వినియోగిస్తున్నారు. పల్లె ప్రజల జీవనశైలిలో ఇది ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది.
గణాంకాల వెనుక చైతన్యం
సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ మార్పు కనిపిస్తోంది. కాగితాలకో, ఉపన్యాసాలకో పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయాలు అద్భుతం. 276 గ్రామ సంఘాల పరిధిలో క్రియాశీలకంగా పని చేస్తున్న 7,376 స్వయం సహాయక సంఘాలు, వాటిలోని 80,633 మంది మహిళా సభ్యులు ఈ మహోద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు.
ప్రతి గ్రామ సంఘానికి వంట సామగ్రి నుంచి భోజన వసతుల వరకు అవసరమయ్యే 13 రకాల స్టీల్ పాత్రలతో కూడిన ‘స్టీల్ బ్యాంక్’ సెట్లను ఉచితంగా అందించారు. దీనికోసం దాదాపు రూ.2.54 కోట్లకు పైగా సొంత నిధులను వెచ్చించడం విశేషం. ఈ మార్పు కేవలం ఇళ్లకు, ఫంక్షన్లకే పరిమితం కాలేదు. వ్యాపార కేంద్రాలలోనూ మార్పు తేవాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులను ఉచితంగా పంపిణీ చేశారు. దీనివల్ల నిత్యం వేలాదిగా వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వినియోగానికి బ్రేక్ పడింది.
పర్యావరణం.. స్వయం ఉపాధి
ఈ స్టీల్ బ్యాంకుల నిర్వహణ వల్ల గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలు గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, మహిళా సంఘాలకు ఇదొక అదనపు ఆదాయ వనరుగా మారింది. గ్రామాల్లో ఎవరికైనా శుభకార్యాలు లేదా సామూహిక కార్యక్రమాలు ఉంటే బయట వేలాది రూపాయలు పెట్టి ప్లాస్టిక్ ప్లేట్లు కొనే బదులు, ఈ స్టీల్ బ్యాంకు నుంచి పాత్రలను అద్దెకు తీసుకెళ్తున్నారు. ఇందుకు గానూ సంఘానికి కేవలం రూ. 500 నామమాత్రపు రుసుము చెల్లిస్తున్నారు. దీనివల్ల అటు ప్రజలకు ఖర్చు తగ్గుతోంది, ఇటు మహిళా సంఘాల నిధికి ఆదాయం సమకూరుతోంది.
‘గతంలో మహిళా సంఘాల సమావేశాలు జరిగినప్పుడు ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు, భూగర్భ జలాలు కలుషితం కావడం వంటి విషయాలపై అవగాహన కల్పించేవాళ్లం. కానీ ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు స్టీల్ పాత్రలు అందుబాటులోకి రావడంతో ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. నిన్నటి వరకు ప్లాస్టిక్ వాడిన వారే ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి స్టీల్ పాత్రలను తీసుకెళ్తున్నారు’ అని స్థానిక మహిళా సమాఖ్య ప్రతినిధులు ఎంతో గర్వంగా చెబుతున్నారు.
ఇంతింతై.. వటుడింతై..
మొదట ఒక చిన్న ఆలోచనగా మొదలై.. హుస్నాబాద్ వ్యాప్తంగా పర్యావరణ చైతన్యం రగిలించిన ఈ ప్రయోగం నిజంగా ప్రశంసనీయం. ప్లాస్టిక్ రహిత గ్రామాల నుంచి ప్లాస్టిక్ రహిత హోటళ్ల వరకు సాగుతున్న ఈ సామాజిక విప్లవం, రేపటి తరం ఆరోగ్యానికి ఒక గట్టి భరోసా ఇస్తూ దేశంలోని మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
నన్నె అజయ్ కుమార్,
హుస్నాబాద్
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News