సప్లిమెంట్లు ఆచితూచి...
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:31 AM
మందుల షాపుల్లో తోచిన సప్లిమెంట్లు కొని వాడుకోవడం వల్ల ప్రయోజనంతో పాటు నష్టం కూడా కలుగుతుంది. తగు పరిమాణాల్లో విటమిన్లు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం...
కౌన్సెలింగ్
డాక్టర్! ఏడాదిగా ప్రతి రోజూ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడుకుంటున్నాం. ఇలా బలానికి మందులు వాడుకోవడం మంచిదేనా?
- ఓ సోదరి, హైదరాబాద్
మందుల షాపుల్లో తోచిన సప్లిమెంట్లు కొని వాడుకోవడం వల్ల ప్రయోజనంతో పాటు నష్టం కూడా కలుగుతుంది. తగు పరిమాణాల్లో విటమిన్లు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుందో, ఎక్కువ పరిమాణాల్లో కొన్ని విటమిన్లు తీసుకోవటం వల్ల అంతకంటే రెట్టింపు ప్రమాదమూ ఉంటుంది. కొన్ని విటమిన్లు నీళ్లలో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటే, ఇంకొన్ని కొవ్వులో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. బికాంప్లెక్స్ (బి1, బి2, బి6, బి12), విటమిన్ సిలు నీటిలో కరిగే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకున్నా అవి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఎ, డి, ఇ, కె విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్. ఇవి శరీరంలోని కొవ్వులో చేరి అక్కడే నిల్వ ఉండిపోతాయి. అవసరం లేకపోయినా వీటిని తీసుకుంటే కొంత పరిధి దాటాక శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అవసరానికి మించి శరీరంలో చేరుకుంటే రక్తంలో క్యాల్షియం స్థాయిలు పెరిగిపోతాయు.
బి కాంప్లెక్స్: బి కాంప్లెక్స్‌లో బి1, బి2, బి6, బి12 అనే ఎన్నో రకాల వర్గాలున్నాయి. వైద్యులు సూచించే ఈ బికాంప్లెక్స్ పరిమాణం, తీసుకునే ఆహారంలో పొందే బి విటమిన్లతో సమానంగా ఉంటుంది. అంటే ఆహారం ద్వారా 50ు బి విటమిన్లు అందితే, మిగతా 50 శాతాన్ని వైద్యులు మందులతో భర్తీ చేస్తారు. బి కాంప్లెక్స్ ఎంత వాడాలి? ఎప్పుడు వాడాలి? ఏ పరిస్థితుల్లో వాడాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.
క్యాల్షియం, విటమిన్ డి: మనకు రోజు మొత్తానికి సరిపడా విటమిన్ డితో కలిసిన క్యాల్షియం పరిమాణం 600 నుంచి 800 మైక్రో యూనిట్లు. గర్భిణులు కూడా కాల్షియంను ఇదే పరిమాణంలో తీసుకోవాలి. అయితే మెనోపాజ్ దశకు చేరుకుని, 65 ఏళ్లు దాటిన మహిళలకు 800 నుంచి 1000 మైక్రో యూనిట్ల కాల్షియం ఇవ్వాలి. మెనోపాజ్ తర్వాత 1200 మైక్రో యూనిట్ల క్యాల్షిం అవసరం పడుతుంది
విటమిన్ డి: విటమిన్ డి కలిపిన నూనెలు వాడటం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది. అలాగే సూర్యరశ్మి ద్వారా కూడా మన చర్మంలో విటమిన్ డి తయారవుతుంది. కాబట్టి వైద్యులు సూచిస్తే తప్ప ఈ విటమిన్‌ను తీసుకోకూడదు.
యాంటీ ఆక్సిడెంట్లు: యాంటీ ఆక్సిడెంట్లు తీసుకుంటే క్యాన్సర్ ముప్పు, హృద్రోగాలు తగ్గుతాయనే అపోహలు కూడా ఉన్నాయి. దీన్లో వాస్తవం ఉన్నా అది కొన్ని వర్గాల రోగులకే పరిమితం. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి వీటి వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అలాగని తీవ్ర వ్యాధుల నుంచి రక్షణ పొందటం కోసం ప్రతి ఒక్కరూ యాంటీ ఆక్సిడెంట్ల మీద ఆధారపడితే లాభం కంటే నష్టమే ఎక్కువ.
డాక్టర్ రామలింగం
జనరల్ ఫిజీయన్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International