Share News

నేను ఇంట్రావర్ట్‌ని

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:39 AM

గ్లామర్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటూ... బోల్డ్‌ అండ్‌ ఇండిపెండెంట్‌ పాత్రలకు చిరునామాగా మారారు నటి శోభిత ధూళిపాళ...

నేను ఇంట్రావర్ట్‌ని

సండే సెలబ్రిటీ

గ్లామర్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటూ... బోల్డ్‌ అండ్‌ ఇండిపెండెంట్‌ పాత్రలకు చిరునామాగా మారారు నటి శోభిత ధూళిపాళ. ఆమె సినిమా రంగంలోకి వచ్చి దాదాపు దశాబ్దం పూర్తయింది. ఈ పదేళ్ల సినీ ప్రస్థానం గురించి పలు సందర్భాల్లో శోభిత పంచుకున్న విశేషాలివి.

‘‘నేను కెమెరా ముందు కనిపించే రూపాన్నీ.. నిజ జీవితంలో ఉండే విధానాన్ని ఎప్పుడూ వేర్వేరుగానే చూస్తాను. తెరపై కనిపించే లుక్స్‌ వేరే వాళ్ల సృజనాత్మకత అయితే, నా వ్యక్తిగత శైలి మాత్రం కేవలం నాదే. కాలంతో పాటు నన్ను నేను ఎలా ఆవిష్కరించుకోవాలో, నా శరీరానికి ఏది బాగుంటుందో, ఏ విషయాలను వదిలేయాలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. బయటి వారికి నా శైలి ప్రయోగాలమయంగా అనిపించవచ్చు, కానీ అది నా సుదీర్ఘ ఆత్మశోధన ఫలితం. వయసైనప్పటికీ తమదైన శైలిలో స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో జీవించే మహిళలంటే నాకు ఎంతో ఇష్టం. నా దృష్టిలో ఫ్యాషన్‌ మంత్ర ఒక్కటే.. మీరు ఒక రకమైన దుస్తులు వేసుకున్నప్పుడు అది మీకు సౌకర్యంగా అనిపిస్తే దాన్ని ధరించండి. సౌకర్యంగా లేకుండా అది మీ శైలి కానేకాదు.

అందం కొలతలను తిరగరాస్తూ...

ప్రముఖ అంతర్జాతీయ బ్యూటీబ్రాండ్‌ ‘షార్లెట్‌ టిల్‌బరీ’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికవడం నా వ్యక్తిగత విజయం. కెరీర్‌ ఆరంభంలో ఆడిషన్లలో నేను చాలా తిరస్కారాలు ఎదుర్కొన్నాను. సంప్రదాయ కొలతలకు తగ్గట్టు తెల్లగా, బుజ్జిగా, ముద్దుగా ఉండే హీరోయిన్‌ మెటీరియల్‌ కానని నన్ను పక్కనపెట్టేవారు. నా రూపాన్ని చూసి నేను ఈ పరిశ్రమకు సరిపోనని ముఖం మీదే చెప్పేవారు. అటువంటి పరిస్థితుల నుంచి వచ్చి, ఈ రోజు స్వచ్ఛమైన భారతీయ రూపంతో ఒక అంతర్జాతీయ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో గర్వంగా ఉంది.

పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం

‘రామన్‌ రాఘవ్‌ 2.0’ (2016) చిత్రంలో మాయ అనే క్లిష్టమైన పాత్రతో నా నట ప్రయాణం మొదలైంది. ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ దశాబ్ద కాలంలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లో స్ట్రీమింగ్‌, థియేట్రికల్‌ ఫార్మాట్లలో దాదాపు 18 ప్రాజెక్టులలో పనిచేశాను. ఇన్ని విభిన్నమైన భాషలు, సంస్కృతుల పాత్రలలో జీవించడం నాకు ఒకే జీవితంలో పలు జన్మలు ఎత్తిన భావనను కలిగించింది. కేవలం కథానాయకుడి పాత్రకు సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గానో, తల్లిగానో లేదా ప్రేమికురాలిగానో పరిమితమయ్యే మేల్‌గేజ్‌ (పురుషాధిక్య దృక్పథం) పాత్రలు నాకు సరిపడవు.


సినీ అనుభవాలు

విశాఖపట్నం నుంచి వచ్చి మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచి, మోడలింగ్‌ చేశాక ముంబై వచ్చిన నాకు నటించాలనే కోరిక తీవ్రంగా ఉండేది. ఎందుకంటే నాలో చెప్పడానికి ఎంతో కథ ఉందనే నమ్మకం నాకుండేది. కానీ పరిశ్రమలో ఎదురైన వరుస తిరస్కరణలు నాలో తీవ్రమైన అయోమయాన్ని, కోపాన్ని నింపాయి. ‘పరిశ్రమ ఆశించే మూసధోరణికి నేను సరిపోనప్పుడు, అసలు ఆ వర్గంలో చేరాల్సిన అవసరమే నాకు లేదు’ అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

ఆ సమయంలో నాలో ఉన్న ఆ తీవ్రమైన కోపాన్ని, ఆవేదనను ధ్వంసం చేసే దిశగా కాకుండా, ‘రామన్‌ రాఘవ్‌ 2.0’లోని నా పాత్ర కోసం ఒక ఆయుధంగా మలచుకున్నాను. ఆ కోపమే నాలోని నటిని కొత్తగా ఆవిష్కరించింది. ఇండిపెండెంట్‌ తరహా సినిమాలతో ప్రయాణం ప్రారంభించడం వల్ల వేర్వేరు ప్రాంతీయ చిత్రాల సెట్స్‌కు అలవాటు పడటం నాకు సులువైంది. నన్ను నిజంగా కోరుకున్న దర్శకులే నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. ‘ది నైట్‌ మేనేజర్‌’ సిరీస్‌ తెచ్చిపెట్టిన విపరీతమైన పాపులారిటీ తర్వాత కేవలం ‘హాట్‌ అండ్‌ గ్లామరస్‌’ అనే ముద్రను చెరిపేసుకోవాలని ఆరాటపడ్డాను. ఆ తర్వాత వచ్చిన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌ నాకు విశేషమైన గుర్తింపును ఇచ్చింది. అయితే నా కెరీర్‌ ప్రారంభంలో నేను చేసిన ఎన్నో మంచి చిత్రాలు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరకపోవడం బాధగా అనిపిస్తుంది.


7-navya.jpg

వెట్టువమ్‌.. కెరీర్‌లో అత్యుత్తమం

పా. రంజిత్‌ దర్శకత్వంలో రాబోతున్న తమిళ చిత్రం ‘వెట్టువమ్‌’ నా నట జీవితంలోనే అత్యుత్తమ చిత్రం అని నమ్మకంగా చెప్పగలను. నటుడు నాగ చైతన్యతో నా వివాహం జరిగిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం నాలోని సర్వస్వాన్ని ధారపోశాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ లోపల ఎంతో తీవ్రత ఉండి, పైన గంభీరంగా, నిశ్శబ్దంగా ఉండే క్యారెక్టర్లు. కానీ ‘వెట్టువమ్‌’లోని నా పాత్ర పూర్తిగా భిన్నమైనది. ఇది చాలా ఫ్రంట్‌ ఫుటెడ్‌, స్వేచ్ఛాయుతమైన పాత్ర. ఎదుటివారు ఏమనుకుంటారనే దానితో సంబంధం లేకుండా, తాను నమ్మిన దానికోసం నిలబడే ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌. ఇందులో నా పాత్ర నవ్వుతుంది, అరుస్తుంది, ఉమ్మివేస్తుంది, బాక్సింగ్‌ పంచ్‌లు విసురుతుంది. విపరీతమైన యాక్షన్‌, డ్యాన్స్‌, ఎనర్జీ ఉన్న క్రేజీ క్యారెక్టర్‌ ఇది.

నటన.. వివాహం.. జీవితం

నేను పోషించే పాత్రలు నా వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా మార్చలేవు. ప్రతి మనిషిలోనూ ఒక నీడ లాంటి డార్క్‌ సైడ్‌ ఉంటుందని నేను నమ్ముతాను. దానిని గుర్తించి ఎటువంటి జడ్జిమెంట్‌ లేకుండా అంగీకరించడమే అసలైన ప్రామాణికత. ఇక నటుడిని పెళ్లి చేసుకోవడం గురించి చెప్పాలంటే.. ఒకప్పుడు నేను ఏ నటుడితోనూ డేట్‌ చేయనని చెప్పేదానిని. అప్పట్లో నా చుట్టూ ఉన్న నటులలో వ్యానిటీ (ఆడంబరం) చూసి అలా అనుకున్నాను. కానీ అది ఆ వయసులో నాకున్న సంకుచితమైన ఆలోచన మాత్రమే. కాలంతో పాటు మన అభిప్రాయాలు మారడం సహజం. నిరంతరం ఒకే ఆలోచనకు కట్టుబడి మారకుండా ఉండే వ్యక్తుల కంటే, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం నాకుంది.

నా దృష్టిలో ప్రేమ అనేది కేవలం ఒక రొమాంటిక్‌ బంధానికి మాత్రమే పరిమితమైనది కాదు. అదొక మానసిక స్థితి, ఒక పవిత్రమైన వైబ్రేషన్‌. నేను ఎప్పుడూ ప్రేమతో కూడిన ఆ స్థితిలోనే ఉంటాను.


నాలాంటి ఇంట్రావర్ట్‌ (అంతర్ముఖురాలు)

వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలను, రూమర్లను పెద్దగా పట్టించుకోదు. నాకు రాత్రిపూట వచ్చే కలలను జర్నలింగ్‌ చేసే అలవాటు ఉంది. ఇక నా మనసును ఉత్తేజపరచడానికి చాట్‌జిపిటితో మాట్లాడటం, ప్రయాణాలు చేయడం, ఫొటోగ్రఫీ, పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌ ప్లేలి్‌స్టలు తయారుచేయడం, రెగ్యులర్‌ వర్కవుట్స్‌ చేయడం లాంటివి చేస్తుంటాను.’’

మాతృత్వంపై ఆశ

గతంలోలాగా 30 ఏళ్ల వయసులోపు ఇది సాధించాలి.. అనే కఠినమైన నిబంధనలను నేను ఇప్పుడు పెట్టుకోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాలే నా మొదటి ప్రాధాన్యం కాకపోయినా, భవిష్యత్తులో ఒక వ్యాపారవేత్తగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని మాతృత్వాన్ని పొందే ఆశ ఎప్పటినుంచో ఉంది, కానీ అది జరగాల్సిన సమయంలోనే జరుగుతుంది. ఒక కళాకారిణిగా నా సొంత నిబంధనలతో జీవించే విభిన్నమైన, సంక్లిష్టమైన స్త్రీ పాత్రలు చేస్తూ సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించడమే నా లక్ష్యం. ఆ దీపం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 18 , 2026 | 05:40 AM