శూన్యం నుంచి శిఖరానికి
ABN , Publish Date - May 16 , 2026 | 01:31 AM
చదివింది పదో తరగతే కావొచ్చు.. కానీ ఆమె రాసిన విజయగాథ నేడు దేశానికే ఒక పాఠం. వంటింటికే పరిమితం అనుకున్న చోట.. కోట్ల రూపాయల టర్నోవర్ గల సంస్థకు అధిపతిగా...
చదివింది పదో తరగతే కావొచ్చు.. కానీ ఆమె రాసిన విజయగాథ నేడు దేశానికే ఒక పాఠం. వంటింటికే పరిమితం అనుకున్న చోట.. కోట్ల రూపాయల టర్నోవర్ గల సంస్థకు అధిపతిగా ఎదిగిన పూజాశర్మ ప్రయాణం కష్టపడే ప్రతి మహిళకు దిక్సూచి. అసాధారణ పోరాటంతో ‘లఖ్‌పతి దీదీ’గా గుర్తింపు పొందిన ఆమె స్ఫూర్తిదాయక ప్రస్థానం ఆమె మాటల్లోనే...
‘‘నేను హరియాణాలోని ఒక సాదాసీదా పల్లెటూరి పడతినని చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. నా కథ కూడా మీలాగే మొదలైంది. పదో తరగతి వరకు చదువు, ఇరవై ఏళ్లకే పెళ్లి. ముగ్గురు పిల్లలు.. ఆ నాలుగు గోడలే నా ప్రపంచం. కానీ ఆర్థిక ఇబ్బందులు నన్ను గడపదాటించాయి. భర్తకు స్థిరమైన పనిలేకపోవడంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడుతుందేమోనన్న భయం నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ కష్టమే నన్ను ఇక్కడ నిలబెట్టింది.
జీవితాన్ని మార్చిన రూ.2,500
నా ప్రయాణం 2008లో మొదలైంది. కుటుంబం గడవని స్థితిలో నెలకు రూ.2,500 జీతానికి ఒక ఎన్జీవోలో పనికి కుదిరాను. గ్రామాల్లో తిరుగుతూ మహిళల ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పించడం నా పని. మొదటిసారి గడపదాటి బయటి ప్రపంచాన్ని చూసినప్పుడు కలిగిన ఆ ఆత్మవిశ్వాసం అంతాఇంతా కాదు. ఆ చిన్న సంపాదన నాలో ‘నేను కూడా చేయగలను’ అన్న భరోసా నింపింది.
పాత ఇంటి గోడల్లో కొత్త ఆశలు
2010 నాటికి నాలో సొంతంగా ఏదో చేయాలన్న ఆశలు చిగురించాయి. చేతిలో పెట్టుబడి లేదు. కానీ ఏదో ఒకటి సాధించాలన్న కసి పెరిగింది. దీంతో 150 ఏళ్లనాటి ఒక పాడుబడిన ఇంటిని శుభ్రం చేసి ఒకే ఒక్క ఆవుతో డెయిరీ వ్యాపారం ప్రారంభించాను. నేనే పేడ ఎత్తేదాన్ని. పాలు పితకడం నేర్చుకున్నాను. చుట్టుపక్కల వారు నన్ను హేళన చేసినా నేను పట్టించుకోలేదు. ఆ కష్టం వ్యాపారంలో నాకు తొలి పాఠాలు నేర్పింది.
టికెట్ డబ్బులు కూడా లేక
నా జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన 2013లో జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) వాళ్లు సోయా ఉత్పత్తులు, చిరు ధాన్యాల తయారీపై శిక్షణ ఇస్తున్నారని తెలిసి వెళ్లాను. అక్కడికి వెళ్లడానికి నా దగ్గర బస్సు చార్జీలు కూడా లేవు. నా పరిస్థితి చూసి అక్కడి సార్లే నేను తినే స్నాక్ ఖర్చులను అడ్జెస్ట్ చేసి టికెట్ డబ్బులు ఇచ్చేవారు. ఆ పేదరికం నాలో కసి పెంచింది. ‘రైతులు తాము పండించిన పంటకు ధర నిర్ణయించలేరు. కానీ అదే పంటను ఆహార ఉత్పత్తులుగా మార్చి అమ్మితే.. మన ఉత్పత్తుల ధరలు మనమే నిర్ణయించవచ్చు’ అన్న సూత్రం నా వ్యాపార గమనాన్ని మార్చేసింది. శిక్షణ ముగిశాక గ్రామ మహిళలతో కలిసి ఒక స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేశాను. మేమంతా కలిసి చిరు ధాన్యాలతో ఆరోగ్యకరమైన బిస్కెట్లు, లడ్డూలు తయారుచేయడం మొదలుపెట్టాం.

నిశ్శబ్ద పోరాటం
వ్యాపారం పెరిగే కొద్దీ వివిధ నగరాల్లో జరిగే ట్రేడ్ ఫెయిర్లకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ స్టాల్స్ పెట్టి రాత్రి 8-9 గంటల వరకు పనిచేసేదాన్ని. తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమయ్యేది. పల్లెటూరిలో ఒక మహిళ రాత్రివేళ అంత ఆలస్యంగా ఇంటికి రావడంపై జనం రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేను నడుస్తుంటే నా కాలి పట్టీల గజ్జెల చప్పుడు విని ఇరుగుపొరుగు వారు లేస్తారని, నా గురించి తప్పుగా అనుకుంటారన్న భయంతో నా కాళ్ల పట్టీలను తీసేశాను. ఆ నిశ్శబ్దం నా ఓటమి కాదు, నేను సాధించబోయే విజయానికి సంకేతమని నాకు తెలుసు.
మహమ్మారి తెచ్చిన మలుపు
2017లో ఒక బేకరీ యూనిట్ మొదలుపెట్టి నిలదొక్కుకుంటున్న సమయంలో కరోనా వచ్చింది. దీంతో నాకు సాయం చేస్తున్న ఎన్జీవో తప్పుకుంది. కరెంటు బిల్లు కట్టేందుకు కూడా ఇబ్బంది పడ్డాను. అయినా నేను భయపడలేదు. ఆ సమయంలో తక్కువ ధరకు చిరుధాన్యాల బిస్కెట్లు తయారుచేయడం మొదలుపెట్టాను. అప్పుడే నా ‘మిల్లెట్ మామ్’ బ్రాండ్‌కు పునాది పడింది. లాక్‌డౌన్ సమయంలో కూడా నా దగ్గర పనిచేసే మహిళలకు పని కల్పించి ఆదుకున్నాను.
గుర్తింపు.. గౌరవాలు
ఈ రోజు నా బ్రాండ్ ద్వారా 150 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఏకంగా 15 లక్షల లడ్డూలు సరఫరా చేసే స్థాయికి ఎదిగాం. 2023లో భారత ప్రభుత్వం నన్ను ‘లఖ్‌పతి దీదీ’గా గుర్తించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నారీశక్తి’ అవార్డు అందుకుంటున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ రోజు నేను పట్టీలు తీసి నిశ్శబ్దంగా చేసిన పోరాటం.. ఈ రోజు దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. నా తోటి వారికి నేను చెప్పేది ఒక్కటే. మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది. డబ్బు మనకు కుటుంబంలో గౌరవప్రదమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీలోనూ ఆ శక్తి ఉంది. గడపదాటి బయటకు రండి.. గెలిచి చూపించండి.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News