మాతృభూమి కోసం నేను సైతం
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:41 AM
శ్రేయా గౌడ... సగటు నవతరం అమ్మాయిలకు భిన్నం. ఇంజినీరింగ్, మెడిసిన్ రేస్‌లో పరుగెత్తకుండా... ఒక సైనికురాలిగా మాతృభూమికి సేవ చేయాలని కలలు కన్నది...
సంకల్పం
శ్రేయా గౌడ... సగటు నవతరం అమ్మాయిలకు భిన్నం. ఇంజినీరింగ్, మెడిసిన్ రేస్‌లో పరుగెత్తకుండా... ఒక సైనికురాలిగా మాతృభూమికి సేవ చేయాలని కలలు కన్నది. చిన్ననాటి ఆ కలను నేరవేర్చుకొనే క్రమంలో ఎన్నో సవాళ్లు... సమస్యలు. దృఢ సంకల్పంతో అన్నిటినీ అధిగమించి... అనుకున్నది సాధించింది. ఇటీవల జరిగిన ఎన్‌డీఏ పరీక్ష మహిళల విభాగంలో దేశంలోనే టాప్‌లో నిలిచి... నవతరంలో స్ఫూర్తి రగిలిస్తున్న 19 ఏళ్ల శ్రేయ కథ ఇది.
‘‘మూస పద్ధతిలో వెళ్లడం నాకు అస్సలు నచ్చదు. అందుకే భిన్నమైన మార్గంలో నా కెరీర్‌ను నిర్మించుకోవాలని అనుకున్నాను. కానీ అది ఏ రంగం అన్నది అప్పటికి నాకు స్పష్టత లేదు. అయితే 2021లో సుప్రీమ్‌కోర్టు చొరవతో ఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో చేరేందుకు మహిళలకు కూడా అవకాశం కలిగింది. ఆ తీర్పు వెలువడినప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. ఆ వార్త చదివి ఎంతో సంతోషించాను. ఆ క్షణమే అర్థమైంది... నాకు కావల్సింది ఏమిటో. ఎలాగైనా సరే రక్షణ దళంలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. డాక్టర్లు, ఇంజినీర్లు... మరెవరికీ లేని అద్భుతమైన అవకాశం ఒక సైనికుడికి మాత్రమే ఉంటుంది. అదే దేశ రక్షణ. ఆ భావమే నన్ను భావోద్వేగానికి గురి చేసింది. ఇక కార్యరూపం దాలిస్తే, సైనిక దుస్తులు ధరిస్తే... అది మాటలకు అందని అనుభూతినిస్తుంది. అలాంటి అనుభూతినే నేను కోరుకున్నాను.
ఎవరూ అడ్డు చెప్పలేదు...
కర్ణాటక భద్రావతి జిల్లా తిమ్మాపుర గ్రామం మాది. మా నాన్న నాగేంద్ర ‘విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్’ (బీఐఎ్‌సఎల్)లో పని చేస్తారు. అమ్మ ఆశ కామర్స్ లెక్చరర్. నేను సైన్యంలోకి వెళతానంటే అమ్మానాన్నలు కంగారుపడతారని అనుకున్నా. ముఖ్యంగా ఆడపిల్లలను అటువైపు పంపడానికి నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అంతగా ఇష్టపడరు. కానీ అమ్మానాన్న నా ఆశయాన్ని అర్థం చేసుకున్నారు. నాకు అడ్డు చెప్పలేదు. అన్ని విషయాల్లో మద్దతునిచ్చారు. వారి ప్రోత్సాహంతో తొమ్మిదో తరగతిలోనే సన్నాహకాలు మొదలుపెట్టాను. అన్నీ ఒక్కసారే కాకుండా, క్రమపద్ధతిలో ఒక్కో అంశాన్నీ మెరుగుపరుచుకొంటూ వెళ్లాను.
టెన్త్‌లో టాప్...
సైన్యంలో పని చేయడం అంటే కలిసి కట్టుగా అడుగులు వేయాలి. ఒకరికి ఒకరు సహకరించుకొంటూ సాగాలి. అవన్నీ అప్పటికప్పుడు నేర్చుకొనేవి కావు. అందుకే మొదటగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాను. అందుకోసం చర్చా కార్యక్రమాలు, వక్తృత్వ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయితో పాటు చాలా బహుమతులు గెలుచుకున్నాను. పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా వచ్చాను. మెరుగైన శిక్షణ కోసం బెంగళూరుకు వెళ్లి ప్లస్ టూ చదివాను. అదే సమయంలో జీఈఈకి సన్నద్ధమయ్యాను. ఎందుకంటే జేఈఈ రాయగలిగితే, ఎన్‌డీఏ పరీక్ష సులువుగా ఉంటుందని. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను. నాగపూర్ వెళ్లి షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను.
ఎన్‌డీఏ పరీక్షలో టాప్...
రెండేళ్ల కఠోర పరిశ్రమ తరువాత యూ పీ ఎస్ సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ పరీక్షలు రాశాను. ఐదు రోజులపాటు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మహిళల విభాగంలో నాకు ఆలిండియా టాప్ ర్యాంక్ వచ్చింది. ఇన్నేళ్ల నా కల నెరవేరిన క్షణం అది. పట్టు వదలని కృషికి దక్కిన ఫలితం. నా సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు రావడంలేదు. నా నిర్ణయానికి విలువనిచ్చి, నాకు నచ్చిన దారిలో నడిచే స్వేచ్ఛనిచ్చిన అమ్మానాన్నల ప్రోత్సాహంవల్లనే ఇది సాధ్యమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ‘‘శ్రేయ తన కుటుంబానికే కాదు, యావత్తు రాష్ట్రానికి గర్వకారణం’’ అంటూ ప్రత్యేకంగా అభినందించడం ఒక మధుర జ్ఞాపకం.
ఇంజినీరింగ్ వదిలేసి...
ప్రస్తుతం నేను ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక’ (ఎన్‌ఐటీకే)లో బీటెక్ చదువుతున్నాను. ఆర్డర్స్ రాగానే ఇంజినీరింగ్ వదిలేసి పుణెలోని కడక్‌వాస్లా ఎన్‌డీఏకి వెళతాను. డిఫెన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌పై నాకు మక్కువ ఎక్కువ. వాటిల్లో మరిన్ని ఆవిష్కరణలు తెచ్చే దిశగా కృషి చేయాలనేది నా సంకల్పం. ఈ సందర్భంగా నాలాంటి అమ్మాయిలకు నేను ఒక్క విషయం చెప్పాలనుకొంటున్నాను. మీరు ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోవాలని అనుకుంటున్నారో మీకు స్పష్టత ఉండాలి. ఆ విషయాన్ని మీ పెద్దవారికి తెలియజేయండి. వారి సహకారంతో మీ పెద్దవారితో పంచుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. విజయం తప్పక వరిస్తుంది.’’
సైన్యంలోకి వెళతానంటే అమ్మానాన్నలు కంగారుపడతారని అనుకున్నా. ముఖ్యంగా ఆడపిల్లలను అటువైపు పంపడానికి నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అంతగా ఇష్టపడరు. కానీ అమ్మానాన్న నా ఆశయాన్ని అర్థం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News