Share News

కన్నీళ్లు దాటి.. స్వర్ణ శిఖరానికి

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:55 AM

వైకల్యాన్ని.. తీవ్ర గృహహింసను అధిగమించి 40 ఏళ్ల వయసులో కామన్వెల్త్‌ పారా షాట్‌పుట్‌లో షర్మిలా ధన్‌ఖడ్‌ స్వర్ణం సాధించింది. గ్లాస్గో వేదికగా 9.81 మీటర్ల రికార్డు త్రోతో భారత్‌కు రెండు దశాబ్దాల తర్వాత...

కన్నీళ్లు దాటి.. స్వర్ణ శిఖరానికి

వైకల్యాన్ని.. తీవ్ర గృహహింసను అధిగమించి 40 ఏళ్ల వయసులో కామన్వెల్త్‌ పారా షాట్‌పుట్‌లో షర్మిలా ధన్‌ఖడ్‌ స్వర్ణం సాధించింది. గ్లాస్గో వేదికగా 9.81 మీటర్ల రికార్డు త్రోతో భారత్‌కు రెండు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో చారిత్రక విజయాన్ని అందించింది. జీవితం విసిరిన ప్రతి సవాలును గెలుపు ఆయుధంగా మలచుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. హరియాణాలోని మహేంద్రగఢ్‌ జిల్లా చిత్రౌలి గ్రామం షర్మిల స్వస్థలం. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన ఆమెకు రెండేళ్ల వయసులోనే పోలియో బారినపడింది. సరైన వైద్య సదుపాయం అందకపోవడంతో ఎడమకాలు చచ్చుబడిపోయింది. పేదరికంతో, వైకల్యంతో సావాసం చేస్తూనే పదో తరగతి వరకు చదివిన షర్మిలను ఆ వెంటనే తల్లిదండ్రులు పెళ్లిపీటలు ఎక్కించారు.

నరకయాతన

ఆ పెళ్లి షర్మిలకు సంతోషాన్ని ఇవ్వకపోగా తీవ్రమైన మనోవేదన మిగిల్చింది. వ్యసనపరుడైన మొదటి భర్త అదనపు కట్నం తెమ్మంటూ రోజూ హింసించేవాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. 26 ఏళ్ల వయసులో నడిరోడ్డుపై దుస్తులు చింపేసి తీవ్రంగా కొట్టి ఇద్దరు చిన్నారులు సహా ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో పుట్టింటికి చేరిన షర్మిల.. పిల్లల పోషణ కోసం ఏ పని దొరికితే అది చేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చింది.

మైదానంలోకి అడుగు

28వ ఏట అజిత్‌ సింగ్‌ పరిచయంతో షర్మిల జీవితం మలుపు తిరిగింది. షర్మిలను, పిల్లలను ఆత్మీయంగా స్వీకరించిన అజిత్‌.. వారిని రెవాఢీకి తీసుకెళ్లారు. షర్మిలలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి పారా క్రీడాలవైపు ప్రోత్సహించారు. అలా 34 ఏళ్ల వయసులో మైదానంలోకి అడుగుపెట్టిన ఆమె షాట్‌పుట్‌ పట్ల ఆసక్తి పెంచుకుంది. కోచ్‌ల సహకారంతో కఠోర సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.


6-Navya.jpg

గ్లాస్గోలో విశ్వవిజేతగా..

గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో 40 ఏళ్ల వయసులో బరిలోకి దిగిన షర్మిల ‘ఎఫ్‌57’ షాట్‌పుట్‌ విభాగంలో 9..81 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించింది. 2006లో రంజత్‌కుమార్‌ సాధించిన రజతం తర్వాత.. కామన్వెల్త్‌ పారా అథ్లెటిక్స్‌లో భారత స్వర్ణ స్వప్నాన్ని నెరవేర్చింది. కష్టాలను జయించిన షర్మిల ప్రయాణం సమకాలీన క్రీడా చరిత్రలో ఒక స్ఫూర్తి శిఖరంగా నిలిచింది.

నాడు నడిరోడ్డుపై పడేసి అవమానించినప్పుడే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని నిశ్చయించుకున్నాను. ఏ కష్టమూ నన్ను ఆపలేదని నిరూపించుకోవాలనుకున్నాను

ఈ వార్తలు కూడా చదవండి..

పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

For More National News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 02:55 AM