చిక్కిపోయేవారికి సారపప్పు
ABN , Publish Date - May 16 , 2026 | 01:19 AM
సారపప్పునే చారపప్పు అంటుంటారు మనవాళ్లు. మొరలి పండు గింజ లోపల ఈ సారపప్పు ఉంటుంది. మొరలి మొక్కనే చారమామిడి అని కూడా కొన్ని తెలుగు ప్రాంతాల్లో...
భోజన కుతూహలం
సారపప్పునే చారపప్పు అంటుంటారు మనవాళ్లు. మొరలి పండు గింజ లోపల ఈ సారపప్పు ఉంటుంది. మొరలి మొక్కనే చారమామిడి అని కూడా కొన్ని తెలుగు ప్రాంతాల్లో పిలుస్తారు. హిందీవాళ్లు చిరోంజీ అనీ, సంస్కృతంలో ప్రియాల అనీ పిలుస్తారు. సారచెట్టు అడవి మొక్క. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీని పండుని యాప్రికాట్ అంటారు.
సార పండ్లకు ఔషధ గుణాలు ఎక్కువ. తీపి పులుపు రుచులతో జిగురుగా ఉంటుంది. వీటి గుజ్జుని శరీరం క్షీణించిపోయే వ్యాధుల్లో ఇస్తారు. బాదం బంక లాగానే ఈ చెట్టుకీ తుమ్మ లాంటి జిగురు వస్తుంది. ఈ జిగురుని ఎండబెట్టి అమ్ముతారు. కవుకు దెబ్బల్లోనూ, కీళ్ల వాపుల్లోనూ ఈ జిగురుని కడుపులోకి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుతాయి. బాదంపప్పులాగే సారపప్పు తియ్యగా ఉంటుంది. ఇవి శరీరంలో శక్తిని పెంపొందింపచేస్తాయి. వాతాన్ని, వేడినీ తగ్గిస్తాయి. గుండెకి మంచి చేస్త్తాయి. అతిగా తింటే మలబద్ధకాన్ని పెంచుతాయి. ఆలస్యంగా జీర్ణం అవుతాయి. అజీర్తితో బాధపడేవారు అతిగా తింటే కీళ్లవాతం పెరుగుతుంది. వీటి వాడకం మిఠాయిల తయారీ పరిశ్రమలోనే ఎక్కువ. వక్కపొడి, బూందీ మిక్చర్, పాయసంలోనూ ఈ గింజల్ని కలుపుతుంటారు. శరీరానికి మృదుత్వాన్నిస్తాయి. పేగుల కదలికను పెంచుతాయి. అందుకని సరైన మోతాదులో తీసుకుంటే విరేచనం అయ్యేలా చేస్తాయి.
అలాంటి పిల్లలకు...
ఈ గింజల్ని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేగించి, మిక్సీ పట్టిన పొడిని మసాలాలతోపాటు కలిపి వాడుతుంటారు. శుష్కించిపోయే పిల్లలకు వేయించిన సారపప్పు గింజల పొడిని పావు చెంచా నుండి అరచెంచా మోతాదులో గ్లాసు పాలలో కలపాలి. ఆ పాలను రోజూ ఇస్తుంటే ఎదుగుదల బాగుంటుంది. బరువుతగ్గటాన్ని నిరోధిస్తుంది. అలాగని స్థూలకాయాన్ని కలిగించదు.
సారపప్పు... వేడివల్ల వచ్చే అలసటని, పేగుల్లో పెరిగిపోయిన ఉడుకుని తగ్గిస్తుంది. న్యూరోపతి లక్షణాలతో బాధపడేవారికి మేలు చేస్తుంది. అరికాళ్లలో మంటలు, జ్వరం తగ్గుతుంది. పొట్ట నిండినట్టుగా ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకోవటానికి వీలౌతుంది. ఇది పరోక్షంగా షుగరు, స్థూలకాయం వ్యాధులున్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News