కుట్టుమిషన్... గ్లోబల్ విజన్
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:07 AM
ఒక కుట్టుమిషన్‌తో.. పరిమితమైన ఆదాయంతో మొదలైన 27 ఏళ్ల కోమల్ లోండే ప్రయాణం శిక్షణ, సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తూ...
స్ఫూర్తి
ఒక కుట్టుమిషన్‌తో.. పరిమితమైన ఆదాయంతో మొదలైన 27 ఏళ్ల కోమల్ లోండే ప్రయాణం శిక్షణ, సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తూ డిజిటల్ మైక్రోపెన్యూర్‌గా రూపాంతరం చెందింది. గ్రామీణ భారత దేశంలో నిశ్శబ్దంగా విస్తరిస్తున్న డిజిటల్ విప్లవానికి ఆమె కథ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
కోమల్ లోండేది మహారాష్ట్రలోని పూణె నగర శివార్లలో ఉండే ఒక చిన్న గ్రామం. గ్రామీణ భారతదేశంలోని చాలామంది మహిళల్లానే ఆర్థిక ఇబ్బందులు ఆమెకు చిన్నప్పటి నుంచే పరిచయం. అంతమాత్రాన బతుకుదెరువు కోసం ఏదో ఒకటి చేయడం కోమల్‌కు ఇష్టం లేదు. ఆర్థిక స్థిరత్వం సాధించడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలనే బలమైన కోరిక ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. దీంతో మహిళలకు సులువుగా అందుబాటులో ఉండే టైలరింగ్‌ను ఆమె ఎంచుకున్నారు. ఇంట్లోని ఓ చిన్న మూలను వ్యాపార కేంద్రంగా మార్చుకుని సాధారణ కుట్టుమిషన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. బ్లౌజులు కుట్టడం ద్వారా స్వయం ఉపాధికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఆమెకు లభించే ఆదాయం పరిమితంగా ఉండేది. అయితే, రోజువారీ కుటుంబ అవసరాలను తీర్చడానికి అది సరిపోయేది. వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి? తెలిసిన సర్కిల్‌ను దాటి కొత్త మార్కెట్‌ను ఎలా పట్టుకోవాలన్న దానిపై ఆమెకు సరైన మార్గం దొరకలేదు. దేశంలోని లక్షలాదిమంది గ్రామీణ మహిళల్లానే ఆమెకూ ఓ ఆశయం ఉంది.. కానీ దానికి రెక్కలు తొడిగే సరైన వనరులు మాత్రం ఆమెకు దూరంగా ఉన్నాయి.
శిక్షణతో మారిన ప్రయాణం
కోమల్ ఆలోచనలకు 2024లో ఒక స్పష్టమైన మలుపు దొరికింది. గ్లోబల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం ‘మాస్టర్ కార్డ్’, ‘లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్’ సంయుక్తంగా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిర్వహిస్తున్న ‘సశక్తి’ అనే సామర్థ్య పెంపుదల శిక్షణ కార్యక్రమంలో చేరే అవకాశం ఆమెకు లభించింది. అక్కడ లభించిన క్రమబద్ధమైన శిక్షణ ద్వారా కోమల్ సరికొత్త ప్రపంచాన్ని చూశారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? వ్యాపార వృద్ధి కోసం వాట్సాప్ బిజినెస్ ఖాతాలను ఎలా నిర్వహించాలి? కస్టమర్లతో ప్రొఫెషనల్‌గా ఎలా కమ్యూనికేట్ చేయాలి? వంటి ఎన్నో ఆధునిక పద్ధతులపై ఆమెకు పూర్తి అవగాహన వచ్చింది. స్మార్ట్‌ఫోన్ కేవలం కాలక్షేపానికో, వినోదానికో పరిమితమైన సాధనం కాదని, సరైన పద్ధతిలో వాడుకుంటే అదొక శక్తిమంతమైన వ్యాపార పెట్టుబడిగా మారుతుందని ఆమెకు అర్థమైంది. మార్కెట్ అవసరాలను నిశితంగా పరిశీలించిన కోమల్.. తన నైపుణ్యానికి సరికొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కుట్టుపనికే పరిమితమైతే వృద్ధి తక్కువగా ఉంటుందని భావించి కొత్తగా ఆలోచించారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన సంప్రదాయ మహారాష్ట్రీయ ముక్కుపుడకల (నత్తులు) వైపు తన వ్యాపారాన్ని మళ్లించారు. సశక్తి కార్యక్రమం ద్వారా చిన్న ఆర్థిక సాయంతో ఆమె నత్తుల తయారీకి కావాల్సిన ముడిసరుకును సేకరించి కొత్త డిజైన్లతో తన నూతన వ్యాపార ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు.
డిజిటల్ మైక్రో ప్రెన్యూర్‌గా...
సాంకేతికతను నైపుణ్యంతో జోడించినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో కోమల్ నిరూపించింది. తాను తయారుచేసిన నత్తుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాలలో ప్రమోట్ చేయడం ప్రారంభించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటి వ్యాపార పద్ధతులను వేగంగా వంటబట్టించుకున్నారు. ఆ శ్రమ, ఆన్‌లైన్ వ్యూహాలు త్వరగానే మంచి ఫలితాన్ని ఇచ్చాయి. చూస్తుండగానే ఆమె డిజైన్ చేసిన మహారాష్ట్రీయ నత్తులకు ఆన్‌లైన్ వేదికలపై విపరీతమైన ఆదరణ, డిమాండ్ లభించాయి. ఈ సరికొత్త వ్యాపార మోడల్ ద్వారా ఆర్థికంగా ఊహించని విజయాన్ని అందుకున్నారు. మునుపటితో పోలిస్తే ఆమె తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగారు. ఈ మార్పు ఆమె జీవితంలో ఆర్థిక వృద్ధిని మాత్రమే తీసుకురాలేదు.. అంతకంటే గొప్ప సామాజిక మార్పునకు కారణమైంది. ఒకప్పుడు తన సొంత వ్యాపారం గురించి మాత్రమే ఆలోచించిన కోమల్.. ఈ రోజు తన గ్రామంలోని ఇతర మహిళలకు కూడా నత్తుల డిజైనింగ్, తయారీలో శిక్షణ ఇస్తున్నారు. వారికి ఉపాధి మార్గాలు చూపిస్తూ ఆదర్శవంతమైన మెంటార్‌గా మారారు.
ఆత్మవిశ్వాసానికి సరికొత్త రూపం
కోమల్ సాధించిన విజయం ఆమె ఇంటి బడ్జెట్‌ను మార్చడమే కాకుండా.. ఆమె వ్యక్తిత్వానికి సరికొత్త గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు తన కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలలోనూ కీలకమైన భాగస్వామిగా నిలిచారు. పెద్దపెద్ద బిజినెస్ డిగ్రీలు లేకపోయినా నేర్చుకోవాలనే తపన, సాంకేతికతకు అనుగుణంగా తన ఆలోచనా విధానాన్ని మార్చుకునే నైపుణ్యం ఉంటే ఒక చిన్న గ్రామంలో ఉంటూనే ప్రపంచ మార్కెట్‌తో వ్యాపారం చేయవచ్చని కోమల్ నిరూపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News