Share News

‘సేవ’తో మమేకం

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:31 AM

గ్రామీణ ప్రాంతాల గురించి, పేదరికం గురించి ఏమాత్రం అవగాహన లేని దశ నుంచి... 20 రాష్ట్రాల్లో, 38 లక్షల మహిళా కార్మికుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే స్థాయి వరకూ...

‘సేవ’తో మమేకం

గ్రామీణ ప్రాంతాల గురించి, పేదరికం గురించి ఏమాత్రం అవగాహన లేని దశ నుంచి... 20 రాష్ట్రాల్లో, 38 లక్షల మహిళా కార్మికుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే స్థాయి వరకూ...

రీమా నానావతి 42 ఏళ్ల సేవా జీవితంలో అధిగమించిన మైలురాళ్లు ఎన్నో. ‘పద్మశ్రీ’ నుంచి తాజాగా ‘హిల్లరీ రోధమ్‌ క్లింటన్‌ పురస్కారం’ వరకూ పలు గౌరవాలను అందుకున్న రీమా... ‘‘నాకు ధైర్యం, బలం, స్ఫూర్తి భారతీయ గ్రామీణ మహిళలే’’ అంటున్నారు.

అవి ‘సేవ’ (సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌) గ్రామీణ విభాగంలో రీమా నానావతి కార్యకర్తగా చేరిన తొలి రోజులు. గుజరాత్‌లో కరువు బారిన పడిన గ్రామాల్లో ‘సేవ’ తరఫున ఆమె సహాయక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి దృశ్యాలు ఇప్పటికీ కళ్ళముందు కదులుతున్నాయంటారు రీమా. ‘‘పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ ఎండలో కష్టపడి పని చేసిన మహిళలు... ఇళ్ళకు వెళ్ళడానికి బదులు ఊరి చివరకు వెళ్ళి, అక్కడ తుప్పల్లో కొన్ని మొక్కల కోసం వెతికేవారు. ఆ మొక్కల కింద ఉన్న చిన్న దుంపలను తీసుకొనేవారు. రాత్రి చీకటిలోనే ఇళ్ళకు వెళ్ళి, ఆ దుంపలను కడిగి, తరిగి, ఉడికించుకొని తినేవారు. రోజంతా అదే వారికి ఆహారం అనే నిజం నన్ను తీవ్ర వేదనకు గురి చేసింది’’ అని గుర్తు చేసుకుంటారామె.

కథను మార్చిన కథనం...

రీమా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగారు. ఆమె తాతల్లో ఒకరైన మహేంద్రరాయ్‌ నానావతి సుప్రసిద్ధ న్యాయవాది. మహాత్మాగాంధీ ఏర్పాటు చేసిన ‘మహూర్‌ మహాజన్‌ సంఘ్‌’ (టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌- టీఎల్‌ఏ) తరఫున పని చేశారు. మరో తాత శ్యామ్‌ప్రసాద్‌ వాసుదేవ అదే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. తన కుటుంబానికి గాంధేయవాదం, సేవా నేపథ్యం ఉన్నప్పటికీ... ఇరవై ఏళ్ళు దాటేవరకూ సామాజికమైన అవగాహన తనకు చాలా తక్కువని అంటారు రీమా. ‘‘మేము అయిదుగురు అక్కచెల్లెళ్ళం. బయటికి వెళ్తే స్నేహితులు, రెస్టారెంట్లు... జీవితం చాలా హాయిగా గడిచిపోయేది. పట్టణాల్లో పుట్టిన చాలామంది పిల్లల్లా... దేశంలోని పేదరికం గురించి కానీ, గ్రామీణ ప్రజలు మనుగడ కోసం సాగించే పోరాటం గురించి కానీ నాకు ఏమాత్రం తెలీదు’’ అని చెప్పారామె. మైక్రోబయాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాక... జర్మనీలో ఉద్యోగం చేయాలనేది అప్పట్లో ఆమె ఆలోచన. దానికోసం జర్మన్‌ నేర్చుకున్నారు. ఈలోగా సివిల్స్‌ మీద ఆమె దృష్టి పడింది. పట్టుదలగా చదివి... యుపీపీఎస్సీ పరీక్షను క్లియర్‌ చేశారు. ఐఏఎస్‌ అకాడమీలో చేరడానికి కాస్త సమయం ఉంది. ఈలోగా రీమా చదివిన కథనం ఆమె కథను మరోవైపు నడిపించింది.


ఐఏఎస్‌ వదిలేసి...

అహ్మదాబాద్‌లో వ్యర్థాల సేకరణకు ‘సేవ’ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి ఒక పత్రికలో చదివిన రీమా... తను ఆ సంస్థను సందర్శించి, వారు చేస్తున్న సేవలను స్వయంగా చూడాలనుకుంటున్నానని ఆ సంస్థ నిర్వాహకులకు ఒక లేఖ రాశారు. ‘‘ఐఏఎస్‌ ట్రైనింగ్‌కు వెళ్ళడానికి కొన్ని రోజుల ముందు... ‘సేవ’ నుంచి పిలుపు వచ్చింది. వారి ప్రధాన కేంద్రానికి రావచ్చునని, ఆసక్తి ఉంటే... వారి గ్రామీణ విభాగంలో పని చేయవచ్చని సూచించారు. జీతాన్ని కూడా ఆఫర్‌ చేశారు. దాని గురించి చాలా ఆలోచించాను. ఆ సమయంలో గుజరాత్‌లో కరువు చాలా తీవ్రంగా ఉంది. ‘సేవ’ నిర్వహించే సహాయక చర్యల్లో నేను పాల్గొనాల్సి ఉంటుంది. జీతం అంత ఎక్కువ కాదు. పని కూడా కష్టమే. కానీ ఐఏఎస్‌ కావడం కన్నా... అందులోనే నాకు సార్థకత కనిపించింది. ‘ఒక ఏడాది చేసి చూద్దాం’ అనుకున్నాను. వారి ఆఫర్‌ను అంగీకరిస్తూ ఉత్తరం రాశాను’’ అని చెప్పారు రీమా. గుజరాత్‌లో బాగా వెనుకబడిన ప్రాంతమైన బనస్కాంతాలోని రాధాపూర్‌లో... సేవా కార్యకర్తగా కొత్త ప్రయాణాన్ని 1984లో ఆమె ప్రారంభించారు. ‘‘అక్కడ నీటి, విద్యుత్‌ సరఫరాలు అస్తవ్యస్థంగా ఉండేవి. తిండి కూడా సరిగ్గా దొరికేది కాదు. నీటి కాలుష్యం వల్ల చర్మం మీద దద్దుర్లు, తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చేవి. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయేదాన్ని. వారంలో ఆరు రోజులు అక్కడ పని చేసి... వారాంతాల్లో అహ్మదాబాద్‌ వెళ్ళేదాన్ని. అక్కడ నా స్నేహితుల సౌకర్యవంతమైన జీవనం చూసి... ‘నేను దీన్ని ఎందుకు ఎంచుకున్నాను?’ అనిపించేది’’ అంటారు రీమా.

2-navya.jpg

మహిళలకు నిర్ణయాధికారం

మరోవైపు గ్రామస్తులతో ఆమె మమేకమయ్యారు. క్రమంగా వీకెండ్స్‌లో, పండుగల్లో వారితో గడపడం ఆరంభించారు. పూట గడవక కటకటలాడే వారి కష్టాలు చూసి చలించిపోయారు. ఏడాది పూర్తయ్యాక కూడా... ‘సేవ’లోనే కొనసాగాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఐఏఎస్‌ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టారు. ‘సేవ’ వ్యవస్థాపకురాలు, ‘పద్మభూషణ్‌’ పురస్కార గ్రహీత ఇలా భట్‌ నేతృత్వంలో... గ్రామీణ ప్రాంతాల్లో నీటి వసతిని పెంచడం కోసం సమగ్ర నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. మహిళల ఉపాధి కోసం పలు పథకాలను అమలు చేశారు. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి... నిర్ణయాధికారం వారికే ఉండేలా చర్యలు చేపట్టారు. తన నిబద్ధతతో, కార్యదీక్షతో... ‘సేవ’లో అంచలంచెలుగా ఎదిగారు. 1999లో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజరాత్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎ్‌ఫఎడి)లతో కలిసి 2001లో గుజరాత్‌ భూకంప బాధితుల కోసం, వారి కుటుంబాల కోసం రీమా చేపట్టిన ‘జీవిక’ ప్రాజెక్ట్‌ కొన్ని లక్షల మందికి కొత్త జీవితాన్ని అందించింది. అలాగే 2002లో గుజరాత్‌ అల్లర్ల బాధితుల కోసం ఆమె రూపొందించిన ‘శాంత’ ప్రాజెక్ట్‌ కూడా మన్ననలు అందుకుంది. అలా ఆమె సారథ్యంలో ఎన్నో ప్రాజెక్ట్‌లు విజయవంతంగా అమలయ్యాయి. రీమా సేవలకు గుర్తింపుగా 2013లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ అవార్డు’తో ఆమెను సత్కరించింది.


విదేశాల్లోనూ...

ప్రస్తుతం ‘సేవ’కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రీమా నేతృత్వంలో ఆ సంస్థ మన దేశంలో తెలంగాణ సహా 20 రాష్ట్రాల్లో పని చేస్తోంది. దాదాపు అయిదువేల స్వయం సహాయక సంఘాలు, 160కి పైగా సహకార సంఘాలు, దాదాపు 20 ఆర్థిక సమాఖ్యలతో ఇది విస్తరించింది. సుమారు 38 లక్షల మంది అసంఘటిత రంగ మహిళా కార్మికులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. చేతివృత్తులు, గృహోపకరణాలు, దుస్తులు... ఇలా ఎన్నో ఉత్పత్తుల తయారీలో మహిళలకు శిక్షణ, ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడానికి ఎన్నో పథకాలను సేవా ద్వారా ఆమె అమలు చేస్తున్నారు. ‘‘కార్మికులుగా, మహిళలుగా వారి అవసరాలను నెరవేర్చడం, వారి సాధికారతకు దోహదపడడం మా లక్ష్యం’’ అని చెబుతున్న రీమా... ఆప్ఘనిస్తాన్‌, శ్రీలంక, భూటాన్‌ దేశాల్లో భూకంప బాధితులైన మహిళల పునరావాసం ఉపాధి కోసం కృషి చేశారు. ప్రపంచ బ్యాంక్‌ సహా అనేక అంతర్జాతీయ సంస్థల సలహా మండళ్ళలో సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ‘హిల్లరీ రోధమ్‌ క్లింటన్‌’ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. ‘‘నేను యాదృచ్ఛికంగా ప్రవేశించిన ‘సేవ’ సంస్థే ఇప్పుడు నాకు సర్వస్వం. ‘సేవ’ వ్యవస్థాపకురాలు ఇలా భట్‌ నన్ను ఎంతో ప్రోత్సహించారు. అదే ప్రోత్సాహాన్ని ఆమె కుమారుడు, నా భర్త మిహిర్‌ భట్‌ అందిస్తున్నారు. మాకు ఇద్దరు అబ్బాయిలు. వారు కూడా సేవలో భాగస్వాములయ్యారు. ఇన్నేళ్ళుగా నన్ను నడిపిస్తున్నది గ్రామీణ మహిళలే. నాలోని సృజనాత్మకత, ధైర్యం, శక్తి... అంతా వారి చలువే’’ అంటారు 62 ఏళ్ళ రీమా.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 18 , 2026 | 05:31 AM