నెలలు నిండకున్నా నిండైన ఆరోగ్యం
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:05 AM
పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికి కారణం తల్లుల్లో ఉండొచ్చు, పిల్లల్లో ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితులను ముందుగానే పసిగట్టి, సమర్థమైన వైద్య సహాయం అందించగలిగితే, తల్లీ, బిడ్డా ఇద్దరికీ...
నియోనేటల్
పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికి కారణం తల్లుల్లో ఉండొచ్చు, పిల్లల్లో ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితులను ముందుగానే పసిగట్టి, సమర్థమైన వైద్య సహాయం అందించగలిగితే, తల్లీ, బిడ్డా ఇద్దరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చంటున్నారు వైద్యులు. సాధారణంగా 40 వారాలు నిండిన తర్వాత ప్రసవమవుతూ ఉంటుంది. అయితే 36 వారాలు, అంతకంటే ముందు పుట్టే పిల్లలను ప్రిమెచ్యూర్ బేబీస్ అనాలి. గర్భిణికి ఇన్‌ఫెక్షన్లు, అధిక రక్తపోటు, మధుమేహం మందులతో నియంత్రణలోకి రానప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో, తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రసవం చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ పరిస్థితి తలెత్తవచ్చు. ఆమ్నియాటిక్ శాక్ చిరిగిపోయి, ఉమ్మనీరు కారిపోయే పరిస్థితి తలెత్తినప్పుడు కూడా ప్రసవం చేయవలసి రావచ్చు. అయితే ఇలా అత్యవసరంగా ప్రసవం చేయవలసిన పరిస్థితికి దారితీసే అంశాలను ముందుగానే గమనించుకోగలిగితే, వాటిని అరికట్టడం ద్వారా నెలలు నిండకుండా ప్రసవమైపోయే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవచ్చు.
బిడ్డ పరిణతి కోసం.. ‘యాంటినేటల్ స్టిరాయిడ్స్’
గర్భిణుల్లో రక్తపోటు విపరీతంగా పెరిగిపోయినా, రక్తపోటుతో పాటు ఫిట్స్ కనిపించినా, ఆమ్నియాటిక్ శాక్ చిరిగిపోయి ఉమ్మనీరు కారిపోతున్నా, తల్లి నుంచి బిడ్డకు వెళ్తే రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడినా, మధుమేహం అదుపులోకి రాకపోయినా యాంటినేల్ స్టిరాయిడ్ ఇంజ్షెన్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 24 నుంచి 34/36 వారాల ప్రిమెచ్యూర్ ప్రెగ్నెన్సీల్లో ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా తల్లికీ, కడుపులో పెరిగే బిడ్డకూ రక్షణ కల్పించవచ్చు. లక్షణాలు కనిపించిన వెంటనే 24 గంటల వ్యవధితో రెండు ఇంజెక్షన్స్ ఇచ్చి, మరో 24 గంటల తర్వాత, సర్జరీ లేదా ప్రసవం చేయవలసి ఉంటుంది. సాధారణంగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఊపిరితిత్తులు పూర్తిగా పరిణతి చెంది ఉండవు. కాబట్టి పుట్టిన వెంటనే వెంటిలేటర్ అవసరమవుతూ ఉంటుంది. అలాగే ప్రిమెచ్యూర్ బేబీస్ మెదడు ఎదుగుదల గురించి కూడా మనలో ఎన్నో అనుమానాలుంటాయి. అయితే ప్రసవానికి రెండు రోజుల ముందు ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కడుపులో పెరిగే బిడ్డ ఊపిరితిత్తులు, మెదడు 50ు మేరకు పరిణతి చెంది, ప్రసవం తర్వాత బిడ్డకు వెంటిలేటర్ అవసరం తప్పుతుంది. మెదడులో రక్తస్రావమయ్యే పరిస్థితి కూడా తప్పి, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
గోల్డెన్ అవర్‌లో...
నెలలు నిండకుండా బిడ్డ పుట్టిన తర్వాత మొదటి గంట సమయం ఎంతో విలువైనది, కీలకమైనది. బిడ్డ ఏడ్వకపోవడం, ఊపిరి తీసుకోలేకపోవడం, డొక్కలు ఎగరేయడం లాంటి ఇబ్బందులు మొదలుకావచ్చు. ప్రధానంగా ఊపిరితిత్తులు బహీనంగా ఉండడం వల్ల శ్వాసకు సంబంధించి ‘రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్’ తలెత్తవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ‘సిపాప్’ లాంటి నాన్ ఇన్వేసివ్ టెక్నిక్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. సిపా్‌పతో బిడ్డ శ్వాస సమస్య తొలగిపోతుంది. అయితే ఇందుకోసం ప్రిమెచ్యూర్ డెలివరీని ముందుగానే అంచనా వేయగలగాలి. అన్ని అత్యాధునిక సదుపాయాలూ కలిగిన ఆసత్రిని ఎంచుకోవాలి. అప్పుడే తల్లీ, బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం! ఇలా కాకుండా బిడ్డ పుట్టిన మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకువెళ్లి, ఎంత సమర్థమైన చికిత్స అందించినా ఫలితాలు అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రిమెచ్యూర్ డెలివరీ అవకాశం ఉన్న గర్భిణులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఈ ఇంజెక్షన్... వండర్ డ్రగ్
నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లు శ్వాస తీసుకోలేరు. కాబట్టి గతంలో పెద్దల మాదిరిగానే వెంటిలేటర్‌ను అమర్చేవారు. కానీ నేడు సిపా్‌పతో పాటు, నేరుగా ఊపిరితిత్తుల లోపలకు సర్ఫెక్టెంట్ ఇంజెక్షన్‌ను ఇవ్వగలుగుతున్నారు. సాధారణంగా నెలలు నిండిన తర్వాత పుట్టే పిల్లలకు ఊపిరితిత్తుల్లోని గాలి తిత్తులకు ద్రవంతో కూడిన పైపూత ఏర్పడుతుంది. దాంతో ఉపరితల తన్యత తగ్గి, ఊపిరితిత్తులు కొలాప్స్ అయిపోకుండా ఉంటాయి. అయితే నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఈ ద్రవం ఏర్పడదు. కాబట్టి బిడ్డ పుట్టిన గంటలోపే బయటి నుంచి నేరుగా లంగ్స్ లోపలకు ఇంజెక్షన్ ద్వారా సర్ఫెక్టెంట్‌ను ఇవ్వవలసి వస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన ఒకట్రెండు గంటల్లోనే బిడ్డ ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.
టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, పాలు తాగలేరు, పాలిచ్చినా, వాటిని జీర్ణం చేసుకోలేరు. కాబట్టి ఈ పిల్లలకు ఒకట్రెండు వారాల పాటు, రక్తనాళాల ద్వారా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్‌ను ఇవ్వాల్సి వస్తుంది. సాధారణంగా పాలు జీర్ణమై, ఏ స్థితిలో రక్తంలోకి చేరుకుంటాయో, ఈ పోషకాలు ఆ స్థితిలోనే ఉంటాయి. కాబట్టి బిడ్డకు పరిపూర్ణ పోషణ సమకూరుతుంది.

కృత్రిమ మేధస్సు సహాయంతో...
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలతో పాటు, నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లలకు కూడా ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు మరింత తీవ్రమై బిడ్డ ఆరోగ్యం విషమించడానికంటే ముందు అప్రమత్తమై చికిత్స చేయడంలో కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందుకు కొన్ని లక్షల ఖరీదైన ఎఐ డివైజెస్ అందుబాటులోకొచ్చాయి. వైద్యులు బిడ్డలో కనిపించే వేర్వేరు వివరాలను వీటికి అందించినప్పుడు, వాటి ఆధారంగా బిడ్డ హృదయ స్పందన వివరాలను విశ్లేషించి, ముంచుకురాబోయే ముప్పును ముందుగానే హెచ్చరిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు పెరిగిపోయి, రక్తపోటు పడిపోయి, బహుళ అంతర్గత అవయవాల పనితీరు క్షీణించే పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి ఈ డివైజ్‌లు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
పుట్టిన గంట లోపు లెవల్ 3, లెవల్ 4 ఎన్‌ఐసియు సౌకర్యాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగి ఉండి, 24/7 వైద్య పర్యవేక్షణ కలిగి ఉండే ఆస్పత్రిని ఎంచుకుని, మెరుగైన వైద్యాన్ని అందించగలిగితే, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు. ఇలా అన్ని సదుపాయాలూ కలిగిన ఆస్పత్రిని ఎంచుకోగలిగితే, 500 గ్రాముల బరువుతో పుట్టిన పిల్లలను కూడా బ్రతికించుకోగలిగే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా కిలో బరువుతో పుట్టిన పిల్లలు బ్రతకరనీ, ఒకవేళ బ్రతికినా, భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు సర్వత్రా నెలకొని ఉంటున్నాయి. కానీ పుట్టిన వెంటనే సమర్థమైన వైద్యం అందించగలిగితే, నెలలు నిండకుండా పుట్టే పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగే ఆరోగ్యంగా ఎదగగలుగుతారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి పసికందులకు తేనె, కరక్కాయ లాంటివి పట్టిస్తూ ఉంటారు. వీటితో మూత్రపిండాలు, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటి వాడకం మానేయాలి రొమ్ముపాలు: బిడ్డకు ఆరె నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలి
ధూపం: పసికందుల ఊపిరితిత్తులు సున్నితంగా ఉంటాయి. కాబట్టి ధూపాలు వేయకూడదు. వీటితో పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుకునే ప్రమాదం ఉంటుందిముక్కు, చెవుల్లో నూనెలు: పసికందుల ముక్కు, చెవుల్లో నూనెలు వేయకూడదు
ఆముదం: బిడ్డకు విరోచనం కానప్పుడు, ఆముదం తాగిస్తూ ఉంటారు. ఇదెంతో ప్రమాదకరం. ఆముదంతో మూత్రపిండాలు పాడవుతాయి
ప్రమాద హెచ్చరికలు: బిడ్డ ఆరు నుంచి ఎనిమిది గంటలు పాలు తాగకపోయినా, లేపుతున్నా మేల్కోకపోయినా, డొక్కలు ఎగరేస్తున్నా, ఊపిరి తీసుకోలేకపోతున్నా, చేతులు, కాళ్లు చల్లబడినా, కామెర్లు ఎక్కువైనా, నెలలోపు పిల్లల్లో జ్వరం కనిపించినా, విరోచనం తెల్లగా అవుతున్నా, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.
ఈ అపోహలు వీడాలి
పసికందుల బరువు: తల్లితండ్రుల ఎత్తు, బరువు, వంశపారంపర్య అంశాల మీదే పుట్టబోయే పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. తక్కువ ఎత్తు, బరువున్న తల్లితండ్రులకు పుట్టే పిల్లలు రెండు కిలోల బరువుతో పుట్టినా వాళ్లు కూడా మిగతా పిల్లల మాదిరిగానే పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.
భవిష్యత్తు సమస్యలు: నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఎప్పటికీ ఆరోగ్య సమస్యలు తప్పవని అనుకోకూడదు. పుట్టిన తర్వాత, వీలైనంత త్వరగా సమర్థమైన వైద్యం అందించగలిగితే ఈ పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగే పూర్తి ఆరోగ్యంగా ఎదుగుతారు.
డాక్టర్ సాయి సునీల్ కిషోర్
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్,
నియోనాటాలజీ అండ్ పిడియాట్రిక్స్,
మెడికవర్ హాప్పిటల్స్ వైజాగ్ క్లస్టర్.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News