Share News

న్యుమోనియా నియంత్రణ ఇలా...

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:44 AM

60% పిల్లల న్యుమోనియా మరణాలకు పోషకాహార లోపం కారణమనీ, 70 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో న్యుమోనియాకు గాలి కాలుష్యం, ధూమపానాలు ప్రధాన కారణమనీ...

న్యుమోనియా నియంత్రణ ఇలా...

హోమియోపతి

60% పిల్లల న్యుమోనియా మరణాలకు పోషకాహార లోపం కారణమనీ, 70 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో న్యుమోనియాకు గాలి కాలుష్యం, ధూమపానాలు ప్రధాన కారణమనీ గణాంకాలు చెప్తున్నాయి. అయితే సమర్థమైన హోమియో చికిత్సతో ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసే వీలుందని అంటున్నారు వైద్యులు.

ఊపిరితిత్తులకు సోకే తీవ్ర ఇన్‌ఫెక్షన్‌... ‘న్యుమోనియా’. దీని వల్ల ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు వాపుకు గురై, ద్రవం లేదా చీముతో నిండిపోతాయి. న్యుమోనియా సంక్రమించడానికి కారణమయ్యే సూక్ష్మజీవి లేదా పరిస్థితుల ఆధారంగా ఈ వ్యాధిని పలు రకాలుగా వర్గీకరిస్తారు. అవేంటంటే...

బ్యాక్టీరియల్‌ న్యుమోనియా: స్ట్రెప్టోకోకస్‌ బ్యాక్టీరియా వల్ల ఈ న్యుమోనియా సోకుతుంది. సాధారణ బ్యాక్టీరియా కారకాల్లో ఇదొకటి. అయితే ఇతర బ్యాక్టీరియాల వల్ల కూడా న్యుమోనియా సోకవచ్చు.

వైరల్‌ న్యుమోనియా: ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌, రెస్పిరేటరీ సెన్సిటియల్‌ వైరస్‌, కొవిడ్‌ 19కు కారణమైన సార్స్‌ కొవ్‌ 2 వైరస్‌ కారక న్యుమోనియా సోకినప్పుడు, రోగి పరిస్థితి ఆధారంగా నిర్దిష్ట యాంటీ వైరల్‌ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఫంగల్‌ న్యుమోనియా: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికీ, పర్యావరణ శిలీంధ్రాలకు గురైన వారికీ ఈ రకం న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువ. యాంటీ ఫంగల్‌ మందులతో చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది.

ఆస్పిరేషన్‌ న్యుమోనియా: ఆహారం, ద్రవాలు, లాలాజలం, వాంతి, లేదా ఆహార పదార్థాలు దిగువ శ్వాసనాళంలోకి ప్రవేశించి, ఇన్‌ఫ్లమేషన్‌ను కలిగించినప్పుడు ఆస్పిరేషన్‌ న్యుమోనియా తలెత్తుతుంది.


ఆస్పత్రిలో సంక్రమించే న్యుమోనియా:

ఆస్పత్రిలో చేరే సమయానికి ఈ వ్యాధి లేకపోవచ్చు లేదా ముదిరే దశలో ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సాధారణంగా వాడుకునే యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన బ్యాక్టీరియా కూడా ఈ న్యుమోనియాను కలిగించవచ్చు.

స్పష్టమైన లక్షణాలు

  • తీవ్రమైన దగ్గు. దగ్గుతో పాటు పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు కఫం కనిపించడం.

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస అందక ఇబ్బంది పడడం.

  • శ్వాస తీసుకుంటున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి.

  • 65 ఏళ్లు పైబడిన పెద్దల్లో జ్వరానికి మించి మానసిక గందరగోళం, ఆలోచనా శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • పిల్లలు పాలు తాగకుండా ఏడుస్తూ ఉంటారు. శ్వాస తీసుకునేటప్పుడు పక్కటెముకలు లోపలకు లాక్కుపోతూ ఉంటాయి.

నివారణ మార్గాలు

టీకాలు: న్యుమోనియా నివారణకు అత్యంత ప్రభావవంతమైన మార్గమిది. పిల్లలకు న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌, పెంటావాలెంట్‌ వాక్సిన్‌ వేయించాలి. 65 ఏళ్లు పైబడిన పెద్దలకు, ఊపిరితిత్తులు, గుండె వ్యాధులున్నవారు న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

పరిశుభ్రత: ఆహారం తినే ముందు, బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోవాలి. లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ధూమపానం: ధూమపానంతో ఊపిరితిత్తుల సహజ రక్షణ వ్యవస్థ దెబ్బ తింటుంది. దాంతో సులభంగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి.

రోగనిరోధక శక్తి: సమతులాహారం, కంటి నిండా నిద్ర, క్రమం తప్పని వ్యాయామంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది.

కాలుష్యం: ఇండోర్‌, ఔట్‌డోర్‌ వాయు కాలుష్యాలకు దూరంగా ఉండాలి. అవసరమైతే మాస్క్‌ పెట్టుకోవాలి.

తల్లిపాలు: పుట్టిన మొదటి ఆరు నెలల వరకూ పసికందులకు తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వల్ల, రోగనిరోధకశక్తి పెరిగి న్యుమోనియా ముప్పు తప్పుతుంది.


హోమియో చికిత్స

లక్షణాల ఆధారంగా హోమియోలో పలు రకాల ఔషథాలున్నాయి. అవేంటంటే...

  • ఎకోనైట్‌: వ్యాధి హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, చలితో మొదలవుతుంది. రోగిలో ఆందోళన పెరిగిపోతుంది.

  • బెలడోనా: తీవ్రమైన జ్వరం, ముఖం ఎర్రబడడం, గొంతు నొప్పి లేదా పొడి ఉన్నప్పుడు ఇవ్వాలి.

  • బ్రయోనియా: ఛాతీలో తీవ్రమైన నొప్పి, కదిలినప్పుడు నొప్పి పెరుగుతూ ఉంటుంది. విపరీతమైన దాహం, పొడి దగ్గు ఉన్నప్పుడు ఈ ఔషథం ఇవ్వాలి.

  • ఇపికాక్‌: పసిపిల్లల్లో న్యుమోనియాకు తగిన మందు. దగ్గుతో పాటు వికారం, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలకు ఈ ఔషథం ఇవ్వాలి.

  • ఫాస్ఫరస్‌: ఛాతీలో బరువు, ఆయాసం, దగ్గినప్పుడు రక్తం చారికలతో కూడిన కఫం, అధిక దాహం.

  • యాంటిమోనియం టార్టారికం: కఫం ఎక్కువగా పేరుకుపోయి, శ్వాస కష్టమవుతూ, శ్వాస తీసుకునేటప్పుడు గుర గుర శబ్దం వినిపిస్తూ, కఫం బయటకు రాదు.

  • ఆర్సెనికం ఆల్బం: చల్లని పానీయాలతో లక్షణాలు తీవ్రమవుతాయి. అర్థరాత్రి దగ్గుతో పాటు రొప్పు కనిపిస్తుంది. ఛాతీలో మంట, అస్థిమితం, చమటలు, నీరసం, దాహం.

డాక్టర్‌ గన్నం రాజు దుర్గాప్రసాద్‌ రావు

సీనియర్‌ హోమియోపతి వైద్యులు,

నిత్య హోమియోపతి,

కుత్బిగూడ, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 04:45 AM