పిల్లల పర్యావరణ పాఠాలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:51 AM
ప్లాస్టిక్ వ్యర్థాలు... వాడి పడేసిన వస్తువులు... పర్వత ప్రాంతాల్లో రోడ్డు పక్కన కనిపించిన దృశ్యాలు చూసి ఇద్దరు బాలికలు స్పందించారు. ఎవరో వచ్చి ఏదో చేయాలని...
స్ఫూర్తి
ప్లాస్టిక్ వ్యర్థాలు... వాడి పడేసిన వస్తువులు... పర్వత ప్రాంతాల్లో రోడ్డు పక్కన కనిపించిన దృశ్యాలు చూసి ఇద్దరు బాలికలు స్పందించారు. ఎవరో వచ్చి ఏదో చేయాలని ఆశించకుండా... చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేశారు. ఆరేళ్ల కిందట వారు వేసిన ఆ తొలి అడుగుకు ఇప్పుడు వందల అడుగులు జత కలిశాయి. అది ఒక ఉద్యమంలా మారి... ‘పౌడీ ఎకో వారియర్స్’గా అవతరించి... పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించేందుకు స్ఫూర్తి నింపిన విద్యార్థినులు మాన్వి రావత్, అన్షిక గౌర్ జర్నీ ఇది.
‘‘ఉత్తరాఖండ్... పౌడీ గఢవాల్... పర్వత ప్రాంతం. కనుచూపు మేర పచ్చదనంతో అద్భుతంగా ఉండేది. ఇక్కడే పుట్టి పెరిగిన మాకు ప్రకృతి ఒడిలో సేద తీరిన అనుభూతి కలిగేది. క్రమంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. రోడ్డుపై వెళుతుంటే పక్కన చెత్త కుప్పలు పేరుకుపోయి మా పట్టణాన్ని కళావిహీనం చేశాయి. నీటి ప్రవాహాల్లో, కాలువలు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తేలేవి. రోజూ బడికి వెళ్లేటప్పుడు ఆ చెత్తాచెదారం చూసి బాధ కలిగేది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుంది. వరదలు సంభవిస్తే వ్యర్థాలన్నీ నివాసిత ప్రాంతాలను ముంచెత్తుతాయి. కాలువలు, డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డుపడి పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. చాలా రోజులు చూశాం... ఎవరైనా చొరవ తీసుకొంటారేమోనని. అందరూ ఎవరి దారిన వారు వెళుతున్నారే కానీ, సమస్యను పట్టించుకోవడంలేదు. కనీసం అటువైపు ఒకసారి చూసే తీరిక కూడా ఎవరికీ లేదు. ఎవరికివారు అది తమ పని కాదన్నట్టు, మున్సిపాలిటీవారి మీద నెపం నెట్టేసి చేతులు దులుపుకొంటున్నారు. కొంతైనా మార్పు తేవాలన్న ఉద్దేశంతో మేమిద్దరం చేతులు కలిపాం. తొలి ప్రయత్నంగా రోడ్డు పక్కన ఉన్న చెత్తంతా ఏరి, డంబ్పయార్డ్కు తరలించాం. నీటి గుంటలు, చిన్న చిన్న కాలువల్లో పేరుకున్న వ్యర్థాలను తొలగించాం.
వెక్కిరించినా...
మొదట్లో మమ్మల్ని చూసి దారినపోయేవారు, ముఖ్యంగా తోటి విద్యార్థులు వెక్కిరించేవారు. చులకనగా మాట్లాడేవారు. వారిని చూసి మాతో కలిసిరావడానికి ఇతరులు జంకేవారు. అవన్నీ పట్టించుకొంటే మా లక్ష్యం దెబ్బతింటుందని భావించాం. మేం తలపెట్టిన కార్యాన్ని మధ్యలో వదిలేయకూడదని అనుకున్నాం. కార్యక్షేత్రంలోకి దిగాం. సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీగా మేము చేస్తున్న ప్రయత్నం కొందరు స్థానికులనూ, విద్యార్థులనూ కదిలించింది. చుట్టుపక్కల ప్రాంతాలవారి దృష్టిని ఆకర్షించింది. అది మాకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. దీన్ని ఉద్యమంలా చేపట్టాలనే ఉద్దేశంతో 2020లో ‘పౌడీ ఎకో వారియర్స్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాం.
పది వేల మొక్కలు...
పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ హితం కోసం నెలకొల్పిన ఈ సంస్థకు కొద్ది కాలంలోనే అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ముఖ్యంగా జెజ్ జీ ఉత్సాహంగా స్పందించింది. ప్రస్తుతం సంస్థలో నలభై మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. మేం చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది. వీధులు, నదులను శుభ్రపరచడం, పర్వత ప్రాంత అడవుల పునరుద్ధరించడం, వన్యప్రాణుల సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, గ్రీన్ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఈ ఆరేళ్ల కాలంలో పది వేల మొక్కలు నాటాం. 500 మంది వాలంటీర్లతో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించాం. భవిష్యత్తులో మా సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం.
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News