చీకటి బతుకుల్లో ‘అమ్మ’ వెలుగులు
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:52 AM
అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల కొండ ప్రాంతాల్లో ‘మత్తు’తో ఛిద్రమవుతున్న జీవితాలకు ఆమె ఒక భరోసా. పేదరికాన్ని జయించి.. వందలాదిమంది యువతను ఆ రక్కసి నుంచి...
అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల కొండ ప్రాంతాల్లో ‘మత్తు’తో ఛిద్రమవుతున్న జీవితాలకు ఆమె ఒక భరోసా. పేదరికాన్ని జయించి.. వందలాదిమంది యువతను ఆ రక్కసి నుంచి కాపాడారు. వేలాదిమంది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించిన ఆ ఆదర్శమూర్తి మరెవరో కాదు..
జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్. దశాబ్దాలుగా ఆమె సాగిస్తున్న ఈ నిశ్శబ్ద విప్లవానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
జుమ్డే జీవితం పూలబాట ఏమీ కాదు. 1965 ఫిబ్రవరి 1న అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా, అకేర్ యోమ్‌గామ్ అనే ఒక చిన్న మారుమూల గ్రామంలో ఆమె జన్మించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబంలో ఒక్కసారిగా అంధకారం నెలకొంది. రోజు గడవడమే గగనంగా మారిన ఆ రోజుల్లో చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, ఫీజుల కోసం చిన్నతనంలోనే జుమ్డే కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు తీవ్ర పేదరికం, మరోవైపు కొండప్రాంతాల్లోని కఠినమైన జీవన పరిస్థితులు ఆమెను శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చాయి. ఈ కష్టాలే ఆమెను సేవామూర్తిగా మార్చాయి.
ప్రభుత్వ అధికారిగా...
1980లో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో ‘గ్రామ సేవిక’గా దిగువస్థాయి ఉద్యోగంతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఈ జీవితానికి ఇది చాలని సరిపెట్టుకునే చాలామంది మనకు కనిపిస్తారు. కానీ, గామ్లిన్ మాత్రం తనకు లభించిన ప్రతి అవకాశాన్ని ప్రజా సేవకే ఉపయోగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ మహిళలకు అవగాహన కల్పించడం, పిల్లల ఆరోగ్యంపై దృష్టిసారించడం ఆమె నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో 35 ఏళ్లపాటు సేవలు అందించిన గామ్లిన్ క్రమంగా ‘చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్’ స్థాయికి ఎదిగారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న పరిమితులు తన సేవా కార్యక్రమాలకు అడ్డుకాకూడదని భావించిన ఆమె.. తన సర్వీసు ముగియడానికి ముందే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. పెన్షన్ పొందుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి బదులు.. ముళ్లబాట లాంటి సామాజిక సేవను ఎంచుకున్నారు.
మత్తుపై యుద్ధభేరి
ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 2013లో వెస్ట్ సియాంగ్ జిల్లాలోని ‘ఆలో’ ప్రాంతంలో ‘మదర్స్ విజన్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో స్థానిక మహిళలతో ఒక చిన్న కమ్యూనిటీ ఆధారిత సంస్థగా ఇది ప్రారంభమైంది. ఆ రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది గమనించిన గామ్లిన్ మత్తుపై యుద్ధం ప్రకటించారు. ‘మదర్స్ విజన్’ ఆధ్వర్యంలో 30 పడకల డి-అడిక్షన్, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మత్తుకు బానిసలైన వారిని సమాజం నేరస్థులుగా, అంటరానివారిగా చూస్తున్న తరుణంలో.. ఆమె మాత్రం వారిని బాధితులుగా గుర్తించారు. శిక్షించడం ద్వారా కాకుండా ప్రేమ, కౌన్సెలింగ్, వైద్య సాయంతోనే వారిని మార్చవచ్చని నమ్మారు. ఇప్పటి వరకు ఈ కేంద్రం ద్వారా 700 మందికిపైగా యువకులు డ్రగ్స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని, మళ్లీ తమ కుటుంబాల వద్దకు చేరుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాకుండా గంజాయి, నల్లమందు అక్రమ సాగును అరికట్టేందుకు స్థానిక గిరిజన పెద్దలను, మహిళా వలంటీర్లను ఏకం చేసి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు చేపట్టారు.
లక్షలాదిమంది ‘అమ్మ’గా...
జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ సాధించిన విజయం వెనుక భారీ బడ్జెట్‌లు కానీ, కార్పొరేట్ నిధులు కానీ లేవు. కేవలం ఆత్మీయత, క్షేత్రస్థాయిలో సంబంధాలు, సమాజ భాగస్వామ్యమే ఆమె సాధనాలుగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన ‘పద్మశ్రీ’ పురస్కారం ఆమెకు దక్కిన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు.. ఈశాన్య రాష్ట్రాల్లో నిశ్శబ్దంగా సేవ చేస్తున్న వేలమంది గ్రామీణ మహిళా కార్యకర్తలకు దక్కిన గొప్ప గుర్తింపు. ఒక సాదాసీదా గ్రామీణ సేవకిగా ప్రయాణం ప్రారంభించి అరుణాచల్ కొండల్లో లక్షలాదిమందికి ‘అమ్మ’గా మారిన గామ్లిన్ జీవితం.. దేశంలోని ప్రతి పౌరుడికి ఒక గొప్ప స్ఫూర్తిపాఠం.
ఆర్థిక స్వావలంబన
మహిళ శక్తిమంతంగా మారితేనే కుటుంబం, ఆ తర్వాత సమాజం బాగుపడుతుందనేది గామ్లిన్ నమ్మకం. అందుకే డి-అడిక్షన్ సెంటర్లకే పరిమితం కాకుండా మహిళా సాధికారతకు ఆమె నడుంబిగించారు. గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి మార్గాలు చూపించేందుకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వారికి కుట్టుపని, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులు, హస్తకళలు, కొవ్వొత్తుల తయారీ, స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక సాయం, మార్కెటింగ్ సదుపాయాలను కూడా కల్పించారు. ఇప్పటి వరకు 2 వేల మందికిపైగా మహిళలు ఈ శిక్షణ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి, తమ పిల్లలకు మంచి చదువు చెప్పించుకునే స్థాయికి ఎదిగారు. భర్త తాగుడు వల్ల వీధిపాలైన ఎన్నో కుటుంబాలకు ఈ ఉపాధి కార్యక్రమాలు కొండంత అండగా నిలిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
For More National News And Telugu News