ఆమె పోరాటానికి ‘చట్టం’ దిగివచ్చింది
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:28 AM
దేశం కాని దేశంలో విద్య కోసం, ఉపాధి కోసం వెళ్ళి... అక్కడి వ్యవస్థపై పోరాడిన సాహసి దీపా భట్టారాయ్. నేపాల్ నుంచి అమెరికా వచ్చిన ఆమె... తన వ్యాపారాన్ని మూసేయించిన...
దేశం కాని దేశంలో విద్య కోసం, ఉపాధి కోసం వెళ్ళి... అక్కడి వ్యవస్థపై పోరాడిన సాహసి దీపా భట్టారాయ్. నేపాల్ నుంచి అమెరికా వచ్చిన ఆమె... తన వ్యాపారాన్ని మూసేయించిన మిసిసిపీ స్టేట్ బోర్డును కోర్టులో సవాల్ చేసి విజయం సాధించారు. అక్కడి చట్టాల మార్పుకు దోహదం చేసి... ఎంతోమందికి కొత్తదారి చూపించారు. దీప జీవితంపై రూపొందిన డాక్యుమెంటరీ ఇటీవల అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శితమై... ఆమె తెగువను మరోసారి లోకానికి చాటిచెప్పింది.
‘‘అమెరికాలో పదమూడేళ్ళ క్రితం మొదటిసారి కాస్త భయంగానే అడుగుపెట్టాను. ఏమాత్రం పరిచయం లేని దేశం, సంస్కృతి. మరోవైపు అంతంతమాత్రమైన ఆర్థిక పరిస్థితి. అయితే పెద్ద చదువులు చదివి, జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలనే నా కలకు అవేవీ అవరోధాలు కావని గట్టిగా నమ్మాను’’ అని చెబుతారు దీపా భట్టారాయ్. నేపాల్‌కు చెందిన ఆమె... ‘మిసిసిపీ యూనివర్సిటీ ఫర్ ఉమెన్’లో బ్యాచిలర్ డిగ్రీ చదవడం కోసం 2013లో... అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రం కొలంబస్ నగరానికి వచ్చారు. యూనివర్సిటీలోని తోటి విద్యార్థులతో తొందరలోనే చక్కగా కలిసిపోయారు. దీప మేకప్, కనుబొమల్ని తీర్చిదిద్దుకొనే తీరు వారిని బాగా ఆకర్షించాయి. తన రూమ్‌మేట్ కోరిక మేరకు... ఆమె కనుబొమలకు దీప థ్రెడింగ్ చేశారు. ‘‘ఐబ్రో థ్రెడింగ్ అంటే... కాటన్ దారం సాయంతో వెంట్రుకలను తొలగించడం ద్వారా కనుబొమలను తీర్చిదిద్దే ఒక ప్రక్రియ. ఇది ఆగ్నేయాసియాలో బాగా అభివృద్ధి చెందింది. నేను నేపాల్‌లో చిన్నప్పటినుంచీ ఆ పని చేసేదాన్ని. అమెరికాలో నా రూమ్‌మేట్ కోసం మొదటిసారి చేశాను. ఆమె సంతోషంగా కొంత డబ్బు ఇచ్చింది. మిసిసిపీలో ఆ పని చేసేవారు పెద్దగా లేరు. అది నాకు అవకాశంగా కనిపించింది’’ అని గుర్తు చేసుకున్నారు దీప.
వరుస తిరస్కరణలు
ఆ తరువాత ఖాళీ సమయాల్లో ఐబ్రో థ్రెడింగ్ చేస్తూ వచ్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక... ‘దివా’ అనే మొదటి థ్రెడింగ్ సెలూన్‌ను ప్రారంభించారు. ‘‘ఆ వ్యాపారంలో గొప్ప ఎదుగుదలను చూశాను. మరికొన్ని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాను. ఈలోగా ఊహించని సమస్య వచ్చి పడింది. అదే... లైసెన్స్’’ అని చెప్పారామె. 2018 ఫిబ్రవరిలో... మిసిసిపీ బోర్డ్ ఆఫ్ కాస్మెటాలజీ అధికారి ఒకరు ఆమె సెలూన్‌కు వచ్చారు. ‘‘ఐబ్రో థ్రెడింగ్ చేసే ఎవరికైనా లైసెన్స్ తప్పనిసరి’’ అంటూ ఆమె వ్యాపారాన్ని మూసేయించారు. ‘‘అక్కడ చట్టబద్ధంగా నా వ్యాపారాన్ని కొనసాగించాలంటే... 600 గంటల కాస్మెటాలజీ శిక్షణను పూర్తి చేయాలి. ఆ తరగతులకు వేల డాలర్లు ఖర్చవుతుంది. కానీ ఆ శిక్షణలో ఒక్క గుంట కూడా ఐబ్రో థ్రెడింగ్‌కు సంబంధించినది కాదు. చట్టప్రకారం... ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కావడానికి 165 గంటల శిక్షణ సరిపోయేచోట... వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం లేని ఒక పని కోసం, గంట కూడా లేని శిక్షణ కోసం 600 గంటల సమయం, వేలాది డాలర్లు ఖర్చు చేయడంలో నాకు ఔచిత్యం కనిపించలేదు’’ అంటారు దీప. సెలూన్ మూసివేత ఆర్థికంగానే కాదు... మానసికంగాను, ఆమె చదువుపైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆ సమయంలో ఎన్నో ప్రత్యామ్నాయాల కోసం ఆమె వెతికారు. నేపాల్‌లో తను పొందిన బ్యూటీషియన్ సర్టిఫికెట్‌ను జత చేస్తూ... లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బోర్డు దాన్ని తిరస్కరించింది. లైసెన్సింగ్ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేశారు. అది కూడా తిరస్కరణకు గురయింది.

ఒత్తిడి ఎదుర్కొన్నా...
‘‘250 ఏళ్ళ క్రితం... 1776 జులై 4న సంతకం చేసిన అమెరికా స్వాతంత్య్ర ప్రకటన... ప్రజలందరూ సమానులేననీ, ఎటువంటి జోక్యం లేకుండా జీవించే హక్కునూ, స్వేచ్ఛను, సంతోషాన్ని పొందే హక్కును కలిగి ఉన్నారని చెబుతోంది. ముఖ్యంగా వ్యాపార, ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించాల్సిన దేశంలో... ఇటువంటి చట్టాలు ఆ స్వేచ్ఛను హరిస్తున్నాయి. ‘ఇది న్యాయమేనా?’ అనుకున్నాను. తరువాత ఏంచేయాలని ఆలోచిస్తున్న సమయంలో... లాభాపేక్ష లేని ప్రజా ప్రయోజన న్యాయ సంస్థ అయిన ‘మిసిసిపీ జస్టిస్ ఇన్‌స్టిట్యూట్’ డైరెక్టర్ ఆరోన్ రైస్ గురించి తెలిసింది. వెంటనే ఆరోన్‌ను సంప్రతించాను. నా కథంతా విన్న తరువాత... నా కేసును ఉచితంగా చేపట్టారు. మిసిసిపీ రాష్ట్ర బోర్డు మీద 2019లో దావా వేశాం. కానీ ‘‘నువ్వు వేరే దేశానికి చెందిన విద్యార్థినివి. చట్టపరమైన మార్గాలను అనుసరించకూడదు’’ అని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ కేసును వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. కానీ నేను ముందుకే కొనసాగాను’’ అని చెప్పారు దీప. ఈ కేసు గురించి మిసిసిపీ రాష్ట్ర ప్రతినిధుల సభ దృష్టికి ఆరోన్ తీసుకువచ్చారు. అదే సమయంలో... శస్త్రచికిత్సలు అవసరంలేని సౌందర్య సేవలపై ఉన్న ఆక్షలను నిరసిస్తూ కోర్టుల్లో పలు కేసులు దాఖలు అవుతూండడంతో... సంబంధిత చట్టాన్ని మార్చాలంటూ చట్ట సభ సభ్యుల మీద ఒత్తిడి పెరిగింది. చివరకు 2021లో భారీ మెజారిటీతో సంబంధిత బిల్లు ఆమోదం పొందింది. దాని ప్రకారం... మేకప్, ఐబ్రో థ్రెడ్డింగ్‌లాంటి సేవలకు లైసెన్స్ నుంచి మినహాయింపు లభించింది. ‘‘వలస వచ్చిన వ్యక్తిగా అమెరికన్ వ్యవస్థలో నాకు అవరోధాలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించడానికి ఆరోన్ లాంటి వ్యక్తుల రూపంలో రక్షించే వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది’’ అంటారామె.
ఒకే విధానం కోసం గళమెత్తుతా...
చట్టంలో మార్పు తరువాత... మరో నాలుగు సెలూన్లను వివిధ ప్రాంతాల్లో ఆమె ప్రారంభించారు. ‘వాల్‌మార్ట్’తో ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల మొదటివారంలో ‘అమెరికా 250’ సందర్భంగా ‘నేపాల్ అమెరికా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ జరిగింది. ఆ సందర్భంగా దీప జీవితం ఆధారంగా రూపొందిన ‘థ్రెడింగ్ ది అమెరికన్ డ్రీమ్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దానికి దర్శకుడు ఆశిష్ శ్రేష్ట. 300 డాలర్ల పెట్టుబడితో ఆమె వ్యాపారాన్ని ఆరంభించి, చట్టాల మార్పు కోసం పోరాడిన తీరును అది వివరించింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ... ‘‘నా వీసా హోదా కూడా మారింది. సైన్స్, కళలు, విద్య, వ్యాపారం, క్రీడల్లో అసాధారణ సామర్థ్యాలు కలిగిన విదేశీ పౌరులకు ఇచ్చే గ్రీన్ కార్డ్ ‘ఇబి1ఎ వీసా’ నాకు లభించింది. అనేకమంది ఇప్పుడు ఈ వ్యాపారంలో ప్రవేశిస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘ఇప్పటికే థ్రెడింగ్ మీద ఆంక్షలను 14 రాష్ట్రాలు తొలగించాయి. కానీ విడివిడిగా ప్రతి రాష్ట్రం ఇలా చేసేవరకూ ఎంతకాలం నిరీక్షించాలి? మొత్తం దేశమంతటా ఒకే విధానం ఉండాలని నా గళం బలంగా వినిపిస్తాను’’ అంటున్న దీప పోరాటపటిమ ఎందరికో ప్రేరణనిస్తోంది.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News